న్యూఢిల్లీ: పని వేళలు పూర్తయ్యాక ఆఫీసు నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిళ్లను స్వీకరించడంపై ఉద్యోగులకు హక్కు కల్పించేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ సభ్యుల బిల్లు లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరముందని భావించే అంశాలపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రైవేటుగా బిల్లులను ప్రవేశపెట్టవచ్చు. ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత సాధారణంగా ఈ ప్రతిపాదిత బిల్లులను ఉపసంహరించుకుంటారు.
ఎన్‌సీపీ ఎంపీ సుప్రియా సూలే శుక్రవారం లోక్‌సభలో ఈ మేరకు ‘రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు–2025’ను ప్రవేశపెట్టారు. ప్రతి ఉద్యోగి పని వేళల తర్వాత, సెలవు దినాల్లో వచ్చే విధి నిర్వహణ సంబంధిత ఫోన్ కాల్స్, ఈమెయిల్స్‌ను డిస్‌కనెక్ట్ చేసేందుకు హక్కు ఉండాలి. ఇందుకోసం ఉద్యోగుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించారు.
తమిళనాడును నీట్ ప్రవేశ పరీక్ష నుంచి మినహాయించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, దేశంలో మరణ శిక్షను రద్దు చేయాలంటూ డీఎంపీ ఎంపీ కనిమొళి, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని విశాల్‌దాదా ప్రకాశ్ బాపు పాటిల్(స్వతంత్ర) ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు.


