భారత సంతతికి చెందిన అమెరికా టెలికాం పారిశ్రామికవేత్త బంకిం బ్రహ్మభట్‌పై భారీ రుణ మోసం ఆరోపణలు చర్చనీయాంశం అవుతున్నాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) నివేదిక ప్రకారం ఆయనపై 500 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ.44 వేలకోట్లు) భారీ రుణ మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణల్లో నకిలీ ఆదాయం, రుణాల పెంపు వంటి అంశాలు ఉన్నాయి. ఈ వివాదం వేగంగా విస్తరిస్తున్న ప్రైవేట్ క్రెడిట్ మార్కెట్‌లోని ప్రమాదాలపై ఆందోళనలను పెంచుతోంది.
ప్రధాన ఆరోపణలు, దావా వివరాలు
బ్రాడ్‌బ్యాండ్ టెలికాం, బ్రిడ్జ్ వాయిస్ విభాగాల్లోని సంస్థలకు సారథ్యం వహిస్తున్న బంకిం బ్రహ్మభట్ అమెరికన్ రుణదాతల నుంచి పెద్ద ఎత్తున రుణాలు పొందడానికి నకిలీ కస్టమర్ ఖాతాలు, రిసీవబుల్స్‌ను సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్‌లో ఒకటైన బ్లాక్ రాక్ మద్దతుతో కూడిన పెట్టుబడి సంస్థ హెచ్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్‌నర్స్ ఈ రుణదాతల్లో ఉంది.
బ్రహ్మభట్ తమను తప్పుదోవ పట్టించారని ఆరోపిస్తూ హెచ్‌పీఎస్ ఇన్వెస్ట్‌మెంట్ పార్ట్‌నర్స్ నేతృత్వంలోని రుణదాతలు ఆగస్టులో దావా వేశారు. లెక్కల్లో చూపని ఆదాయ మార్గాలను రుణాలు తిరిగి చెల్లించడానికి తాకట్టు(Collateral) పెట్టినట్లు ఆరోపించారు. బ్రహ్మభట్ సంస్థలు ప్రస్తుతం చాప్టర్ 11 దివాలా (Bankruptcy) ప్రక్రియలో ఉన్నాయి. సమష్టిగా ఈ సంస్థలు రుణదాతలకు 500 మిలియన్ డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంది. బ్రహ్మభట్ కూడా ఆగస్టు 12న వ్యక్తిగత దివాలా కోసం దాఖలు చేశారు. ఈ రుణాలు మొదట్లో సెప్టెంబర్ 2020లో ప్రారంభమయ్యాయి. హెచ్‌పీఎస్, దాని భాగస్వామి అయిన బీఎన్‌పీ పరిబాస్ ద్వారా నిధులు అందించారు. ఆగస్టు 2024 నాటికి ఈ రుణం మొత్తం 430 మిలియన్ డాలర్లకు పెరిగింది.
ఆఫీస్‌కు తాళం..
వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ విషయంపై వివరాలు సేకరించేందుకు న్యూయార్క్‌లోని గార్డెన్ సిటీలో ఉన్న బ్రహ్మభట్ కార్యాలయాన్ని సందర్శించినప్పుడు తాళం వేసినట్లు తెలిపింది. కొంతకాలం నుంచి ఆఫీస్ ఖాళీగానే ఉందని చుట్టుపక్కల వారు చెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు బ్రహ్మభట్ అమెరికాను విడిచిపెట్టి ఉండవచ్చని హెచ్‌పీఎస్ భయపడుతున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్‌కి చెప్పారు. అయితే, ఈ ఆరోపణలను బ్రహ్మభట్ న్యాయవాది ఖండించారు. దావాలోని వాదనలు నిరాధారమైనవని తెలిపారు.


