పార్టీ సీనియర్లు, న్యాయ నిపుణులతో కేటీఆర్ చర్చ
శుక్రవారం ఉభయ సభల్లో పెట్టేందుకు సన్నాహాలు
బిల్లు ఆమోదానికి ఒత్తిడి తేవాలని పార్టీలకు వినతి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కోరుతూ అసెంబ్లీ ఉభయ సభల్లో ప్రైవేటు మెంబర్ బిల్లు ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్ పార్టీ నిర్ణయించింది. పార్టీ సీనియర్ నేతలు, న్యాయ నిపుణులతో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు శనివారం తెలంగాణ భవన్‌లో సమావేశమయ్యారు. న్యాయవాదులుగానూ అనుభవం ఉన్న పార్టీ నేతలు మాజీ ఎంపీ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పార్టీ ప్రధాన కార్యదర్శి సోమ భరత్‌తోపాటు మాజీ అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్, న్యాయవాది మోహన్‌రావు ఈ భేటీలో పాల్గొన్నారు.
ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశ పె ట్టడంలో ఉన్న సాధ్యాసాధ్యాలు, విధి విధానాలపై చర్చించారు. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని వారి చాంబర్‌లో కలిసి తాము ప్రవేశపెడుతున్న ప్రైవేటు బిల్లును అనుమతించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కోరనున్నారు. వచ్చే శుక్రవారం ఉభయ సభల్లో ప్రవేశ పెట్టేందుకు బీఆర్‌ఎస్ సన్నాహాలు ప్రారంభించింది.
ప్రైవేటు బిల్లును ప్రవేశ పెట్టిన తర్వాత అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు కోరడంతోపాటు ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు బిల్లు కాపీలు ఇస్తారు. బిల్లుకు మద్దతు కోరుతూ అవసరమైతే అన్ని రాజకీయ పక్షాలకు లేఖలు కూడా రాయాలని శనివారం జరిగిన భేటీలో నిర్ణయించారు. అనంతరం కేటీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు.
పార్టీలకు అతీతంగా బిల్లు కోసం ఒత్తిడి
‘బీఆర్‌ఎస్ పెట్టే ప్రైవేటు బిల్లుకు మద్దతిచ్చేందుకు పార్టీలకు అతీతంగా తెలంగాణ బిడ్డలందరూ స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి. ఆరు గ్యారంటీల ద్వారా లబ్దిదారులకు అందే డబ్బును నేరుగా వారి ఖాతాల్లోనే వేసేలా ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. కాంగ్రెస్ అధికారం చేపట్టిన తొలి రోజునే సీఎం రేవంత్ ఆరు గ్యారంటీల ఫైలుపై సంతకం చేశారు. గవర్నర్ నోటితో అసెంబ్లీ సంయుక్త సమావేశంలో చెప్పించి 840 రోజులు కావస్తున్నా వాటి ఊసేలేదు. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో 1986లో బీజేపీ ఫ్లోర్ లీడర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లును ఆమోదించిన చరిత్ర ఉంది.
కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే మేము ప్రవేశపెడుతున్న ప్రైవేటు మెంబర్ బిల్లును చర్చకు అనుమతించి ఆమోదించాలి. రాష్ట్రంలోని రైతులు, మహిళలు విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగులు యువకులు సహా అన్ని వర్గాల తరపున ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నాం. అభయహస్తం మేనిఫెస్టోను వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మేము ప్రవేశపెట్టే బిల్లుకు అధికార పక్షం కూడా మద్దతు ఇస్తుందని ఆశిస్తున్నాం’అని కేటీఆర్ అన్నారు.
తొలి సంతకం ఫైల్‌ను పోగొట్టుకున్నారా?
‘అధికారంలోకి వచి్చన వెంటనే ఆరు గ్యారంటీల అమలు కోసం సీఎం తొలి సంతకం చేసిన ఫైలు కనిపించడం లేదా? లేకపోతే తరచూ విమాన ప్రయాణాలు చేస్తున్న సీఎం ఆ ఫైలును పోగొట్టుకున్నారా? ఎందుకంటే ఇప్పటివరకు మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఆరు గ్యారంటీల ఊసే లేదు. ఈ ప్రభుత్వానికి వచ్చే ఏడాది మాత్రమే సంపూర్ణ బడ్జెట్ ప్రవేశ పెట్టే అవకాశం ఉంది.
కాబట్టి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రైవేటు బిల్లు పెట్టడం మినహా మరో మార్గం కనిపించడం లేదు. ఈ బిల్లుకు చట్టబద్ధత వస్తే రైతు భరోసా సహా ఇతర హామీలు ఎగవేసేందుకు ప్రభుత్వానికి అవకాశం ఉండదు. ఈ బిల్లును శాసనసభలో అనుమతించకుంటే చట్టపరంగా ఉన్న ఇతర మార్గాలను కూడా బీఆర్‌ఎస్ ఉపయోగించుకుంటుంది’అని కేటీఆర్ వెల్లడించారు.


