అకాల వర్షంతో అన్నదాతలకు అపార నష్టం
నేలకొరిగిన అరటి, బొప్పాయి.. నేలరాలిన మామిడి
రాష్ట్రంలోని పలు చోట్ల బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి తోడు ఈదురు గాలులు వీయడంతో అరటి, బొప్పాయి, తమలపాకు తోటలు నేలకొరిగాయి. ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతులు అప్పులు చేసి పండించిన పంటలు కాపు దశలో పూర్తిగా నేలకొరిగాయి. మామిడి పూత, పిందె రాలిపోయాయి. పలుచోట్ల వడగళ్ల వాన కురిసింది.
ఓబులవారిపల్లె/ఒంగోలు సబర్బన్/చింతపల్లి: తిరుపతి జిల్లా ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు మండలాల్లో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ఈదురు గాలులు తోడవడంతో అరటి, తమలపాకు తోటలు నేలకొరిగాయి. ఓబులవారిపల్లి మండలంలో దాదాపు 700 ఎకరాల్లో అరటి తోట పూర్తిగా ధ్వంసమైంది. బాలిరెడ్డిపల్లి, వైకోట, సున్నపురాళ్లపల్లి, చెన్నరాజుపోడు, జీవీ పురం, చిన్నఓరంపాడు, ఓబులవారిపల్లె గ్రామాల్లో దాదాపు 500 మంది రైతులకు చెందిన అరటి తోటలు పూర్తిగా నేలకొరిగాయి.
జీవీ పురం సమీపంలోని పంజం వెంకటరెడ్డికి చెందిన ఐదుఎకరాల అరటికాపు దశలో ఉండగా పూర్తిగా నేలకొరిగింది. బాలిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డికి చెందిన దాదాపు 20 ఎకరాల అరటి తోటకాయలతో ఉండగా నేలమట్టమైంది. 50 మంది రైతులకు చెందిన తమలపాకు తోటలు కూడా నేలకొరిగాయి. రైల్వేకోడూరు మండలంలో 62 మంది రైతులకు చెందిన 92 ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసమయ్యాయి. రెండు మండలాల్లో కలిపి దాదాపు మూడు కోట్లకుపైగా పంట నష్టం వాటిల్లింది. వర్షానికి మామిడి పూత, పిందె రాలిపోయింది.
ఉమ్మడి ప్రకాశంలో అకాల వర్షం
ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనూ బుధవారం రాత్రి నుంచి అకాల వర్షాలు కురిశాయి. త్రిపురాంతకం మండలం సోమేపల్లిలో భారీ వర్షాలకు 8 ఎకరాల్లో అరటి తోట దెబ్బతింది. పొదిలి మండలంలో వడగండ్ల వాన కురిసింది. జువ్వలేరులో బొప్పాయి పంట దెబ్బతింది. సింగరాయకొండ, జరుగుమల్లి, కొండపి, చీమకుర్తి, సంతనూతలపాడు, మర్రిపూడి మండలాల్లో మోస్తరు వర్షం కురిసింది.
చింతపల్లిలో భారీ వడగళ్ల వాన
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో గురువారం మధ్యాహ్నం భారీ వడగళ్ల వర్షం కురిసింది. ఏకధాటిగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు, ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. వాహనచోదకులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు. చింతపల్లిలో కురిసిన వడగళ్ల వర్షంతో ప్రతి గడపలో వడగళ్లు రాసులు పోసినట్టు పేరుకుపోయాయి.
అకాల వర్షం.. అన్నదాతకు నష్టం
7 జిల్లాల్లోని 16 మండలాల్లో పంటలపై ప్రభావం
4 వేల ఎకరాల్లో నçష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా గుర్తింపు
నేలకొరిగిన అరటి, బొప్పాయి.. నేలరాలిన మామిడి, బత్తాయి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలు, వడగళ్ల వానలు, ఈదురు గాలుల కారణంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లుతోంది. తిరుపతి, కృష్ణా, నెల్లూరు, శ్రీసత్యసాయి, ఎన్టీఆర్, అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. 16 మండలాల పరిధిలోని 89 గ్రామాల్లో పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. గురువారం మధ్యాహా్ననికి 2,350 మంది రైతులకు చెందిన దాదాపు 4 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు లెక్కతేల్చారు.
వెయ్యి ఎకరాల్లో వరి, 1,600 ఎకరాల్లో మొక్కజొన్న, 600 ఎకరాల్లో మినుము పంటలకు నష్టం వాటిల్లినట్టు తెలిపారు. ఈదురు గాలుల ప్రభావానికి 800 ఎకరాలకుపైగా అరటి, బొప్పాయి, చీని తోటలు పూర్తిగా నేలకొరగ్గా.. వేలాది ఎకరాల్లో మామిడి నేలరాలింది. ముఖ్యమంత్రి చంద్రబాబు వర్షాల నేపథ్యంలో వ్యవసాయ శాఖ ఇన్‌చార్జి కమిషనర్, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలను త్వరితగతిన గుర్తించి, నష్టాన్ని నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. కాగా.. ఇలాంటి విపత్తు సమయంలో నష్టాలు అంచనా వేయడమే తప్ప.. పరిహారం ఇచ్చిన పాపాన పోవడం లేదని రైతులు వాపోతున్నారు.
మరో మూడు, నాలుగు రోజులు ఇదే పరిస్థితి
రానున్న మూడు, నాలుగు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికలు రైతులను కలవరపెడుతున్నాయి. పంటలను సాధ్యమైనంత త్వరగా సేకరించి భద్రపరచాలని అధికారులు సూచించారు.


