
పర్యావరణ పరిరక్షణకు కొత్త ఆశలు రేకెత్తిస్తున్నారు మెక్సికన్ శాస్త్రవేత్తలు. వీరు బ్రహ్మజెముడు నుంచి పూర్తిగా మట్టిలో కలిసిపోయే ప్లాస్టిక్‌ను సృష్టించారు. ప్లాస్టిక్ వ్యర్థాలతో అల్లాడుతున్న ప్రపంచానికి ఇది ఒక మంచి పరిష్కారమంటున్నారు నిపుణులు. గ్వాడలజారా విశ్వవిద్యాలయానికి చెందిన పర్యావరణ సాంకేతిక నిపుణురాలు శాండ్రా పాస్కల్– ఈ అద్భుతమైన ఆవిష్కరణకు నాయకత్వం వహించారు.
ఆమె బృందం బ్రహ్మజెముడు మొక్క నుంచి సేకరించిన రసంతో ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఒక పదార్థాన్ని తయారు చేసింది. ఈ కొత్త పదార్థం ప్లాస్టిక్ మాదిరిగానే దృఢంగా, సౌకర్యవంతంగా ఉంటుంది. అలాగే పర్యావరణానికి ఎటువంటి హాని కలిగించదు. బ్రహ్మజెముడు తక్కువ నీటితో, కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో కూడా పెరిగే మొక్క.
దీని నుంచి ప్లాస్టిక్ తయారీకి అవసరమైన ముడి పదార్థాన్ని సులభంగా, తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ఈ మొక్కలో ఉండే సహజ పాలిమర్‌లు, ఇతర సమ్మేళనాలు ప్లాస్టిక్ తయారీకి అనుకూలంగా ఉంటాయని పరిశోధకులు గుర్తించారు.
సాధారణ ప్లాస్టిక్ భూమిలో కలిసిపోవడానికి వందల సంవత్సరాలు పడుతుంది, తీవ్రమైన పర్యావరణ సమస్యలను సృష్టిస్తుంది. దీనికి విరుద్ధంగా, బ్రహ్మజెముడు ప్లాస్టిక్ కేవలం కొన్ని నెలల్లోనే పూర్తిగా భూమిలో కలిసిపోయి, ఎటువంటి విషపూరిత అవశేషాలను విడుదల చేయదని ఈ బృందం చెబుతోంది.