private members bill
-
ఆరు గ్యారంటీల అమలుకు ‘ప్రైవేటు’ బిల్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేతలు, న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం తెలంగాణ భవన్లో సమావేశమయ్యారు. న్యాయవాదులుగానూ అనుభవం ఉన్న పార్టీ నేతలు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌తోపాటు మాజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాది మోహన్‌రావు ఈ భేటీలో పాల్గొన్నారు. ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశ పె ట్టడంలో ఉన్న సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై చర్చించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని వారి చాంబర్లో కలిసి తాము ప్రవేశపెడుతున్న ప్రైవేటు బిల్లును అనుమతించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరనున్నారు. వచ్చే శుక్రవారం ఉభయ సభల్లో ప్రవేశ పెట్టేందుకు బీఆర్ఎస్ సన్నాహాలు ప్రారంభించింది. ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరడంతోపాటు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బిల్లు కాపీలు ఇస్తారు. బిల్లుకు మద్దతు కోరుతూ అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలకు లేఖలు కూడా రాయాలని శనివారం జరిగిన భేటీలో నిర్ణయించారు. అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీలకు అతీతంగా బిల్లు కోసం ఒత్తిడి ‘బీఆర్ఎస్ పెట్టే ప్రైవేటు బిల్లుకు మద్దతిచ్చేందుకు పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డలందరూ స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి. ఆరు గ్యారంటీల ద్వారా లబ్దిదారులకు అందే డబ్బును నేరుగా వారి ఖాతాల్లోనే వేసేలా ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి రోజునే సీఎం రేవంత్ ఆరు గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. గవర్నర్ నోటితో అసెంబ్లీ సంయుక్త సమావేశంలో చెప్పించి 840 రోజులు కావస్తున్నా వాటి ఊసేలేదు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో 1986లో బీజేపీ ఫ్లోర్ లీడర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును ఆమోదించిన చరిత్ర ఉంది. కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే మేము ప్రవేశపెడుతున్న ప్రైవేటు మెంబర్ బిల్లును చర్చకు అనుమతించి ఆమోదించాలి. రాష్ట్రంలోని రైతులు, మహిళలు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు యువకులు సహా అన్ని వర్గాల తరపున ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. అభయహస్తం మేనిఫెస్టోను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మేము ప్రవేశపెట్టే బిల్లుకు అధికార పక్షం కూడా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం’అని కేటీఆర్ అన్నారు. తొలి సంతకం ఫైల్‌ను పోగొట్టుకున్నారా? ‘అధికారంలోకి వచి్చన వెంటనే ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం తొలి సంతకం చేసిన ఫైలు కనిపించడం లేదా? లేకపోతే తరచూ విమాన ప్రయాణాలు చేస్తున్న సీఎం ఆ ఫైలును పోగొట్టుకున్నారా? ఎందుకంటే ఇప్పటివరకు మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆరు గ్యారంటీల ఊసే లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చే ఏడాది మాత్రమే సంపూర్ణ బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రైవేటు బిల్లు పెట్టడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఈ బిల్లుకు చట్టబద్ధత వస్తే రైతు భరోసా సహా ఇతర హామీలు ఎగవేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉండదు. ఈ బిల్లును శాసనసభలో అనుమతించకుంటే చట్టపరంగా ఉన్న ఇతర మార్గాలను కూడా బీఆర్ఎస్ ఉపయోగించుకుంటుంది’అని కేటీఆర్ వెల్లడించారు. -
ఉద్యోగులకు ఆఫీసు కాల్ కట్ చేసే హక్కు
న్యూఢిల్లీ: పని వేళలు పూర్తయ్యాక ఆఫీసు నుంచి వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిళ్లను స్వీకరించడంపై ఉద్యోగులకు హక్కు కల్పించేందుకు ఉద్దేశించిన ప్రైవేట్ సభ్యుల బిల్లు లోక్‌సభలో శుక్రవారం ప్రవేశపెట్టారు. ప్రభుత్వం చట్టం చేయాల్సిన అవసరముందని భావించే అంశాలపై లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు ప్రైవేటుగా బిల్లులను ప్రవేశపెట్టవచ్చు. ప్రభుత్వం సమాధానం ఇచ్చిన తర్వాత సాధారణంగా ఈ ప్రతిపాదిత బిల్లులను ఉపసంహరించుకుంటారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే శుక్రవారం లోక్‌సభలో ఈ మేరకు ‘రైట్ టు డిస్కనెక్ట్ బిల్లు–2025’ను ప్రవేశపెట్టారు. ప్రతి ఉద్యోగి పని వేళల తర్వాత, సెలవు దినాల్లో వచ్చే విధి నిర్వహణ సంబంధిత ఫోన్ కాల్స్, ఈమెయిల్స్‌ను డిస్కనెక్ట్ చేసేందుకు హక్కు ఉండాలి. ఇందుకోసం ఉద్యోగుల సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయాలని అందులో ప్రతిపాదించారు. తమిళనాడును నీట్ ప్రవేశ పరీక్ష నుంచి మినహాయించాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్, దేశంలో మరణ శిక్షను రద్దు చేయాలంటూ డీఎంపీ ఎంపీ కనిమొళి, జర్నలిస్టులకు భద్రత కల్పించాలని విశాల్దాదా ప్రకాశ్ బాపు పాటిల్(స్వతంత్ర) ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు. -
పార్లమెంట్లో నేడు ఏపీ ప్రైవేట్ మెంబర్ బిల్లులు
సాక్షి, ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నేటితో నాలుగవ రోజుకి చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్‌రెడ్డి. ఏపీ విభజన చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ.. ఎంపీ మిథున్‌రెడ్డి ప్రైవేట్‌మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. అలాగే మిరప ప్రమోషన్, అభివృద్ధిపై.. ఎంపీ కృష్ణదేవరాయలు ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టనున్నారు. వ్యవసాయ విపత్తుల నష్టపరిహారంపైన ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి ప్రైవేట్ మెంబర్ బిల్లు పెట్టనున్నారు. -
ఎంపీల విదేశీ పర్యటనలపై చట్టం తేవాలి
న్యూఢిల్లీ: ఎంపీలు విదేశీ పర్యటనలు చేసినప్పుడు దానికి సంబంధించిన వివరాలతో పాటు ఖర్చుల వివరాలు తప్పనిసరిగా వెల్లడించేలా చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ ఎంపీ కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనల నేపథ్యంలో ఆ పార్టీ లక్ష్యంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రజా ప్రాతినిధ్య (సవరణ) బిల్లుకు సంబంధించిన ఓ ప్రైవేట్ మెంబర్స్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ‘విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి స్వీకరించిన ఏ రకమైన ఆతిథ్యం అయినా సరే దాని వివరాలు రాజ్యసభ చైర్మన్‌కు గానీ, లోక్‌సభ స్పీకర్‌కు గానీ వెల్లడించాలి’అని బిల్లు తెలిపింది. కాగా, ఎంపీలు విదేశీ పర్యటనల వివరాలు తెలపాలని 2017లోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయని, 2019 జూలైలోనూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ దీన్ని పునరుద్ఘాటించిందని జీవీఎల్ పేర్కొన్నారు. -
ఆప్ మరో ముందడుగు
న్యూఢిల్లీ: ఢిల్లీలో కొనసాగుతున్న ‘దుకాణాల మూసివేత’(సీలింగ్ డ్రైవ్)ని నిలిపివేయాలంటూ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) సభ్యుడు, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సోమవారం రాజ్య సభలో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు. మొదటి నుంచి దుకాణాల మూసివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రైవేటు బిల్లుతో తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసింది. బిల్లుకు మిగతా పార్టీలు మద్దతు ఇవ్వాలని సంజయ్ సింగ్ కోరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..‘ఇప్పటి వరకు 14 ప్రయివేట్ బిల్లులు మాత్రమే ఆమోదం పొందాయి. అయినా మేము ధైర్యంగా ఈ బిల్లు ప్రవేశ పెట్టాము. బిల్లుకు ప్రతిపక్ష పార్టీలన్నిమద్దతు ఇవ్వాల’ని విజ్ఞప్తి చేశారు. నివాస ప్రాంతాల్లో కొనసాగుతున్న దుకాణాలను మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా సీజ్ చేస్తున్నారని ఆరోపించారు. సీలింగ్ డ్రైవ్ వల్ల వేలాదమంది వ్యాపారులు జీవనోపాధిని కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో చట్టం చేయడం లేదా ఆర్డినెస్స్ జారీ చేయడం ఒక్కటే సీలింగ్ డ్రైవ్‌కు పరిష్కారమని ఆప్ తొలి నుంచి చెప్తోందని ఆయన గుర్తుచేశారు. -
ప్రైవేట్ మెంబర్ బిల్లుపై నేడు చర్చ!
రాష్ట్రానికి ఆర్థిక సాయంపై లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఎంపీ వినోద్ సాక్షి, న్యూఢిల్లీ: ఉమ్మడి ఏపీలో అభివృద్ధికి నోచుకోని తెలంగాణలో వెనుకబడిన షెడ్యూల్డ్ కులాలు, గిరిజనులు, మైనారిటీల సంక్షేమానికి ప్రత్యేక ఆర్థిక సహా యాన్ని అందివ్వాలని కోరుతూ టీఆర్ఎస్ ఎంపీ బి.వినోద్‌కుమార్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం సభలో చర్చకు రానుంది. గతంలో తెలంగాణలో 10 జిల్లాలు ఉన్నప్పుడు అందులో 9 జిల్లాలను వెనుకబడిన జిల్లాలుగా కేంద్రం గుర్తించిందన్నారు. ఈ 9 జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు వెనుకబడిన ప్రాంతాల గ్రాంట్ కూడా రావడం లేదన్నారు.


