కొనసాగిన విమానాల రద్దు పర్వం
మరోవైపు పెరిగిన విమానరాకపోకల సంఖ్య
దేశవ్యాప్తంగా ప్రయాణికులకు కాస్తంత ఊరట
ముంబై: ఇండిగో సంక్షోభం ఆరో రోజు సైతం కొనసాగింది. ఆదివారం ఒక్కరోజే మరో 650 విమానాలు రద్దయ్యాయి. ఢిల్లీలో 118, ముంబైలో 121 విమానాలు రద్దయ్యాయి. శుక్రవారం, శనివారంతో పోలిస్తే పరిస్థితి చాలావరకు అదుపులోకి వచ్చినట్లు ఇండిగో వర్గాలు వెల్లడించాయి. అయితే ఆరో రోజు ప్రయాణికులకు కొంత ఊరట లభించింది. విమానాల సంక్షోభం క్రమంగా కుదుటపడుతున్న సంకేతాలు కనిపించాయి.
దేశీయ, అంతర్జాతీయ సర్వీసులకు సంబంధించి మొత్తం 2,300 విమానాలకుగాను ఆదివారం 1,650 విమానాలు రాకపోకలు సాగించాయి. ఈ నెల 10వ తేదీ కల్లా సాధారణ పరిస్థితులు నెలకొంటాయని, విమానాలు యథాతథంగా రాకపోకలు సాగిస్తాయని, ప్రయాణికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టంచేశాయి. ప్రయాణికులతోపాటు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేయడంతో ఇండిగో యాజమాన్యం నష్టనివారణ చర్యలు ప్రారంభించింది.
పరిస్థితిని చక్కదిద్దడానికి నడుం బిగించింది. ఇండిగో సిబ్బందిని ఉద్దేశించి సంస్థ సీఈఓ పీటర్ ఎల్‌బెర్స్ ఒక వీడియో సందేశం విడుదల చేశారు. ఒక్కో అడుగు వేసుకుంటూ సాధారణ స్థితికి చేరుకుంటున్నామని తెలిపారు. ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ క్రైసిస్ మేనేజ్‌మెంట్ గ్రూప్(సీఎంజీ)ను ఏర్పాటు చేసింది. ఇండిగో విమానాల రాకపోకలకు సంబంధించి తాజా పరిణామాలను ఈ గ్రూప్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది.
త్వరలో పార్లమెంటరీ కమిటీ విచారణ!
ఇండిగో సంక్షోభంపై ఆ సంస్థ ప్రతినిధులతోపాటు డీజీసీఏ అధికారులను, విమానయాన శాఖ అధికారులను పిలిపించి విచారించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం నిర్ణయించింది. త్వరలో వారికి సమన్లు జారీ చేయబోతున్నట్లు సమాచారం. పెద్ద సంఖ్యలో విమానాలు రద్దు కావడం, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవడాన్ని పట్ల సంజయ్ ఝా నేతృత్వంలో రవాణా, పర్యాటకం, సంస్కృతిపై ఏర్పాటైన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ తీవ్రంగా పరిగణిస్తోంది. ఆయా అధికారులను పిలిపించి ప్రశ్నించడంతోపాటు భవిష్యత్తులో ఇలాంటి సమస్య తలెత్తకుండా చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు సంక్షోభానికి మూల కారణాలపై విశ్లేషణ ప్రారంభించినట్లు ఇండిగో వర్గాలు పేర్కొన్నాయి.
రాజస్తాన్ పర్యాటకానికి ఎదురుదెబ్బ
రాజస్తాన్‌కు ప్రతిఏటా డిసెంబర్‌లో పర్యాటకులు భారీగా తరలివస్తుంటారు. ఇండిగో సంక్షోభం వల్ల గత ఆరు రోజులుగా ప్రముఖ పర్యాటక ప్రాంతాలు వెలవెలబోతున్నాయి. విమానాలు అందుబాటులో లేక పర్యాటకులు రావడం లేదు. చాలామంది తమ పర్యటనలు రద్దు చేసుకున్నారు. కొందరు వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, పర్యాటకులు రాకపోవడంతో చాలా నష్టపోతున్నాయని రాజస్తాన్‌లోని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హోటళ్లు, దుకాణాలు, రవాణా రంగాల్లో వేలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీరందరికీ దేశ విదేశాల
నుంచి వచ్చే పర్యాటకులే జీవనాధారం.
ఇండిగో విమానంలో పావురం కలకలం
ఇండిగో విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతున్న సమయంలో అందులో పావురం కనిపించడం తీవ్ర కలకలం సృష్టించింది. బెంగళూరు నుంచి వడోదరకు బయలుదేరిన విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. తాజాగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సరిగ్గా టేకాఫ్‌కు ముందు పావురం విమానంలో ఎగరడం చూసి ప్రయాణికులు, సిబ్బంది ఆశ్చర్యానికి గురయ్యారు. దాన్ని పట్టుకోవడానికి ప్రయతి్నంచారు. వారి చేతికి చిక్కకుండా చాలాసేపు అటుఇటూ ఎగురుతూ కనిపించింది. బయటపడేందుకు ప్రయత్నించింది. ప్రయాణికుల్లో ఒకరు ఈ దృశ్యాన్ని చిత్రీకరించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. దీనిపై నెటిజట్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇండిగోకు బ్యాడ్‌టైమ్ కొనసాగుతోందని కొందరు పేర్కొన్నారు. పావురానికి ‘బర్డింగ్ పాసు’ ఉంది కాబోలు, అందుకే లోపలికి వచ్చిందని ఒకరు చమత్కరించారు.
ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్
రద్దయిన, ఆలస్యంగా నడిచిన విమానాలకు సంబంధించి ప్రయాణికులకు ఇండిగో యాజమాన్యం శనివారం నాటికి రూ.610 కోట్లు రీఫండ్ చేసినట్లు విమానయాన శాఖ ఆదివారం వెల్లడించింది. అలాగే బ్యాగేజీని కూడా వెనక్కి ఇచ్చినట్లు తెలిపింది. ప్రయాణికులకు టిక్కెట్ల సొమ్మును ఆదివారం రాత్రి 8 గంటలకల్లా పూర్తిగా చెల్లించాలని ఇండిగోను కేంద్ర ప్రభుత్వం ఆదేశించి సంగతి తెలిసిందే. అలాగే బ్యాగేజీని 48 గంటల్లోగా అందజేయాలని పేర్కొంది. సంక్షోభంపై వివరణ ఇవ్వడానికి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్‌బెర్స్, అకౌంటబుల్ మేనేజర్ ఇసిడ్రో పోర్కిరస్‌కు మరికొంత సమయం ఇవ్వాలని డీజీసీఏ ఆదివారం నిర్ణయించింది. సోమవారం సాయంత్రంకల్లా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.


