అంతర్జాతీయ మార్కెట్‌లో.. ఎల్‌పీజీని అమ్మడానికి వీల్లేదు | High Court Issues Key Orders Amidst Gas Shortage | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ మార్కెట్‌లో.. ఎల్‌పీజీని అమ్మడానికి వీల్లేదు

Mar 20 2026 2:34 AM | Updated on Mar 20 2026 2:34 AM

High Court Issues Key Orders Amidst Gas Shortage

గ్యాస్‌ కొరత నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు 

సాక్షి, అమరావతి: పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌ కొరత ఏర్పడిన నేపథ్యంలో హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. చమురు శుద్ధి సంస్థలు ఎల్‌పీజీని అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయించడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ఈ మేరకు కాని్ఫడెన్స్‌ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌కు ఆదేశాలు జారీచేసింది. దేశంలో ఎల్‌­పీజీ కొరత ఉన్న సమయంలో చమురు శుద్ధి సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో విక్రయిస్తే సామాన్య ప్రజలకు తీరని నష్టంతో పాటు కష్టాలను కలిగిస్తుందని కోర్టు స్పష్టంచేసింది. 

వినియోగదారులకు వంట గ్యాస్‌ సరఫరా చేసేందుకు వీలుగా గ్యాస్‌ను పంపిణీదారులకు మాత్రమే సరఫరా చేయాలని ఆదేశించింది. దేశంలోని చమురు శుద్ధి కర్మాగారాలు ప్రొపేన్, బ్యూటేన్‌ నిల్వలను గరిష్టంగా ఎల్‌పీజీ ఉత్పత్తి కోసం ఉపయోగించడంతో పాటు ఉత్పత్తి చేసిన ఎల్‌పీజీని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లకు అందుబాటులో ఉంచి, దానిని కేవలం దేశీయ వినియోగదారులకు మాత్రమే సరఫరా చేయాలంటూ ఈనెల 5న జారీచేసిన స్వీయ ఉత్తర్వులు పక్కాగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

ఈ వ్యవహారంలో కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ, కా­న్ఫిడెన్స్‌ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌లను ఆదే­శించింది. ఇందులో భాగంగా వారికి నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 2కు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు జారీచేశారు. 

కొరత వేళ అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ ధరకు విక్రయం.. 
యుద్ధం వేళ దేశవ్యాప్తంగా వంట గ్యాస్‌కు తీవ్ర కొరత ఏర్పడిందని, అయితే కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌ ఈ పరిస్థితి ద్వారా వ్యక్తిగత లబ్ధిపొందేందుకు గ్యాస్‌ను భారీ ధరకు అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తోందని, దీనిని అడ్డుకునేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ విజయవాడలోని మేధా హిమజ శ్రీ ఎంటర్‌ప్రైజెస్‌ యజమాని నల్లమోతు దుర్జయ్, నిహాన్‌‡్ష గ్యాస్‌ ఏజెన్సీ యజమాని పారా శ్రీలక్ష్మి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ దేవానంద్‌ విచారణ జరిపారు.

కేంద్రం ఉత్తర్వులను పట్టించుకోవడంలేదు.. 
పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది ఓబిరెడ్డి మనోహర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పిటిషనర్లు కాన్ఫిడెన్స్‌ పెట్రోలి­యం ఇండియా లిమిటెడ్‌ నుంచి గ్యాస్‌ కొనుగోలు చేసి దానిని వినియోగదారులకు సరఫరా చేస్తుంటారని తెలిపారు. అయి­తే, పశ్చిమాసియాలో యు­ద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఎల్‌­పీజీ సరఫరాలో కొరత ఏర్పడిందన్నారు. యుద్ధంవల్ల అంతర్జాతీయ, దేశీయ మార్కెట్‌లలో ఎల్‌పీజీ డిమాండ్‌కు, సరఫరాకు మధ్య భారీ వ్యత్యాసం ఉందన్నారు. 

దేశంలోని చము­రు శుద్ధి కర్మాగారాలు ప్రొపేన్, బ్యూటేన్‌ నిల్వలను గరిష్టంగా ఎల్‌­పీజీ ఉత్పత్తి కోసం ఉపయోగించడంతో పాటు ఉత్పత్తి చేసిన ఎల్‌పీజీని ప్రభుత్వ రంగ సంస్థలైన ఐఓసీఎల్, హెచ్‌పీసీఎల్, బీపీసీఎల్‌లకు అందుబాటులో ఉంచి, దానిని కేవలం దేశీయ వినియోగదారులకు మాత్ర­మే సరఫరా చేయాలంటూ కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ ఈనెల 5న ఉత్తర్వులు జారీచేసిందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. 

గ్యాస్‌ కొరత ఉన్నప్పటికీ, కాన్ఫిడెన్స్‌ పెట్రోలియం ఇండియా లిమిటెడ్‌ మాత్రం గ్యాస్‌ను అంతర్జాతీయ మార్కె­ట్‌లో అధిక ధరలకు విక్రయిస్తోందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోవడంలేదని కోర్టుకు నివేదించారు. 

Advertisement
 
Advertisement
Advertisement