రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిర్ణయం తీసుకున్నారు. ఆయా కార్యక్రమాల్లో ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లు వాడకూడదని, అందుకు బదులుగా స్థిరమైన ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన ఈ నోట్‌లో పర్యావరణం పట్ల బాధ్యత, స్వదేశీ ఉత్పత్తుల ప్రచారం పట్ల రాష్ట్రం నిబద్ధతను ముఖ్యమంత్రి నొక్కి చెప్పారు.
ఈ ఆదేశాల అమలులో భాగంగా సచివాలయంలో జరిగే సమావేశాలు, అధికారిక కార్యక్రమాల్లో ప్రభుత్వ యాజమాన్యంలోని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) ఆధ్వర్యంలో ‘నందిని’ ఉత్పత్తులను తప్పనిసరిగా ఉపయోగించాలని సీఎం ప్రత్యేకంగా ఆదేశించారు. గతంలో కూడా ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీటి కోసం ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లకు బదులుగా పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలను ఉపయోగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే తాజా ఆదేశాలు ఈ చర్యను మరింత కఠినంగా అమలు చేయడానికి వీలవుతాయి.
ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను నిషేధించడం ద్వారా..
ప్లాస్టిక్ వ్యర్థాలు, ముఖ్యంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌లు పర్యావరణానికి, జల వనరులకు, నేలకు తీవ్రనష్టం కలిగిస్తాయి. వీటిపై నిషేధం దీర్ఘకాలిక పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. తిరిగి ఉపయోగించగల సీసాలు, గాజు కంటైనర్లు లేదా స్థానికంగా లభించే ఇతర పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాల వాడకానికి ఇది దారి తీస్తుంది. ప్రభుత్వమే ఈ పద్ధతులను అవలంబించడం ద్వారా ప్రజలకు, ప్రైవేట్ సంస్థలకు ఆదర్శంగా నిలుస్తుంది.
నందిని పాల ఉత్పత్తులపై ప్రభావం
ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం అధికారిక కార్యక్రమాలలో ‘నందిని’ ఉత్పత్తులను తప్పనిసరిగా ఉపయోగించాలి. ఈ నిర్ణయం కేవలం పర్యావరణ పరమైన నిర్ణయమే కాకుండా రాష్ట్రంలోని స్థానిక ఆర్థిక వ్యవస్థ, పాడి పరిశ్రమకు మద్దతు ఇచ్చే ఒక వ్యూహాత్మక చర్యగా ఉంటుంది. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ (KMF) నందిని బ్రాండ్‌కు ఈ నిర్ణయం అనేక రకాలుగా లబ్ధి చేకూరుస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, అధికారిక కార్యక్రమాల్లో నందిని ఉత్పత్తులను (ఉదాహరణకు, టీ/కాఫీ కోసం పాలు, లస్సీ/మజ్జిగ, నీటి కోసం పర్యావరణ అనుకూల ప్యాకేజింగ్‌లోని ఉత్పత్తులు) తప్పనిసరిగా ఉపయోగించడం వల్ల కంపెనీకి స్థిరమైన, పెద్ద మొత్తంలో డిమాండ్ ఏర్పడుతుంది. ప్రభుత్వమే తమ ఉత్పత్తులను వినియోగించడంతో నందిని బ్రాండ్ విశ్వసనీయత, జాతీయ స్థాయి ఇమేజ్ పెరుగుతుంది.
స్థానిక పాడి పరిశ్రమ అభివృద్ధి
ఈ ఆదేశాల వల్ల కర్ణాటకలోని పాడి రైతులకు, పాడి పరిశ్రమకు లబ్ధి చేకూరుతుంది. KMF రాష్ట్రంలోని లక్షలాది మంది పాడి రైతులకు, గ్రామీణ ప్రాంతాల మహిళలకు జీవనోపాధి కల్పిస్తుంది. నందిని ఉత్పత్తుల డిమాండ్ పెరిగితే KMF పాల సేకరణను పెంచుతుంది. తద్వారా పాడి రైతులకు స్థిరమైన, మెరుగైన ధర, ఆదాయ భద్రత లభిస్తుంది. పాల ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, పంపిణీ రంగాల్లో పెరిగే కార్యకలాపాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచుతాయి.
ఇదీ చదవండి: ఈపీఎఫ్ క్లెయిమ్ చేసుకోవాలా?


