ఉద్యోగులు తమ అత్యవసర ఆర్థిక అవసరాల కోసం పీఎఫ్ (PF) నిధులను పొందే ప్రక్రియను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) విప్లవాత్మకంగా మార్చింది. క్లెయిమ్ ఆటో సెటిల్‌మెంట్ పరిమితిని ఈ ఏడాది జూన్‌లో రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. దాంతో క్లెయిమ్ ప్రక్రియ వేగవంతం అయింది. దీనివల్ల లక్షలాది మంది సభ్యులు ఇకపై తమ అడ్వాన్స్ క్లెయిమ్‌లను కేవలం 72 గంటల్లో పరిష్కరించుకునే వీలుంది. ఈ నేపథ్యంలో ఆన్‌లైన్‌లో ఈపీఎఫ్ సెటిల్‌మెంట్ విధానాన్ని పరిశీలిద్దాం.
పీఎఫ్ క్లెయిమ్ చేసుకునే విధానం
EPF సభ్యులు (ఉద్యోగులు) ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ లేదా తుది సెటిల్‌మెంట్ క్లెయిమ్‌ను సమర్పించడానికి ఈ కింది దశలను అనుసరించాలి.
మీ UAN యాక్టివ్‌గా ఉండాలి.
UANతో ఆధార్, PAN, బ్యాంక్ ఖాతా (IFSCతో సహా) లింక్ అయి ఉండాలి.
KYC వివరాలు EPFO రికార్డుల్లో ధ్రువీకరించుకోవాలి.
ముందుగా EPFO అధికారిక యూనిఫైడ్ మెంబర్ పోర్టల్‌ను సందర్శించాలి.
UAN, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి.
హోం పేజీలో ఆన్‌లైన్ సేవలను ఎంచుకోవాలి.
Online Services టాబ్‌పై క్లిక్ చేసి, డ్రాప్‌డౌన్ మెనూలో ‘Claim (Form-31, 19, 10C)’ ఎంచుకోవాలి.
ఏ ఫారమ్ ఎందుకోసమంటే..
Form-31: అనారోగ్యం, విద్య, ఇల్లు మొదలైన వాటి కోసం పాక్షిక ఉపసంహరణ.
Form-19: తుది సెటిల్‌మెంట్ - ఉద్యోగం మానేసిన తర్వాత.
Form-10C: పెన్షన్ ఉపసంహరణ - ఉద్యోగం మానేసిన తర్వాత.
తరువాత పేజీలో మీ బ్యాంక్ ఖాతా నంబర్‌ను నమోదు చేసి ‘Verify’పై క్లిక్ చేయాలి.
నిబంధనలను అంగీకరించి ‘Proceed for Online Claim’పై క్లిక్ చేయండి.
క్లెయిమ్ ఫారం వివరాలు నింపాలి.
‘I Want To Apply For’ విభాగంలో మీకు అవసరమైన క్లెయిమ్ రకాన్ని ఎంచుకోవాలి.
ఆన్‌లైన్ ఫామ్‌లో Amount (కావలసిన మొత్తం), ‘Employee Address (ఉద్యోగి చిరునామా)’ వంటి వివరాలను నింపాలి.
డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేయాలి.
షరతులకు అంగీకరించడానికి టిక్ బాక్స్‌ను ఎంచుకుని, ‘Get Aadhaar OTP’పై క్లిక్ చేయాలి.
మీ ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని ఎంటర్ చేసి Submit చేయాలి.
భవిష్యత్తు క్లెయిమ్ ట్రాకింగ్ కోసం ప్రాసెస్‌ను ధ్రువీకరిస్తూ పీడీఎఫ్ వస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకోవాలి.
ఇదీ చదవండి: ఆటోమేషన్‌తో క్లెయిమ్ సెటిల్‌మెంట్ వేగవంతం


