రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.30 వేల కోట్ల భారం
రోడ్డుపైకి వచ్చేవారివే కాదు.. ఇంట్లో కూర్చున్నవారి జేబులూ ఖాళీ
రెండు వరుసల రోడ్డు కిలోమీటర్‌కు రూ.10 కోట్లు ఖర్చు
కాంట్రాక్టర్లు ఖర్చు చేసేది రూ.7,761 కోట్లు.. కానీ, అంతకు రెట్టింపు చెల్లింపు
హైబ్రిడ్ యాన్యుటీలో చంద్రబాబు కొత్త దోపిడీ ప్రాజెక్టు
సెస్‌లు, టోల్ రూపంలో మొత్తం ఖర్చు ప్రజల నుంచే వసూలు
వ్యయంలో ప్రభుత్వ వాటా 40 శాతం, యాన్యుటీ డెవలపర్‌ది 60 శాతం
తొలి 2 దశల్లో 600 కి.మీ. చొప్పున, మూడో దశలో 300 కి.మీ. రోడ్ల నిర్మాణం
కాంట్రాక్టర్‌కు వడ్డీతో సహా వాయిదాల్లో చెల్లించేది రూ.15,326 కోట్లు
అసలు రూ.7,761 కోట్లు, వాయిదాలు, వడ్డీ రూ.7,565 కోట్లు
వివిధ సెస్‌ల రూపంలో రూ.24,368 కోట్లు, టోల్ కింద వాహనదారుల నుంచి రూ.6 వేల కోట్లు వసూలు
వాణిజ్య కార్యకలాపాలకు ఆర్‌అండ్‌బీ భూములు, ఆస్తులు ప్రైవేట్‌కు లీజు
ఇందుకోసం కన్సల్టెంట్ నియామకానికి ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు
పేరు... హైబ్రిడ్ యాన్యుటీ! తీరు... ప్రజాధనం లూటీ! ఇదీ చంద్రబాబు ప్రభుత్వం కొత్త దోపిడీ ప్రాజెక్టు..! ఈ విధానంలో రోడ్ల నిర్మాణం ద్వారా ఖజానా నుంచి కాంట్రాక్టర్లకు భారీగా సమర్పించేందుకు సిద్ధమైంది. అవసరమైన నిధులను పెట్రోల్, డీజిల్‌తో పాటు మోటారు వాహనాల పన్ను, గనులు, ఖనిజాలపై సెస్ రూపంలో, రహదారులు–భవనాల శాఖ భూములు, ఆస్తులను వ్యాపారం కోసం ప్రైవేట్‌కు లీజుకు ఇవ్వడం ద్వారా సమకూర్చనుంది.
అంతటితో ఆగకుండా టోల్ చార్జీల పేరుతో వాహనదారుల నుంచి ముక్కుపిండి భారీగా వసూలు చేయనుంది. దారుణం ఏమంటే... రోడ్డుపైకి వచ్చిన ప్రజలనే కాదు ఇంట్లో ఉన్నవారి జేబులనూ బాబు సర్కారు ఖాళీ చేయనుంది. అంటే, కాంట్రాక్టర్‌కు దండిగా ఆదాయం...! రాష్ట్ర ఖజానాపై భారీగా భారం అన్నమాట...! అదేంటో చూడండి...
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో హైబ్రిడ్ యాన్యుటీ పద్ధతిలో మూడు దశల్లో 1,500 కిలోమీటర్ల మేర రెండు వరుసల రహదారులను నిర్మించాలని సీఎం చంద్రబాబు ప్రభుత్వం తలపెట్టింది. ఇందులోభాగంగా కి.మీ.కు రూ.10 కోట్లకు పైగా (రూ.15,326 కోట్లు) వ్యయం చేస్తూ... తొలి రెండు దశల్లో 600 కి.మీ. చొప్పున, మూడో దశల్లో 300 కి.మీ. మేర మూడేళ్లలో నిర్మాణం చేపట్టనుంది.
కాగా, ప్రాజెక్టు ఖర్చులో 40 శాతం నిధులను ప్రభుత్వం సమకూర్చుతుంది. మిగతా 60 శాతంను కాంట్రాక్టు సంస్థ భరిస్తుంది. ప్రాజెక్టు కాల వ్యవధి 19 ఏళ్లు కాగా.. మూడేళ్లలో నిర్మాణం పూర్తవుతుంది. అనంతరం సంబంధిత సంస్థకు 16 ఏళ్ల పాటు ప్రభుత్వం అసలు, వడ్డీ కడుతుంది.
