హిందుస్తాన్‌ జింక్‌లో వాటా విక్రయించిన దిగ్గజ కంపెనీ | Why Vedanta sold stake in Hindustan Zinc | Sakshi
Sakshi News home page

హిందుస్తాన్‌ జింక్‌లో వాటా విక్రయించిన దిగ్గజ కంపెనీ

Jun 19 2025 8:41 AM | Updated on Jun 19 2025 9:51 AM

Why Vedanta sold stake in Hindustan Zinc

అనిల్‌ అగర్వాల్‌ గ్రూప్‌ దిగ్గజం వేదాంతా తాజాగా మైనింగ్‌ దిగ్గజం హిందుస్తాన్‌ జింక్‌లో మైనారిటీ వాటా విక్రయించింది. బుక్‌బిల్డ్‌ పద్ధతిలో సంస్థాగత ఇన్వెస్టర్లకు హిందుస్తాన్‌ జింక్‌లో 1.6 శాతం వాటాకు సమానమైన 66.7 మిలియన్‌ షేర్లను అమ్మినట్లు వేదాంతా పేర్కొంది. డీల్‌ విలువను రూ.3,028 కోట్లుగా వెల్లడించింది. కంపెనీ వ్యూహాత్మక కార్యకలాపాలపై ఇన్వెస్టర్లకున్న విశ్వాసాన్ని తాజా లావాదేవీ ప్రతిఫలిస్తున్నట్లు పేర్కొంది.

ప్రస్తుత ఏడాది(2025–26)కి కంపెనీ బోర్డు వాటాదారులకు షేరుకి రూ. 7 చొప్పున మధ్యంతర డివిడెండ్‌ చెల్లించేందుకు అంగీకరించినట్లు మరో ప్రకటనలో స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు వేదాంతా సమాచారమిచ్చింది. ఇందుకు ఈ నెల 24(మంగళవారం) రికార్డ్‌ డేట్‌గా ప్రకటించింది. కాగా.. వేదాంతా వివిధ బిజినెస్‌ విభాగాలను ప్రత్యేక కంపెనీలుగా విడదీసే ప్రణాళికలు అమలు చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా సమీకరించిన నిధులను రుణభారాన్ని తగ్గించుకోవడం ద్వారా బ్యాలన్స్‌ షీట్‌ పటిష్టతకు వినియోగించే వీలుంది. తద్వారా ఆర్థిక సౌలభ్యతతోపాటు.. స్వతంత్ర కంపెనీలుగా ఏర్పాటుకానున్న వివిధ బిజినెస్‌ల వృద్ధి ప్రణాళికలకు మద్దతు లభించనున్నట్లు పరిశ్రమవర్గాలు పేర్కొన్నాయి.

ఇదీ చదవండి: ‘ఆరు నెలల్లో అంతా తేల్చేస్తాం..’

ఈ ఏడాది సెప్టెంబర్‌లోగా విభిన్న బిజినెస్‌లను ప్రత్యేక కంపెనీలుగా విడదీయనున్నట్లు ఇప్పటికే వెల్లడించింది. విడదీత తదుపరి వేదాంతా అల్యూమినియం, వేదాంతా ఆయిల్‌ అండ్‌ గ్యాస్, వేదాంతా పవర్, వేదాంతా స్టీల్‌ అండ్‌ ఫెర్రస్‌ మెటీరియల్స్, వేదాంతా బేస్‌ మెటల్స్, వేదాంతా లిమిటెడ్‌ పేరుతో ఆరు సంస్థలుగా కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు వివరించింది.

Advertisement
 
Advertisement
Advertisement