
‘ప్లాస్టిక్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా గుర్తింపు పొందిన ప్రొఫెసర్ రాజగోపాలన్ వాసుదేవన్ గురించి చాలామందికి తెలియదు. తమిళనాడు మధురైకి చెందిన ఆయన వినూత్న ప్రయోగాలకు పెట్టింది పేరు! తిరువనంతపురంలోని త్యాగరాజర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో కెమిస్ట్రీ బోధకుడిగా ఉన్న వాసుదేవన్, 2002లో ఒక గొప్ప ప్రయత్నం చేసి ప్రపంచాన్నే అవాక్కయ్యేలా చేశారు.
తమ కళాశాల ప్రాంగణంలోనే ప్లాస్టిక్ వ్యర్థాలతో ఒక రోడ్డును నిర్మించారు. అది తారురోడ్డు కంటే చాలా దృఢంగా, ఎక్కువకాలం చెక్కచెదరకుండా ఉండటంతో 2006లో ఆ ఆవిష్కరణకు పేటెంట్ లభించింది. ఇలాంటి రోడ్లు వేయడంతో ప్లాస్టిక్ వ్యర్థాలను గణనీయంగా నియంత్రించడంతో పాటు రోడ్లకు తరచు మరమ్మత్తులు చేయాల్సిన సమస్య కూడా ఉండదు. ఎందుకంటే, ప్లాస్టిక్ వ్యర్థాలతో వాసుదేవన్ నిర్మించిన రోడ్డు సుమారు పదేళ్లకు పైగానే చెక్కు చెదరకుండా ఉంటుందని తేలింది.
ఆయన అభివృద్ధి చేసిన ఈ పద్ధతిలో, ముందుగా తడిలేని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, శుభ్రం చేసి, చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. ఈ ముక్కలను 170 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కరిగించి, వేడి చేసిన కంకరలో కలుపుతారు. ఈ మిశ్రమం రోడ్ల నిర్మాణానికి చక్కగా ఉపయోగపడుతుంది. ప్లాస్టిక్ కలిపిన రోడ్లు సాధారణ తారు రోడ్ల మాదిరిగా నీటిని లోపలికి పీల్చుకోవు, దాంతో రోడ్లు్ల చాలాకాలం చెక్కు చెదరవు.
ప్రొఫెసర్ వాసుదేవన్ కేవలం ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లనే కాదు ఫ్లోరింగ్ కోసం ‘ప్లాస్టోన్’లను తయారు చేశారు. వీటిని ప్లాస్టిక్, రాళ్ల సాయంతో చిన్న చిన్న ఇటుకల్లా తయారు చేస్తారు. ఇవి చాలా దృఢంగా, నీటిని పీల్చుకోకుండా ఉంటాయి. ఒక్కో ప్లాస్టోన్ ఇటుక తయారీకి సుమారు 300 ప్లాస్టిక్ క్యారీ బ్యాగులు, 6 పీఈటీ బాటిళ్లు అవసరం అవుతాయట. ఆరుబయట సిమెంట్ ఇటుకలు పరిచే కంటే ఈ ప్లాస్టోన్స్ పరిస్తే మన్నికగా ఉంటాయి.
పైగా సిమెంట్ ఇటుకల కంటే వీటిని చాలా చౌకగా సిద్ధం చేసుకోవచ్చని తేలింది. వాసుదేవన్ అందించిన సేవలకు గుర్తింపుగా 2018లో ఆయనకు ‘పద్మశ్రీ’ లభించింది. మరుసటి ఏడాది ‘ఆసియన్ సైంటిస్ట్ 100’ ఎంపికలో భాగంగా– ఆయన ఆసియన్ సైంటిస్ట్ పురస్కారం పొందారు. దేశవ్యాప్తంగా ప్లాస్టిక్ రోడ్ల నిర్మాణానికి వాసుదేవన్ స్ఫూర్తిదాయకంగా నిలిచారు.
(చదవండి: ఇవోరకం పూతరేకులు..!)