అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో బంగారం ధరలు చారిత్రక రికార్డులు సృష్టిస్తున్నాయి. గ్లోబల్ సెంట్రల్ బ్యాంకుల నుంచి వస్తున్న భారీ కొనుగోలు డిమాండ్‌కు తోడు భారత రూపాయి విలువ జీవితకాల కనిష్ఠాలకు పడిపోవడంతో దేశీయంగా బంగారం ధరలు మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోయాయి. ఇటీవల గ్రాము బంగారం ధర రూ.13,015 (పది గ్రాములకు సుమారు రూ.1,30,150) మార్క్‌ను తాకింది. ఆర్థిక నిపుణుల విశ్లేషణ ప్రకారం, ఈ ధోరణి కొనసాగుతూ 2026లో బంగారం ధరలు మరో 5% నుంచి 30% వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఆర్థిక అస్థిరత నేపథ్యంలో బంగారం సురక్షిత ఆస్తిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది.
సెంట్రల్ బ్యాంకుల రికార్డు కొనుగోలు
2025లో ఆర్‌బీఐ తన బంగారు నిల్వలను గణనీయంగా పెంచింది. మార్చి 2025 నుంచి సెప్టెంబర్ 2025 వరకు ఆర్‌బీఐ ఏకంగా 64 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేసింది. దీంతో దేశ మొత్తం బంగారం నిల్వలు 880.2 టన్నులకు చేరాయి. దీని మొత్తం విలువ 100 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. చైనా, టర్కీ వంటి దేశాల సెంట్రల్ బ్యాంకులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నాయి. అక్టోబర్ 2025లో సెంట్రల్ బ్యాంకులు మొత్తంగా 53 టన్నుల బంగారాన్ని కొనుగోలు చేశాయి. ఇది 2025లో అత్యధిక నెలవారీ కొనుగోలుగా నమోదైంది. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) అంచనా ప్రకారం, 2025 సంవత్సరంలో ఈ కొనుగోలుతో మొత్తంగా బంగారం 750-900 మెట్రిక్ టన్నులకు చేరే అవకాశం ఉంది.
రూపాయి బలహీనత
అంతర్జాతీయ మార్కెట్ ధరలతో పాటు భారత రూపాయి బలహీనపడటం దేశీయంగా బంగారం ధరలను మరింత పెంచింది. డిసెంబర్ 2025లో డాలర్ విలువ సుమారు రూ.90.20కి చేరింది. దాంతో జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. 2025లో రూపాయి సగటు రేటు రూ.86.96/డాలర్‌గా ఉంది. రూపాయి బలహీనత వల్ల విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బంగారం ధర కారణంగా కొనుగోలుదారులకు మరింత ఖరీదైనదిగా మార్చింది. తద్వారా దేశీయ ధరలు విపరీతంగా పెరిగాయి.
ఆర్థిక అస్థిరతలు
బంగారం ధరల పెరుగుదలకు ప్రపంచ ఆర్థిక అస్థిరత కూడా దోహదపడుతోంది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈజింగ్, పెరుగుతున్న అంతర్జాతీయ అప్పు, అధిక ద్రవ్యోల్బణం, ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ సంఘర్షణల వంటి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారాన్ని అత్యంత ఆకర్షణీయమైన పెట్టుబడి సాధనంగా మార్చాయి. 2025లో బంగారం ధర 48% పెరిగి 3,896 డాలర్లు/ఔన్స్‌కు చేరింది. దాంతో ఇది 1979 తర్వాత అత్యధిక వార్షిక పెరుగుదలగా ఉంది.
2026లో బంగారం అంచనాలు
నిపుణుల అంచనాల ప్రకారం, 2026లో బంగారం ధరలు ఆర్థిక మాంద్యం తీవ్రతపై ఆధారపడి ప్రస్తుత స్థాయి నుంచి 5-15% వరకు పెరగవచ్చు. డబ్ల్యూజీసీ ప్రకారం అంతర్జాతీయంగా ధరలు 4,000-4,500 డాలర్లు/ఔన్స్ మధ్య స్థిరపడవచ్చు. జేపీ మోర్గాన్ ప్రకారం క్యూ4 2025 నాటికి 3,675 డాలర్లు/ఔన్స్‌కు, క్యూ2 2026 నాటికి 4,000 డాలర్లకి చేరవచ్చు.
ఇదీ చదవండి: సీనియర్ ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా


