breaking news
Weddings stopped
-
పెళ్లిళ్లకు వెళ్లలేక!
ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందని సామెత. ఇండిగో దేశీయ విమాన సర్వీసుల నిలిపివేత తాలూకు సంక్షోభం నిజంగానే ఎన్నెన్నో పెళ్లిళ్లను నిజంగానే చావుదెబ్బ తీస్తోంది. పెళ్లి అంటేనే చెప్పలేనన్ని పనులుంటాయి. నెలల తరబడి ప్లానింగ్ చేసినా అంతా సజావుగా ముగిసేదాకా పెళ్లంటే ఇరు పక్షాలకూ కత్తిమీద సాము తరహా వ్యవహారమే. అలాంటిది, ఇండిగో దేశీయ విమాన సేవల సంక్షోభం కారణంగా నవ దంపతులు ఏకంగా తమ సొంత పెళ్లి విందు వేదికకే చేరుకోలేక చివరికి వర్చ్యువల్‌గా హాజరు కావాల్సిన విచిత్రమైన పరిస్థితి తలెత్తడం తెలిసిందే. ఈ సీజన్లో, అంటే నవంబర్ 1 నుంచి డిసెంబర్ 15 నడుమ దేశవ్యాప్తంగా ఏకంగా 46 లక్షల పెళ్లిళ్లు జరుగుతున్నట్టు అంచనా. అలాంటి సీజన్ మంచి పీక్‌లో ఉండగా ఇండిగో విమాన సేవల అంతరాయం పెళ్లిళ్లపై గట్టి ప్రభావమే చూపుతోంది. ఆ దెబ్బకు కొన్ని వందల పెళ్లిళ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. బ్యాచిలర్స్ పార్టీ గోవిందా ముంబైకి చెందిన వర్షా అగర్వాల్‌కు వచ్చే జనవరిలో పెళ్లి జరగనుంది. ఈలోపు తన బెస్ట్ ఫ్రెండ్స్ ఆరుగురికి కోల్‌కతాలో ఘనంగా బ్యాచిలర్స్ పార్టీ ఇవ్వాల ని అంతా పక్కాగా ప్లాన్ చేసుకుంది. తను ముంబై నుంచి ఎయిరిండియా విమానంలో ముందుగానే కోల్‌కతా చేరుకుని వారికోసం ఎదురు చూడసాగింది. కానీ ఢిల్లీ, హైదరాబాద్ నుంచి రావాల్సిన తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాస్తా కర్మ కాలి ఇండిగోలో టికె ట్లు బుక్ చేసుకున్నారు. తెలియక వారు చేసిన ఈ ఒక్క పొరపాటు చివరికి బ్యాచిలర్స్ పారీ్టకే పురిట్లోనే సంధి కొట్టింది. ఢిల్లీ నుంచి వరుసగా రెండు రోజుల పాటు కోల్‌కతాకు ఇండిగో తన విమాన సర్వీసులన్నింటినీ రద్దు చేసేసింది. దాంతో ఒక స్నేహితురాలితో పాటు వర్షా కూడా హతాశురాలైంది. ఇక హైదరాబాద్ నుంచి రావాల్సిన మిత్రురాలిది మరో వ్యథ. ఆమె సకాలానికి విమానాశ్రయానికి చేరుకున్నా డిస్ ప్లే బోర్డుపై ఎంతకూ కోల్‌కతా విమానం జాడేకన్పించని పరిస్థితి. ఇండిగో సిబ్బంది నుంచి కూడా అరకొ ర సమాచారమే. చివరికి విమానం ఆలస్యమన్నారు. అలా రెండు మూడుసార్లు జరిగి ఐదారు గంటలు గడిచాక, విమానం రద్దయిందంటూ చావు కబురు చల్లగా చెప్పారు. ‘‘చివరికి నా బ్యాచిలర్స్ పార్టీని ఒకే ఒక్క ఫ్రెండ్‌తో ఏదో అయిందనిపించి ముంబై తిరిగొచ్చా. ఇండిగో నాకు మర్చిపోలేని చేదు అనుభవం మిగిల్చింది’’అంటూ మండిపడుతోంది వర్షా. జనవరిలో పుణేలో జరిగే తన పెళ్లికి ఎట్టి పరిస్థితు ల్లోనూ ఇండిగో సేవలను నమ్ముకునేది లేదని తెగేసి చెబుతోంది. వీలైతే అసలు జీవితంలో ఎన్నడూ ఇండిగో విమానమే ఎక్కబోనని కూడా అంటోంది! రేడియో ఆరెంజ్‌లో ఆర్జేగా చేసే గౌరిదీ అలాంటి వ్యథే. ఆఫీసు వ్యవహారంతో పాటు సన్నిహితుల్లో ఒకరు పెళ్లికి కూడా వెళ్లొచ్చని ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకుందామె. కానీ తీరా చూస్తే అది కాస్తా చివరి నిమిషంలో రద్దయింది. అది కూడా తాను విమానాశ్రయానికి చేరుకున్నాక ఇండిగో సిబ్బంది చాలాసేపటికి తీరిగ్గా వెల్లడించారు. తొలుత విమానం ఆలస్యమైందంటూ రెండుమూడుసార్లు దాటవేస్తూ వచ్చారు. బెస్ట్ ఫ్రెండ్ పెళ్లి! సిలిగురికి చెందిన వ్యాపారవేత్త