భూసేకరణ, పునరావాసం ప్రభుత్వ బాధ్యతే..
1,500 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం భూ సేకరణ, పునరావాసం, కేపిటల్ గ్రాంట్ కింద రూ.4 వేల కోట్లు వ్యయం చేయనుంది. ఈ మొత్తాన్ని బ్యాంకుల నుంచి అప్పు రూపంలో సమీకరిస్తుంది. ఇక యాన్యుటీ కాంట్రాక్టర్ రూ.7,761 కోట్లు ఖర్చు చేయనున్నారు.
దీనికిగాను 16 ఏళ్లలో రాష్ట్ర ప్రభుత్వం అసలు (రూ.7,761 కోట్లు)తో పాటు బ్యాంకు వడ్డీ రూపంలో మరో రూ.7,565 కోట్లు చెల్లించనుంది. మొత్తం రూ.15,326 కోట్లు నిర్మాణ సంస్థకు ధారపోయనున్నారు. ఏడాదికి యాన్యుటీ, రుణ వడ్డీ కింద రూ.960 కోట్లు చెల్లించనుంది. అంటే, కాంట్రాక్టర్ వ్యయం చేసినదానికి ప్రభుత్వం రెట్టింపు చెల్లిస్తుంది.
మొత్తం వ్యయం ప్రజల నుంచే గుంజుడు
1,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి అయ్యే మొత్తం వ్యయాన్ని వివిధ సెస్‌లు, టోల్ రూపంలో 16 ఏళ్లలో ప్రజల నుంచి గుంజేలా చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. అదెలాగంటే... పెట్రోల్, డీజిల్‌పై రూపాయి చొప్పున సెస్ విధించడం ద్వారా రూ.732 కోట్లు, గనులు–ఖనిజాలపై పది శాతం సెస్ వేసి రూ.441 కోట్లు, మోటారు వాహనాలపై పది శాతం సెస్ బాదుడుతో రూ.350 కోట్లు రాబట్టనున్నారు. ఇవన్నీ కలిపితే ఏడాదికి రూ.1,523 కోట్లు.
ఇలా ఓపక్క వివిధ సెస్‌ల రూపంలో భారీగా ప్రజల నుంచి డబ్బులు గుంజుతూనే, మరోపక్క రోడ్డెక్కేవారిపై టోల్ బాదుడు కొనసాగించనున్నారు. రోడ్లు పూర్తవగానే కాంట్రాక్టు సంస్థకు టోల్‌గేట్లు పెట్టి చార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు ఇవ్వనున్నారు. దీనిద్వారా ఏటా రూ.375 కోట్ల ఆదాయం రానున్నట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం 16 ఏళ్లకు చూస్తే రూ.6 వేల కోట్లు కానుంది.
ప్రైవేట్ డెవలపర్ రాయితీ కాలంలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టు రూపొందించడం, నిర్మించడం, ఫైనాన్సింగ్ బాధ్యత తీసుకుంటారు. అంటే, వసూలు చేసిన టోల్ మొత్తం నిర్మాణ సంస్థకు వెళ్తుంది. ఇవేకాక పోర్ట్ కార్గో, ఆస్తుల రిజిస్ట్రేషన్లపైనా సెస్‌లు వేయనున్నారు. రహదారులు–భవనాల శాఖ భూములు, ఆస్తులను వాణిజ్య అవసరాలకు ప్రైవేట్ సంస్థలు, వ్యక్తులకు దీర్ఘకాలిక లీజుకు ఇస్తారు.
ఇందుకోసం కన్సల్టెంట్ నియామకానికి ఆర్థిక శాఖకు ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదనలు పంపింది. రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.30 వేల కోట్ల భారం పడనుందివెరసి... హైబ్రిడ్ యాన్యుటీలో ఇటు ప్రజల జేబులకు చిల్లు.. అటు ఖజానాపై భారీ భారం.. డెవలపర్‌కు ఇబ్బడిముబ్బడి ఆదాయం..! ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త దోపిడీ స్కెచ్.


