ఉత్తరకాశీ ఉపద్రవం.. పాండవుల శివాలయం మాయం! | Uttarakhand Kalp Kedar Mysterious Shiva Temple Lost In Uttarkashi Floods, Know Unknown Facts About This Temple | Sakshi
Sakshi News home page

Kalp Kedar Temple: ఉత్తరకాశీ ఉపద్రవం.. పాండవుల శివాలయం మాయం!

Aug 10 2025 10:51 AM | Updated on Aug 10 2025 11:20 AM

Uttarakhand Kalp Kedar mysterious Shiva temple lost Uttarkashi flood

నిజానికి ధరాలి ఎప్పుడూ పేరొందిన పర్యాటక ప్రదేశం కాదు. అయితే అటువైపుగా రాకపోకలు సాగించే యాత్రికులకు మాత్రం బాగానే తెలుసు. గౌముఖ్‌–తపోవన్‌ లేదా లామా టాప్‌కు వెళ్లే మార్గంలో ట్రెక్కర్లు దాని గుండానే వెళతారు. అయితే ఇప్పుడు ధరాలి అనే పేరు దేశమంతా మారుమోగడానికి ఓ దురదృష్టకర ఉపద్రవం కారణమైంది.

అప్పుడెప్పుడో 19వ శతాబ్దం మధ్యలో, ఉత్తరకాశీకి సమీపంలోని హర్సిల్‌లో స్థిరపడిన బ్రిటిషర్‌ ఫ్రెడరిక్‌ ‘‘పహాడి’’ విల్సన్, ఆపిల్‌ తోటలు  ఎర్ర రాజ్మా వ్యాపారాన్ని ఈ ప్రాంతానికి పరిచయం చేశాడు. అది స్థానిక ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చింది. అలా నేడు, ధరాలి ఆపిల్‌ పండ్లు ఉత్తర భారతదేశం అంతటా సరఫరా అవుతున్నాయి. కానీ గత వారం, ఈ తోటలను పోషించిన టెర్రస్‌లు విరిగిపోయాయి. వాటి రవాణాకు వాడిన ఫుట్‌బ్రిడ్జిలు మాయమయ్యాయి. అనేక అందమైన ఇళ్లు అర్ధభాగాలే మిగిలాయి. కుటుంబాలు తమ భూమి అడవిలో కలిసిపోవడాన్ని కన్నీళ్లతో చూశాయి.  

హర్సిల్‌ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉత్తరాఖండ్‌ కొండలలోని ప్రశాంతమైన పర్వత గ్రామాన్ని ఖీర్‌ గడ్‌ నది అకస్మాత్తుగా  ఉప్పొంగి ముంచేసింది. ఇళ్ళు, తోటలు సహా మరెన్నో జ్ఞాపకాలను తుడిచేసింది. అందులో కల్ప కేదార్‌ ఆలయం కూడా ఉంది. దీనిని పాండవులు నిర్మించారని స్థల పురాణం చెబుతోంది. కాలభైరవుని ముఖంతో చెక్కబడిన ఈ నిర్మాణం, 1900ల ప్రారంభంలో ఈ మందిరాన్ని హిమనీ నదుల మార్పు పూడ్చిపెట్టింది. అయినప్పటికీ  కల్ప కేదార్‌ ఆలయ గోపురం స్పష్టంగా కనిపించేది తాజా వరదతో ఆ గోపురం కూడా అదృశ్యమైంది. ఇది ఆ ప్రాంత వాసుల్ని కలచివేసింది. ధరాలి మాజీ గ్రామ ప్రధాన్‌ మనోజ్‌ రాణా మాట్లాడుతూ ‘ఇది కేవలం వరద కాదు. ఇది మా గ్రామ హృదయాన్ని చీల్చేసింది’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

స్థానికులకు, కల్ప కేదార్‌ కేవలం ఒక శిల కాదు. ఇది దైవిక రహస్యాన్ని కలిగి ఉంది. ఈ ఆలయం వెలికితీత కోసం 1980లలో అనేక ప్రయత్నాలు చేసినా భూమి నీటి పొరల క్రింద తరతరాలుగా దాగి ఉన్న శివలింగం పూర్తిగా వెలుగు చూడలేదు. పురాణాల ప్రకారం, శివుడు పాండవుల పాపాలను వదిలించుకోవడానికి నిరాకరించి హిమాలయాలలో చెల్లాచెదురుగా విస్తరించాడు. అందుకే కేదార్‌నాథ్‌ లాగానే కల్ప కేదార్‌ కూడా ఆ శకలాలలో ఒకటిగా భావిస్తారు.

ధరాలి అధికారికంగా పంచ కేదార్‌ తీర్థ మార్గంలో లేకపోయినా, గ్రామస్తులు కల్ప కేదార్‌ను వాటితో ఆధ్యాత్మికంగా ముడిపడి ఉందని విశ్వసిస్తారు.  ‘కల్ప కేదార్‌ ఈ ప్రాంతానికి అపారమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీనిని ఆది శంకరాచార్య పునరుద్ధరించారు. శివుని పురాతన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా పూజించారు’ అని చార్‌ ధామ్‌ తీర్థ పురోహిత్‌ మహాపంచాయతీ ప్రధాన కార్యదర్శి బ్రిజేష్‌ సతి వివరిస్తారు. కనపడినంత మేరకు మాత్రమే భక్తి శ్రద్ధలతో తాము కొలుస్తున్న దైవం.. ఇప్పుడు లేశ మాత్రం కూడా కనపడకుండా మాయం అవడం ధరాలి గ్రామవాసుల ఆవేదనను అంతులేకుండా చేస్తోంది. అయితే గతంలోనూ ఇలాంటి ప్రకృతి ఉత్పాతాలు ఆలయాన్ని ముంచేసినా, మళ్లీ తిరిగి కల్పకేదార్‌ ఎప్పటిలా వెలుగులోకి వచ్చి పూజలు అందుకుందని ఈసారి కూడా అదే జరుగుతుందని నమ్మతున్న గ్రామస్తులూ పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement