లోక్‌సభలో ప్రకటించిన కేంద్ర మంత్రి తోకన్ సాహు
ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ‍్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హయాంలోనే పేదలకు అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగిందని లోక్‌సభలో కేంద్ర మంత్రి తోకన్ సాహు ప్రకటించారు. జగన్ హయాంలో ఐదేళ్లలో 6 లక్షల 85 వేల 864 ఇళ్ల నిర్మాణం జరిగిందని తెలిపారు.
లోక్‌సభలో ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ సహాయ మంత్రి తోకన్ సాహూ సమాధానం ఇచ్చారు. వైఎస్ జగన్ హయాంలో ఐదేళ్లలో 6,85,864 ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యాయన్నారు.
ఇళ్ల నిర్మాణానికి అప్పటి జగన్ సర్కారు రూ.22,744 కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. పీఎంఏవై పథకానికి రాష్ట్ర ప్రభుత్వ నిధులు కలిపి భారీ ఎత్తున ఇళ్ల నిర్మాణం చేపట్టింది గత వైఎస్ జగన్ ప్రభుత్వం.
నీతి ఆయోగ్ సైతం కితాబు
కాగా, ఇటీవలే.. వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన అభివృద్ధి, సంక్షేమ రంగాలకు ప్రాధాన్యంతో కొనసాగిందని నీతి ఆయోగ్ కితాబు ఇచ్చింది. ఏపీ వ్యయం నమూనా సంక్షేమ, మౌలిక సదుపాయాలపై ప్రాధాన్యతకు నిదర్శనంగా నిలుస్తోందని పేర్కొంది. గత ప్రభుత్వ హయాంలో సొంత ఆదాయంలో ఆరోగ్యకరమైన పెరుగుదల ధోరణిని సూచించిందని ఆ నివేదిక తెలిపింది. 2023-24 రాష్ట్రాల ఆర్థిక ఆరోగ్య సూచికలపై నీతి ఆయోగ్ విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను ప్రస్తావించింది.
రాష్ట్ర వ్యయం నమూనాను పరిశీలిస్తే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇచ్చిందని.. ముఖ్యంగా విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణం, సాగునీరు, ఇంధన రంగాలకు పెద్దపీట వేసిందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఖర్చులలో ఎక్కువ భాగం జీతాలు, పెన్షన్లు, వడ్డీ చెల్లింపులు లాంటి తప్పనిసరి బాధ్యతలను నిర్వర్తిస్తూనే గత ప్రభుత్వం కీలక రంగాలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ఆదాయాలు ఆరోగ్యకరమైన పెరుగుదలను సూచించాయని, జీఎస్‌టీతోపాటు వస్తువుల పన్నులు పెరిగాయని నివేదిక పేర్కొంది.
గత ప్రభుత్వంలో మూలధన వ్యయం జీఎస్‌డీపీలో 4 నుంచి 9 శాతం పరిధిలో ఉండటం ఆస్తుల సృష్టి, మౌలిక సదుపాయాల అభివృద్ధి వైపు స్థిరమైన పురోగతిని సూచిస్తోందని నివేదిక స్పష్టం చేసింది. 2023-24లో మొత్తం వ్యయంలో సామాజిక సేవల వ్యయం 52.4 శాతంతో అతి పెద్ద వాటాను కలిగి ఉందని పేర్కొంది. ఇది విద్య, ఆరోగ్యం, గృహ నిర్మాణ రంగాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇచ్చిన ప్రాధాన్యాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. ఇక ఆర్థిక సేవలు 44.6 శాతం వాటాను కలిగి ఉండగా ప్రధానంగా రవాణా, నీటి పారుదల, ఇంధన రంగాలు పెట్టుబడుల ద్వారా పురోగమించాయని నివేదిక పేర్కొంది.


