సరిహద్దు రోడ్లు జాతీయ భద్రతకు జీవనాధారాలు
125 బీఆర్‌ఓ ప్రాజెక్టులను జాతికి అంకితమిచ్చాక రాజ్‌నాథ్ వ్యాఖ్య
లేహ్: సరిహద్దుల వెంట జాతీయ భద్రతలో తమ ప్రభుత్వ నిబద్ధతకు ఈ నూతన రహదారులే ప్రబల నిదర్శనాలు అని కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. సరిహద్దు రోడ్లు జాతీయ భద్రతకు జీవనాధారాలని, మెరుగైన అనుసంధానతతో భారీ ప్రయోజనాలు ఒనగూరతాయని రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
సరిహద్దుల వెంట బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) కొత్తగా నిర్మించిన 125 ప్రాజెక్టులను ఆదివారం ఆయన లేహ్‌లో జరిగిన కార్యక్రమంలో జాతికి అంకితమిచ్చాక ప్రసంగించారు.
లద్దాఖ్, జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాలతోపాటు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, మిజోరం రాష్ట్రాల్లో మొత్తంగా రూ.5,000 కోట్ల వ్యయంతో సరిహద్దుల వెంట 28 రహదారులు, 93 వంతెనలు, నాలుగు ఇతర నిర్మాణాలను బీఆర్‌వో విజయవంతంగా పూర్తిచేసింది. బీఆర్‌వో చరిత్రలో ఒకేరోజు ఇన్ని ప్రాజెక్టుల ప్రారం¿ోత్సవం జరగడం ఇదే తొలిసారి. ‘‘సరిహద్దు మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంలో ప్రభుత్వ నిబద్ధతకు ఇవి ప్రబల నిదర్శనాలు. మన సైనికుల శౌర్యం, ధైర్యం మనకు స్ఫూర్తిదాయకం.
దేశ సేవలో ప్రాణాలను అరి్పంచిన వీరులకు ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టును అంకితమిస్తున్నా. అత్యంత అనువైన రహదారులు అనేవి సరిహద్దుల వెంట సైన్యం విజయవంతమైన సైనిక ఆపరేషన్లు చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి. అద్భుతమైన రోడ్ల అనుసంధానతతోనే చక్కటి సైనిక విజయాలను సాధించగలం. ఆత్మనిర్భర్ భారత్ దార్శనికతకు అనుగుణంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో పాటు షెడ్యూల్ కంటే ముందే పూర్తి చేయడం విశేషం’’అని బీఆర్‌ఓ విభాగాన్ని రాజ్‌నాథ్ పొగడ్తల్లో ముంచెత్తారు.
‘‘సరిహద్దును అనుసంధానం చేయడం, భద్రతను బలోపేతం చేయడమే కాకుండా స్థానిక ఆర్థిక వ్యవస్థలను అభివృద్ధి చేస్తుందని, ప్రకృతి విపత్తుల సమయాల్లో సహాయక చర్యల వేగాన్ని పెంచుతుంది. సాయుధ బలగాలతోపాటు బీఆర్‌ఓ సిబ్బంది, సరిహద్దు ప్రాంతాల పౌరులు జాతీయ భద్రతలో భాగస్వాములవుతున్నారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలి’’అని ఆయన పిలుపునిచ్చారు. లద్దాఖ్‌లోని దుర్బుక్–శ్యోక్–దౌలత్ బేగ్ ఓల్డీ మధ్య 920 మీటర్ల పొడవునా నిర్మించిన సొరంగం ఇంజనీరింగ్ అద్భుతం అని కొనియాడారు.
రూ.1.51 లక్షల కోట్లకు దేశీయ రక్షణ ఉత్పత్తి
‘‘రక్షణరంగ పరిశ్రమలో భారత్ అద్భుతమైన ప్రగతిని కనబరుస్తోంది. 2014లో రూ.46,000 కోట్లుగా ఉన్న రక్షణ ఉత్పత్తుల విలువ ఇప్పుడు రికార్డు స్థాయిలో రూ.1.51 లక్షల కోట్లకు పెరిగింది. రూ. 1,000 కోట్ల కంటే తక్కువగా ఉన్న మన రక్షణ ఎగుమతులు ఇప్పుడు రూ. 24,000 కోట్లకు చేరుకున్నాయి’’అని గుర్తుచేశారు. ‘‘2024–25 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బీఆర్‌ఓ రూ.16,690 కోట్ల వ్యయంతో రోడ్లను నిర్మించింది.
2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.18,700 కోట్ల విలువైన మౌలిక వసతుల ప్రాజెక్టులను పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గత రెండేళ్లలో బీఆర్‌ఓ 356 మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక మైలురాయి. జాతీయ భద్రతలో బీఆర్‌ఓ పాత్రను గుర్తించిన ప్రభుత్వం 2025–26లో బడ్జెట్‌ను రూ.6,500 కోట్ల నుంచి రూ.7,146 కోట్లకు పెంచింది’’అని చెప్పారు.


