పెళ్లిళ్లకు వెళ్లలేక!  | IndiGo flight chaos spoils India wedding parties | Sakshi
Sakshi News home page

పెళ్లిళ్లకు వెళ్లలేక! 

Dec 7 2025 4:33 AM | Updated on Dec 7 2025 4:33 AM

IndiGo flight chaos spoils India wedding parties

బంధుమిత్రుల ప్రయాణాలు రద్దు 

వేడుకను అందుకోలేక అగచాట్లు 

ఇండిగో సంస్థకు శాపనార్థాలు  

ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. ఇండిగో దేశీయ విమాన సర్వీసుల నిలిపివేత తాలూకు సంక్షోభం నిజంగానే ఎన్నెన్నో పెళ్లిళ్లను నిజంగానే చావుదెబ్బ తీస్తోంది. పెళ్లి అంటేనే చెప్పలేనన్ని పనులుంటాయి. నెలల తరబడి ప్లానింగ్‌ చేసినా అంతా సజావుగా ముగిసేదాకా పెళ్లంటే ఇరు పక్షాలకూ కత్తిమీద సాము తరహా వ్యవహారమే.

 అలాంటిది, ఇండిగో దేశీయ విమాన సేవల సంక్షోభం కారణంగా నవ దంపతులు ఏకంగా తమ సొంత పెళ్లి విందు వేదికకే చేరుకోలేక చివరికి వర్చ్యువల్‌గా హాజరు కావాల్సిన విచిత్రమైన పరిస్థితి తలెత్తడం తెలిసిందే. ఈ సీజన్‌లో, అంటే నవంబర్‌ 1 నుంచి డిసెంబర్‌ 15 నడుమ దేశవ్యాప్తంగా ఏకంగా 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. అలాంటి సీజన్‌ మంచి పీక్‌లో ఉండగా ఇండిగో విమాన సేవల అంతరాయం పెళ్లిళ్లపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఆ దెబ్బకు కొన్ని వందల పెళ్లిళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.  

బ్యాచిలర్స్‌ పార్టీ గోవిందా 
ముంబైకి చెందిన వర్షా అగర్వాల్‌కు వచ్చే జనవరిలో పెళ్లి జరగనుంది. ఈలోపు తన బెస్ట్‌ ఫ్రెండ్స్‌ ఆరుగురికి కోల్‌కతాలో ఘనంగా బ్యాచిలర్స్‌ పార్టీ ఇవ్వాల ని అంతా పక్కాగా ప్లాన్‌ చేసుకుంది. తను ముంబై నుంచి ఎయిరిండియా విమానంలో ముందుగానే కోల్‌కతా చేరుకుని వారికోసం ఎదురు చూడసాగింది. కానీ ఢిల్లీ, హైదరాబాద్‌ నుంచి రావాల్సిన తన ఇద్దరు బెస్ట్‌ ఫ్రెండ్స్‌ కాస్తా కర్మ కాలి ఇండిగోలో టికె ట్లు బుక్‌ చేసుకున్నారు. 

తెలియక వారు చేసిన ఈ ఒక్క పొరపాటు చివరికి బ్యాచిలర్స్‌ పారీ్టకే పురిట్లోనే సంధి కొట్టింది. ఢిల్లీ నుంచి వరుసగా రెండు రోజుల పాటు కోల్‌కతాకు ఇండిగో తన విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసేసింది. దాంతో ఒక స్నేహితురాలితో పాటు వర్షా కూడా హతాశురాలైంది. ఇక హైదరాబాద్‌ నుంచి రావాల్సిన మిత్రురాలిది మరో వ్యథ. ఆమె సకాలానికి విమానాశ్రయానికి చేరుకున్నా డిస్‌ ప్లే బోర్డుపై ఎంతకూ కోల్‌కతా విమానం జాడేకన్పించని పరిస్థితి. ఇండిగో సిబ్బంది నుంచి కూడా అరకొ ర సమాచారమే. చివరికి విమానం ఆలస్యమన్నారు.