అనీశ్ సింఘానియా ది కూడా ఇలాంటి బాధే. ఇండిగో నిర్వాకం వల్ల ఏకంగా తన బెస్ట్ ఫ్రెండ్ పెళ్లికే వెళ్లలేకపోయానంటూ వాపోతున్నారాయన. ‘‘డిసెంబర్ 4న ముంబై వెళ్లేందుకు ఇండిగోను నమ్ముకున్నా. తీరా చూస్తే ఆ సంస్థ కాస్తా నన్ను నట్టేట ముంచి చేతులు దులుపుకుంది. పోనీ ఇతర సంస్థల విమానాల్లో వెళ్దామంటే అవి కూ డా ఈ దుస్థితిని వీలైనంతగా సొమ్ము చేసుకుని నా ఆశలపై నీళ్లుజల్లాయి. పదేసి రెట్లు పెరిగిన విమాన ధరలు చెల్లించలేక అసలు ప్రయాణమే మానుకు న్నా. ఇండిగోకు నాలాంటివారి ఉసురు తగిలి తీరుతుంది’’అంటూ శాపనార్థాలు పెడుతున్నారు అనీశ్. దౌత్యాధికారికీ తప్పని తిప్పలు సాధారణ దేశీయ ప్రయాణికులకు మాత్రమే కాదు, భారత్‌లో సింగపూర్ హైకమిషనర్ సైమన్ వాంగ్కూ ఇలాంటి చేదు అనుభవాన్నే రుచిచూపింది ఇండిగో. తన దౌత్య సిబ్బందిలో ఒకరి పెళ్లి నిమిత్తం ఢిల్లీ నుంచి దేవగఢ్‌కు ఇండిగోలో టికెట్ బుక్ చేసుకున్నారాయన. ‘‘ఆ పొరపాటు చేసినందుకు ప్రయాణం రద్దై ఏమీ చేయలేక తీరని బాధకు లోనైన వేలాది మంది ఇండిగో ప్రయాణికుల్లో నేనూ ఒకనిగా మిగిలాను. నా కొలీగ్‌కు మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్పడం మినహా ఇంకేం చేయగలను?’’అంటూ ఎక్స్‌లో వాపోయారాయన! – సాక్షి, నేషనల్ డెస్క్ -
పెళ్లి కోసం వధూవరుల సాహసం.. వరద నీటిలోనే..!
చెన్నై: తమిళనాడులో శుక్రవారం కురిసిన భారీ వర్షాల కారణంగా చెన్నై మహానగరం నీట మునిగింది. ఎటు చూసినా వరద నీరే కనిపించింది. దీంతో పలు వివాహాలు సైతం రద్దయ్యాయి. పులియంతోపులలోని ఆంజనేయుడి ఆలయంలో శుక్రవారం జరగాల్సిన ఐదు పెళ్లిళ్లు ఆలస్యమయ్యాయి. ఆంజనేయుడి సన్నిధి మొత్తం నీటితో నిండిపోయింది, పరిసరాల్లో సైతం ఎటు చూసిన వరద నీరే కనిపిస్తోంది. దీంతో ఆ వరద నీటిలోనే ఐదు జంటలు వివాహం చేసుకున్నాయి. కొన్ని నెలల క్రితమే ఖరారు చేసిన ముహూర్తం కావడంతో వరదతో ఇబ్బందులు ఉన్నప్పటికీ వివాహ తంతును పూర్తి చేశారు. పై నుంచి చినుకులు రాలుతుండగా.. వరద నీటిలో గొడుగు పట్టుకుని నూతన వధూవరులు ఆలయానికి వస్తున్న వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వర్షంలోనూ ఎంతో సంతోషంగా ఆలయానికి చేరుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాయి కొత్త జంటలు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వరదనీరు చేరకుండా తగు చర్యలు తీసుకోవాలని నూతన వధూవరులు కోరారు. చెన్నై సహా చుట్టు పక్కల జిల్లాల్లో శుక్రవారం మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. పలు జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలు మూసివేశారు. చెన్నై, చెంగల్పెట్, కాంచీపురం, తిరువల్లూర్, విల్లుపురమ్ జిల్లాల్లో పాక్షికంగా మూతపడ్డాయి. #WATCH | Tamil Nadu: 5 weddings that were scheduled at Anjineyar temple in Pulianthope were delayed due to rainfall today. Couples lined up for wedding ceremonies were drenched as they walked through the water logged inside the temple. These weddings were scheduled months ago. pic.twitter.com/OA96wQEiz2 — ANI (@ANI) November 11, 2022 ఇదీ చదవండి: తమిళనాడులో కుండపోత.. నిండుకుండలా చెన్నై.. సెలవు ప్రకటన.. హెచ్చరికలు -
బాలకృష్ణ సరసన నటిస్తే ..!
