ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు తెలిపింది. సభ్యులకు వారి నిధులను త్వరగా అందుబాటులోకి తీసుకురావడంలో గణనీయమైన ముందడుగు వేసినట్లు చెప్పింది. EPFO అడ్వాన్సుల కోసం ఆటో-సెటిల్‌మెంట్ పరిమితిని రూ.1 లక్ష నుంచి రూ.5 లక్షలకు పెంచడం సంస్థ ఇటీవల తీసుకున్న నిర్ణయాల్లో కీలకమని పేర్కొంది. ఈ పరిమితి పెంపు, ఆటోమేషన్ విధానం ద్వారా ఈపీఎఫ్‌ఓ క్లెయిమ్ సెటిల్‌మెంట్లలో వేగం, సామర్థ్యం పారదర్శకతను పెంచినట్లు ఎక్స్ ఖాతాలో పేర్కొంది.
2025-26 ఆర్థిక సంవత్సరంలో (30.10.2025 వరకు) మొత్తం EPF అడ్వాన్సు క్లెయిమ్‌లలో 71.22% ఆటోమేషన్ ద్వారా పరిష్కరించినట్లు చెప్పింది. అంతకుముందు సంవత్సరం ఇది 59 శాతంగా ఉందని స్పష్టం చేసింది. మానవ ప్రమేయం లేకుండా వేగంగా క్లెయిమ్‌లు సెటిల్ అవుతున్నాయనడానికి ఇది నిదర్శనంగా ఉందని తెలిపింది. ఆటోమేటెడ్ విధానంలో క్లెయిమ్‌లు నిర్దిష్ట అల్గారిథమ్‌లు, ప్రమాణాల ఆధారంగా ప్రాసెస్ అవుతాయి. తద్వారా వ్యక్తిగత ప్రమేయాలకు తావు లేకుండా పారదర్శకంగా ఈ విధానం సాగుతోంది.
క్లెయిమ్‌లు త్వరగా సెటిల్ కావడానికి కారణాలు
EPF క్లెయిమ్‌లు వేగంగా పరిష్కారం కావడానికి ప్రధాన కారణం సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవడమేనని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియను ఆటోమేట్ చేయడం సంస్థకు ఎంతో తోడ్పడిందటున్నారు. అందుకోసం ఈపీఎఫ్‌ఓ సాఫ్ట్‌వేర్ AI (కృత్రిమ మేధ), మెషిన్ లెర్నింగ్ పద్ధతులను ఉపయోగిస్తుంది. క్లెయిమ్ దరఖాస్తులను సభ్యుని కేవైసీ వివరాలు (ఆధార్, బ్యాంకు ఖాతా), ఇతర ప్రమాణాలను ఇది స్వయంచాలకంగా ధ్రువీకరిస్తుంది.
Faster Claim Settlements!
Auto-settlement limit for EPF Advances raised from ₹1 Lakh to ₹5 Lakh.
✅ 71.22% of EPF Advance claims settled automatically (FY 2025–26 up to 30.10.2025). Ensuring speed, efficiency & transparency.
EPFO – Social Security for All
#73YearsOfEPFO pic.twitter.com/2S90D6WzMo— Ministry of Information and Broadcasting (@MIB_India) November 1, 2025
పరిమితి (ప్రస్తుతం రూ.5 లక్షలు) లోపు ఉన్న, నిబంధనలకు అనువుగా ఉన్న అన్ని క్లెయిమ్‌లు మానవ ప్రమేయం లేకుండా సెటిల్ అవుతాయి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) ద్వారా సభ్యుని వివరాలు, KYC డాక్యుమెంట్లు, సర్వీస్ హిస్టరీ అన్నీ ఒకే వేదికపై అనుసంధానం అవుతాయి. క్లెయిమ్‌ల కోసం ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఫామ్-31 (అడ్వాన్స్), ఫామ్-19 (తుది సెటిల్‌మెంట్), ఫామ్-10C (పెన్షన్) అందుబాటులో ఉన్నాయి. ఇవి దరఖాస్తు ప్రక్రియను సరళీకృతం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: రూ.44 వేలకోట్లు రుణ మోసం


