భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌లైన్ ఇండిగో తీవ్రమైన పైలట్ కొరత సంక్షోభంలో కూరుకుపోయింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (జీడీసీఏ) కొత్తగా అమలు చేసిన ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (FDTL) నిబంధనలు, నియామక లోపం కారణంగా ఇటీవల ఇండిగో వేల సంఖ్యలో విమాన సర్వీసులను రద్దు చేసింది. ఈ నేపథ్యంలో డీజీసీఏ నుంచి ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు హెచ్చరిక నోటీసు కూడా జారీ అయింది.
పైలట్ల నియామకానికి ప్రణాళికలు
కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనలకు అనుగుణంగా పైలట్ సంక్షోభాన్ని పరిష్కరించడానికి ఇండిగో తన నియామక షరతులను ఎత్తివేసింది. డీజీసీఏకు సమర్పించిన ప్రణాళికల ప్రకారం ఇండిగో వేగంగా పైలట్లను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఫిబ్రవరి 10, 2026 నాటికి 158 మంది కొత్త పైలట్లను నియమించుకోవాలని నిర్ణయించింది. రాబోయే 12 నెలల్లో 900 మంది (300 మంది కెప్టెన్లు, 600 మంది జూనియర్ ఫస్ట్ ఆఫీసర్లు)ని క్రూలో చేర్చుకుంటామని చెప్పింది. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి మరో 742 మంది పైలట్ల నియామకం జరుపుతామని పేర్కొంది.
ప్రస్తుతం 2,357 కెప్టెన్లు, 2,194 మంది ఫస్ట్ ఆఫీసర్లు ఉన్న ఇండిగో ఫిబ్రవరి 10 నాటికి మొత్తం 2,425 కెప్టెన్లు, 2,284 మంది ఫస్ట్ ఆఫీసర్లకు పెంచాలని ప్రణాళిక వేసింది.
విశ్లేషకుల హెచ్చరిక
ఎలారా సెక్యూరిటీస్ అంచనా ప్రకారం, ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను పూర్తిగా పాటించేందుకు ఇండిగోకు ఫిబ్రవరి నాటికి కనీసం 1,000 మంది పైలట్లు అవసరం. కెప్టెన్లకు 12 నెలలు, కో-పైలట్లకు 6 నెలల సుదీర్ఘ నోటీసు వ్యవధి కారణంగా ఈ నియామకాలు కష్టమవుతాయని ఎలారా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గగన్ దీక్షిత్ పేర్కొన్నారు.
మార్టిన్ కన్సల్టింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ మార్క్ డి మార్టిన్ ప్రకారం ఇండిగోకు వాస్తవానికి 5,525 మంది పైలట్లు అవసరం. కానీ, డిసెంబర్ ఫైలింగ్‌లో 4,551 మంది మాత్రమే ఉన్నారు. అంటే 974 మంది కొరత ఉంది. విదేశీ పైలట్ల నియామకానికి రెగ్యులేటరీ క్లియరెన్స్‌కు కూడా మూడు నెలలు పడుతుంది. ప్రస్తుతం ఇండిగో ప్రతి విమానానికి 2.5 మంది పైలట్లతో పనిచేస్తుండగా ఎయిర్ ఇండియా, ఆకాసా ఎయిర్ వంటి ఇతర ఎయిర్‌లైన్స్‌లు 5.4 మంది పైలట్లతో పనిచేస్తున్నాయి.
విమానాల రద్దు కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇండిగో డిసెంబర్ 10-15 నాటికి ఆపరేషన్లు సాధారణ స్థితికి చేరుకుంటాయని అంచనా వేస్తోంది. ప్రయాణికుల అసౌకర్యాన్ని తగ్గించడానికి రద్దులు, రీషెడ్యూలింగ్‌పై పూర్తి వేవర్‌లను ప్రకటించింది.
డీజీసీఏ హెచ్చరిక, జరిమానాకు అవకాశం
నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చిన కొత్త ఎఫ్‌డీటీఎల్ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు డిసెంబర్ 6న డీజీసీఏ, ఇండిగో సీఈఓ పీటర్ ఎల్బర్స్‌కు హెచ్చరిక నోటీసు జారీ చేసింది. ఆపరేషన్లలో లోపాల కారణంగా జరిమానాలు లేదా సస్పెన్షన్ వంటి చర్యలు తీసుకోవచ్చని నోటీసులో స్పష్టం చేసింది. ఈ నిబంధనల నుంచి ఇండిగోకు మాత్రమే ఫిబ్రవరి 10 వరకు మినహాయింపు ఇచ్చారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు ఇంకెంత పెరుగుతాయో తెలుసా?