అన్ని రంగాలలోకంటే సినిమా రంగంలో సెంటిమెంట్లు ఎక్కువ. యాదృశ్చికంగా జరిగిన సంఘటనలను కూడా సెంటిమెంటుగా భావిస్తుంటారు. ఏ హీరోయిన్‌కి అయినా పెళ్లి కుదిరిన తరువాత ఆ హీరో సరసన నటిస్తే పెళ్లి ఆగిపోతుందా? అటు కోలీవుడ్‌లోనూ, ఇటు టాలీవుడ్‌లోనూ ప్రస్తుతం ప్రధానంగా చర్చించుకునే అంశం ఇదే. ప్రముఖ టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ సరసన నటించిన ఇద్దరు హీరోయిన్ల పెళ్లిళ్లు ఇలాగే ఆగిపోయాయి. ఆ హీరోయిన్లు ఆయనతో జతకట్టి నటించిన సినిమాల నిర్మాణం పూర్తి అయిన తరువాతే వారి ఇద్దరి పెళ్లిళ్లు ఆగిపోయాయి. వారి పెళ్లిళ్లు చివరి దశకు వచ్చిన తరువాతే ఆగిపోవడం యాదృశ్చికమే అయినప్పటికీ బాలయ్య సరసన నటించినందువల్లే ఆగిపోయాయా? అన్న రీతిలో సినీజనాలు చర్చించుకుంటున్నారు. దక్షిణాది ప్రముఖ హీరోయిన్ నయనతార, ప్రముఖ నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవాతో పెళ్లి పీటల వరకు వెళ్లి ఆగిపోయింది. ప్రభుదేవా తన మొదటి భార్య రామాలత్కు కోట్ల రూపాయలు ఆస్తి రాసి ఇచ్చి, ఆమెతో తెగతెంపులు చేసుకున్నాడు. నయనతార-ప్రభుదేవా పెళ్లి చేసుకుంటున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు. పెళ్లి తరువాత తాను సినిమాలలో నటించనని నయనతార ప్రకటించింది. బాలయ్యతో నటించే 'శ్రీరామరాజ్యం' తన చివరి చిత్రమని చెప్పింది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తరువాత నటనకు స్వస్తి చెబుతున్నందుకు కంటతడికూడా పెట్టుకుంది. ఆ తరువాత ఏం జరిగిందో ఏమో ప్రభుదేవాతో నయనతార పెళ్లి ఆగిపోయింది. ఆమె హీరోయిన్గా కొనసాగుతోంది. ఇప్పుడు త్రిష. తమిళ నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్ మణియన్‌తో త్రిష నిశ్చితార్థం మూడు నెలల ముచ్చటగా ముగిసింది. నిశ్చితార్థం తర్వాత వరుణ్, త్రిష విహారయాత్రకు కూడా వెళ్లారు. అయితే, వారి పెళ్లి తేదీని మాత్రం ఖరారు చేయలేదు. ఈ నేపధ్యంలో త్రిష తొలిసారిగా బాలకృష్ణ సరసన లయన్ చిత్రంలో నటించింది. ఆ సినిమా నిర్మాణం పూర్తి అయింది. విడుదలకు కూడా సిద్ధమైంది. ఇంతలో వరుణ్ - త్రిషల పెళ్లి ఆగిపోయినట్లు త్రిష తల్లి ఉమా కృష్ణన్ తెలిపారు. ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, వాళ్లు విడిపోయారనే వార్త కొద్దిరోజులుగా హల్చల్ చేస్తోంది. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ కుటుంబ సభ్యులకు నచ్చకపోవడం వల్లే విభేదాలు నెలకొన్నాయనే వార్త ప్రచారం అయ్యింది. త్రిష సినిమాల్లో కొనసాగడం వరుణ్ కుటుంబ సభ్యులకు ఇష్టమేననీ, వాళ్లు ఎలాంటి అభ్యంతరం చెప్పలేదనీ ఉమ చెప్పారు. కుటుంబ పెద్దల నిర్ణయమే పెళ్లి రద్దు కావడానికి కారణమనీ, కానీ ఆ పెద్దల గురించి చెప్పి, వాళ్లను నొప్పించలేననీ ఆమె అన్నారు. ఇలా వీళ్లు ఇద్దరూ పెళ్లి సంబంధం కుదిరిన తరువాత బాలయ్యతో నటించారు. ఆ చిత్రాలు పూర్తి అయిన వెంటనే వారి పెళ్లిళ్లు ఆగిపోయాయి. దాంతో కోలీవుడ్, టాలీవుడ్‌లలో పెళ్లి కుదిరిన హీరోయిన్లు బాలయ్య బాబుతో నటిస్తే, పెళ్లి ఆగిపోతుందేమోనని అనుకుంటున్నారు. అదేమీ లేదని, అవి మూఢనమ్మకాలని కొందరు కొట్టిపారేస్తున్నారు.


