ఎన్‌సీఎల్‌టీ గ్రీన్‌సిగ్నల్
ముంబై: ప్రైవేటు రంగ డైవర్సిఫైడ్ దిగ్గజం వేదాంతా లిమిటెడ్ బిజినెస్‌ల విడదీత ప్రణాళికకు తాజాగా జాతీయ కంపెనీ చట్ట ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) ఓకే చెప్పింది. దీంతో వివిధ బిజినెస్ విభాగాలను రంగాలవారీగా ఐదు స్వతంత్ర కంపెనీలుగా విడదీసేందుకు వేదాంతాకు వీలు చిక్కనుంది. కంపెనీ విడదీత పథకానికి ట్రిబ్యునల్ ముంబై బెంచ్ తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తద్వారా అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, ఐరన్ అండ్ స్టీల్, విద్యుత్ తదితర బిజినెస్‌లను విడిగా లిస్ట్ చేయనుంది. కాగా.. నవంబర్‌లో విచారణ తదుపరి బెంచ్ తీర్పును రిజర్వ్ చేసిన సంగతి తెలిసిందే.
ఎన్‌సీఎల్‌టీ అనుమతి వేదాంతా ట్రాన్స్‌ఫార్మేషన్‌లో కీలక మైలురాయని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. తాజా అనుమతితో విడదీత పథక అమలుకు అవసరమైన చర్యలను చేపట్టనున్నట్లు వెల్లడించారు. 2023లోనే వేదాంతా బిజినెస్‌ల విడదీత ప్రణాళికను ప్రకటించింది. దీనిలో భాగంగా వేదాంతా పేరుతో అల్యూమినియం, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఐరన్ అండ్ స్టీల్‌తోపాటు.. పునర్వ్యవస్థీకరించిన వేదాంతా లిమిటెడ్‌గా ఐదు కంపెనీలకు తెరతీయనుంది. వేదాంతా లిమిటెడ్‌లో జింక్, సిల్వర్ బిజినెస్‌లు కొనసాగనున్నాయి. తాజా అనుమతితో వేదాంతా షేరు ఎన్‌ఎస్‌ఈలో 4% జంప్‌చేసి రూ. 573 వద్ద ముగిసింది.


