తమిళనాడు: తన భార్యతో తరచూ ఘర్షణ పడుతుందనే కారణంతో వదిననూ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసిన మరిదిని మప్పేడు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాలు. తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్ ఇరుళంజేరి గ్రామానికి చెందిన ఇళయరాజ. ఇతడికి అదే ప్రాంతానికి చెందిన శాంతిమేరితో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు వున్నారు.
కాగా ఇళయరాజ సోదరుడు ఇసైమేగం(29). ఇతడికి పేరంబాక్కం గ్రామానికి చెందిన లావణ్య(24)తో నాలుగు నెలల క్రితం వివాహం జరిగింది. ప్రస్తుతం లావణ్య మూడు నెలల గర్బవతి. ప్రస్తుతం ఉమ్మడి కుటుంబంగా నివాసం ఉంటున్నారు. కాగా శాంతిమేరికి వివాహమై రెండు సంవత్సరాల తరువాత పిల్లలు పుట్టగా, లావణ్యకు వివాహమైన నాలుగు నెలలకే గర్బం దాల్చింది. ఈ విషయమై శాంతిమేరి తరచూ లావణ్యకు వివాహానికి ముందే వేరొకరితో సంబంధం ఉందంటూ ఇబ్బంది పెట్టినట్టు తెలుస్తోంది.
ఇదే విషయమై ఆదివారం రాత్రి శాంతిమేరికి, లావణ్యకు చిన్నపాటి ఘర్షణ జరగడంతో ఆగ్రహించిన ఇసైమేగం తన భార్యకు అక్రమ సంబందాన్ని అంటగట్టుతున్నారనే ఆగ్రహంతో వదినపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడ్డన శాంతిమేరిని స్థానికులు చికిత్స కోసం తిరువళ్లూరుకు తరలించగా మార్గంమధ్యలోనే మృతిచెందింది. ఈ ఘటన ఇరుళంజేరిలో తీవ్ర సంచనలం కలిగింది. మప్పేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


