అందుకే డీజీసీఏ దిగొచ్చేదాకా ఇండిగో సంస్థ మొండిగా వ్యవహరించింది
కేంద్ర విమానయానశాఖ మంత్రి పదవికి రామ్మోహన్‌నాయుడు రాజీనామా చేయాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు
సాక్షి, అమరావతి: దేశంలో ఇండిగో విమానాల సంక్షోభం, రద్దీ, టికెట్ ధరల పెరుగుదల, భద్రతా లోపాలకు ప్రధాన కారకుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్‌రావు విమర్శించారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్‌నాయుడు విఫలమయ్యారని, తక్షణమే ఆయన తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. జూపూడి ప్రభాకర్‌రావు శనివారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
‘ఇండిగో విమాన సంస్థతో రామ్మోహన్‌నాయుడు కుమ్మక్కయ్యారు. దాని ఫలితంగానే ఇప్పుడు సంక్షోభం ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం తలదించుకునే పరిస్థితి వచ్చింది. డీజీసీఏ దిగి వచ్చేదాకా ఇండిగో మొండిగా వ్యవహరించిందంటే కారణం రామ్మోహన్‌తో కుమ్మక్కు కావడమే. ఇంత గందరగోళం నెలకొంటే ఇండిగో సంక్షోభాన్ని వదిలేసి రామ్మోహన్ నాయుడు రీల్స్ చేసుకుంటూ గడుపుతున్నారు.
ఆయన విమానయాన శాఖ మంత్రిగా కాకుండా రీల్స్ మంత్రిగా మారారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొన్ని రూల్స్ చేసింది. వాటిని కచ్చితంగా పాటించేలా చూడాలని ఆదేశాలిచ్చింది. కానీ డీజీసీఏ నిబంధనలను ఇండిగో సంస్థ పాటించేలా రామ్మోహన్ చేయలేకపోయారు. దాని ఫలితంగానే ఇప్పుడు ఇండిగో సంక్షోభం వచ్చింది.’ అని జూపూడి చెప్పారు.
కేంద్ర విమానయాన శాఖను లోకేశ్ పర్యవేక్షిస్తాడా?
‘ఇండిగో సంక్షోభంపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ వార్ రూమ్‌లో చర్చలు జరుపుతున్నారంటూ టీడీపీ నేతలు నేషనల్ మీడియాలో మాట్లాడి పరువు తీశారు. కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖను కూడా లోకేశ్ పర్యవేక్షిస్తున్నాడంటూ టీడీపీ ప్రతినిది వ్యాఖ్యలు చేశారు.
కేంద్ర మంత్రి పదవితో లోకేశ్‌కు ఏం సంబంధం? లోకేశ్, రామ్మోహన్‌లు ఏపీ పరువును తీశారు. ఇండిగో సంస్థ ఒత్తిళ్లకు కేంద్ర మంత్రి పూర్తి తలొగ్గారని దేశవ్యాప్తంగా రామ్మోహన్ పనితీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విమానం ఎక్కడమంటే భయం, నరకం, అనే స్థాయికి రామ్మోహన్ తీసుకెళ్లాడు. ఇంతటి అసమర్థ మంత్రి అవసరమా?’ అని ప్రశ్నించారు.


