చంద్రబాబు సర్కార్‌కు మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్: బుగ్గన | Buggana Rajendranath Comments On Chandrababu Government | Sakshi
Sakshi News home page

చంద్రబాబు సర్కార్‌కు మ్యాటర్ వీక్.. పబ్లిసిటీ పీక్: బుగ్గన

Feb 1 2026 6:19 PM | Updated on Feb 1 2026 7:44 PM

Buggana Rajendranath Comments On Chandrababu Government

సాక్షి, హైదరాబాద్‌: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టి కేంద్ర బడ్జెట్‌ నిరాశాజనకంగానే ఉందని, రాష్ట్రానికి దీని వల్ల ఒరిగిందేమీ లేదని మాజీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ స్పష్టం చేశారు. ముఖ్యంగా పోలవరానికి కేవలం రూ.3,300 కోట్లు మాత్రమే విదిల్చారని, అంతకు మించి రాష్టానికి ఒరిగిందేమీ లేదన్నారు. అప్పులు మాత్రం జీడీపీలో 4.3 శాతానికి తగ్గించుకున్నారని, కానీ అందుకు భిన్నంగా రాష్ట్రంలో ప్రభుత్వం మాత్రం గత బడ్జెట్‌లో చెప్పిన దాని కన్నా ఇప్పటికే రూ.16 వేల కోట్లు ఎక్కువగా అప్పులు చేసిందని ఆక్షేపించారు. గతంలో వైఎస్సార్‌సీపీ హయాంలో అప్పులు చేస్తే శ్రీలంక అయిపోతుందన విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడేమంటారని బుగ్గన ప్రశ్నించారు. ఆయన ఇంకేమన్నారంటే..:

కేంద్ర బడ్డెట్‌ నిరాశాజనకం:
కేంద్ర బడ్జెట్‌ చరిత్రలోనే అతి పెద్దది. ఇందులో ఆదాయ, వ్యయ అంచనాలు రూ.53,47,315 కోట్లు కాగా, రూ.16,95,768 కోట్లు అప్పుగా చూపారు. మూలధన వ్యయం రూ.12,21,821 కోట్లుగానూ,  ద్రవ్యలోటు రూ.16,95,765 కోట్లుగానూ చూపారు. జీడీపీలో గత సంవత్సరాలతో పోలిస్తే అప్పు 4.3 శాతానికి తగ్గడం ఒక్కటే ఊరట. సమగ్ర శిక్ష, జల్‌ జీవన్‌ మిషన్‌ వంటి పథకాలకు భారీ కేటాయింపులు చేసినా ఖర్చు మాత్రం చేయడం లేదు. గతేడాది జల్‌ జీవన్‌ మిషన్‌కు రూ.67 వేల కోట్లకు పైగా కేటాయించినా, కేవలం రూ.17 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అందులో ఏపీలోనే ప్రభుత్వం రూ.12 వేల కోట్లు అప్పులు చేసి ఖర్చు పెట్టడం విశేషం. రోడ్లు, రైలు మార్గాలకు రూ.5,98,520 కోట్లు ఖర్చుపెడతామని ప్రకటించారు. పోలవరానికి కేవలం రూ.3,300 కోట్లు మాత్రమేఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగతా ప్రాజెక్టుల ఊసే లేదు.

అప్పుల్లో కేంద్రానికి రివర్స్‌లో ఏపీ సర్కార్‌:
కేంద్రం అప్పు తగ్గించుకుంటూ వస్తుంటే.. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం అప్పులు పెంచుకుంటూ పోతోంది. ఫిబ్రవరి 3వ తేదీ నాటికి రాష్ట్ర అప్పు, కార్పోరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు అన్నీ కలిపి చూస్తే ఏకంగా అది రూ.3,14,644 కోట్లు. గత వైయస్సార్‌సీపీ ప్రభుత్వం, ఆ 5 ఏళ్లలో రెండేళ్లు కోవిడ్‌ వంటి సంక్షోభం ఉన్నా కూడా రూ.3 లక్షల కోట్ల అప్పు మాత్రమే చేసింది. అదే టీడీపీ కూటమి ప్రభుత్వం మీరు రెండేళ్లు కూడా పూర్తి కాకముందే ఆ సంఖ్యను దాటేశారు. కాగ్‌ లెక్కల ప్రకారం కేవలం ఆర్బీఐ ద్వారా ఈ ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటివరకూ రూ.81,597 కోట్లు అప్పు చేశారు. ఇది బడ్జెట్‌తో పోలిస్తే రూ.10 వేల కోట్లు ఎక్కువ. మరో రూ.3,300 కోట్లు ఫిబ్రవరి 3న తీసుకుంటున్నారు. ఇలా బడ్జెట్‌లో చెప్పిన దాని కన్నా రూ.15 వేల కోట్లకు పైగా అదనంగా అప్పులు చేస్తున్నారు. అప్పట్లో మేం అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుందన్నారు. ఇప్పుడు మీ అప్పులకు రాష్ట్రం వెనెజులా అవుతుందా?.

చంద్రబాబు మ్యాటర్‌ వీక్‌. పబ్లిసిటీ పీక్‌:
ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఆర్బీఐ ద్వారా రాష్ట్ర అభివృద్ధి రుణాలు రూ.77,040 కోట్లుగా ఉన్నాయి. దానికి ఈ నెలలో తీసుకునే రూ.3,300 కోట్లు కలిపితే మొత్తం రుణం రూ.80,340 కోట్లు అవుతుంది. కాగ్‌ లెక్కల ప్రకారం రుణాలు రూ.77,040 కోట్లు కాగా.. డిసెంబర్‌ 2న రూ.3 వేల కోట్లు, డిసెంబర్‌ 30న రూ.4 వేల కోట్లు, జనవరి 6న రూ.6,500 కోట్లు, జనవరి 27న రూ.2,500 కోట్ల అప్పు చేయగా, ఫిబ్రవరి 3న మరో రూ.3,300 కోట్ల రుణం తీసుకుంటున్నారు. అన్నీ కలిపితే రూ.96,340 కోట్లకు చేరతాయి. అవే కాకుండా, కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పులు అన్నీ కలిపి రూ.89,320 కోట్లు ఉన్నాయి.

ఒక్క రాజధాని పేరు మీదే ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంక్, హడ్కో, కేఎఫ్‌డబ్ల్యూ, ఇతర సంస్థల నుంచి రూ.47,387 కోట్లు ఇప్పటివరకూ అప్పు చేశారు. మేం ఎవరితో పోల్చుకున్నా తక్కువ అప్పులు చేశాం. అయినా పచ్చమీడియా సాయంతో మాపై దుష్ప్రచారం చేశారు. 2019 నాటికి రాష్ట్ర అప్పు రూ.2.5 లక్షల కోట్లు ఉంటే.. మేం దిగిపోయే నాటికి ఆ అప్పు రూ.3.32 లక్షల కోట్లకు పెరిగింది. మీ హయాంలో ప్రతీ సంవత్సరం 22.6 శాతం అప్పుల్ని పెంచితే, కరోనా వంటి సంక్షోభాలు ఉన్నా 13.5 శాతం మాత్రమే అప్పులు పెంచాం. అయినా వైయస్సార్‌సీపీ ప్రభుత్వంపై నిస్సిగ్గుగా దుష్ప్రచారం చేశారు. కూటమి ప్రభుత్వం ఎప్పుడు వచ్చినా ‘మ్యాటర్‌ వీక్‌ పబ్లిసిటీ పీక్‌’ అని చెప్పడానికి ఇదే నిదర్శనమని బుగ్గన రాజేంద్రనాథ్‌ వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement