న్యూఢిల్లీ: జాతీయ గీతం వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రత్యేక చర్చ జరగనుంది. ప్రధాని మోదీ ఈ చర్చను ప్రారంభిస్తారు. పలువురు కేంద్ర మంత్రులు సహా వివిధ పార్టీల సభ్యులు మాట్లాడుతారు. ప్రత్యేక చర్చకు సభలో 10 గంటల సమయం కేటాయించారు. అవసరమైతే మరికొంత సమయం కేటాయిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది.
వందేమాతర గీతం గురించి ఎక్కువ మంది తెలియని విషయాలు, ముఖ్యమైన అంశాలు సభలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది. బెంగాలీ కవి బంకించంద్ర ఛటర్జీ రాసిన వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. నవంబర్ 7న మొదలైన ఈ వేడుకలు ఏడాదిపాటు కొనసాగుతాయి. ఇందులో భాగంగానే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రత్యేక చర్చ చేపట్టాలని నిర్ణయించారు.
షెడ్యూల్ ప్రకారం సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చ జరుగనుంది. ఎగువసభలో వందేమాతరంపై చర్చను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రారంభిస్తారు. ఇదిలా ఉండగా, వివాదాస్పద ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సహా ఎన్నికల సంస్కరణలపై లోక్‌సభలో మంగళవారం, బుధవారం చర్చించడానికి ప్రభుత్వం అంగీకరించింది. ఆ తర్వాత ఈ అంశంపై రాజ్యసభలో చర్చ ప్రారంభమవుతుంది.