 అలా రెండు మూడుసార్లు జరిగి ఐదారు గంటలు గడిచాక, విమానం రద్దయిందంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ‘‘చివరికి నా బ్యాచిలర్స్‌ పార్టీని ఒకే ఒక్క ఫ్రెండ్‌తో ఏదో అయిందనిపించి ముంబై తిరిగొచ్చా. ఇండిగో నాకు మర్చిపోలేని చేదు అనుభవం మిగిల్చింది’’అంటూ మండిపడుతోంది వర్షా. జనవరిలో పుణేలో జరిగే తన పెళ్లికి ఎట్టి పరిస్థితు ల్లోనూ ఇండిగో సేవలను నమ్ముకునేది లేదని తెగేసి చెబుతోంది. వీలైతే అసలు జీవితంలో ఎన్నడూ ఇండిగో విమానమే ఎక్కబోనని కూడా అంటోంది! 
రేడియో ఆరెంజ్‌లో ఆర్‌జేగా చేసే గౌరిదీ అలాంటి వ్యథే. ఆఫీసు వ్యవహారంతో పాటు సన్నిహితుల్లో ఒకరు పెళ్లికి కూడా వెళ్లొచ్చని ఇండిగో విమానంలో టికెట్‌ బుక్‌ చేసుకుందామె. కానీ తీరా చూస్తే అది కాస్తా చివరి నిమిషంలో రద్దయింది. అది కూడా తాను విమానాశ్రయానికి చేరుకున్నాక ఇండిగో సిబ్బంది చాలాసేపటికి తీరిగ్గా వెల్లడించారు. తొలుత విమానం ఆలస్యమైందంటూ రెండుమూడుసార్లు దాటవేస్తూ వచ్చారు. 

బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లి! 
సిలిగురికి చెందిన వ్యాపారవేత్త అనీశ్‌ సింఘానియా ది కూడా ఇలాంటి బాధే. ఇండిగో నిర్వాకం వల్ల ఏకంగా తన బెస్ట్‌ ఫ్రెండ్‌ పెళ్లికే వెళ్లలేకపోయానంటూ వాపోతున్నారాయన. ‘‘డిసెంబర్‌ 4న ముంబై వెళ్లేందుకు ఇండిగోను నమ్ముకున్నా. తీరా చూస్తే ఆ సంస్థ కాస్తా నన్ను నట్టేట ముంచి చేతులు దులుపుకుంది. పోనీ ఇతర సంస్థల విమానాల్లో వెళ్దామంటే అవి కూ డా ఈ దుస్థితిని వీలైనంతగా సొమ్ము చేసుకుని నా ఆశలపై నీళ్లుజల్లాయి. పదేసి రెట్లు పెరిగిన విమాన ధరలు చెల్లించలేక అసలు ప్రయాణమే మానుకు న్నా. ఇండిగోకు నాలాంటివారి ఉసురు తగిలి తీరుతుంది’’అంటూ శాపనార్థాలు పెడుతున్నారు అనీశ్‌. 

దౌత్యాధికారికీ తప్పని తిప్పలు 
సాధారణ దేశీయ ప్రయాణికులకు మాత్రమే కాదు, భారత్‌లో సింగపూర్‌ హైకమిషనర్‌ సైమన్‌ వాంగ్‌కూ ఇలాంటి చేదు అనుభవాన్నే రుచిచూపింది ఇండిగో. తన దౌత్య సిబ్బందిలో ఒకరి పెళ్లి నిమిత్తం ఢిల్లీ నుంచి దేవగఢ్‌కు ఇండిగోలో టికెట్‌ బుక్‌ చేసుకున్నారాయన. ‘‘ఆ పొరపాటు చేసినందుకు ప్రయాణం రద్దై ఏమీ చేయలేక తీరని బాధకు లోనైన వేలాది మంది ఇండిగో ప్రయాణికుల్లో నేనూ ఒకనిగా మిగిలాను. నా కొలీగ్‌కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడం మినహా ఇంకేం చేయగలను?’’అంటూ ఎక్స్‌లో వాపోయారాయన!     

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement