ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు!.. ఎక్కడంటే? | US Preschool Fee Shock, Indian Woman Reveals School Charges Nearly Rs.9 Lakh A Year For Two Year Old, Watch Video Inside | Sakshi
Sakshi News home page

ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు!.. ఎక్కడంటే?

Aug 9 2026 9:07 PM | Updated on Aug 10 2026 9:34 AM

US Preschool Fees Cost As Much As A Maruti Brezza

ఈ రోజుల్లో స్కూల్ పీజులు ఎక్కువగా ఉంటాయని చాలామందికి తెలుసు. కానీ ప్రీస్కూల్ ఫీజు రూ.9 లక్షలు ఉంటుందంటే.. వినడానికి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ ఇది నిజం. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.

అమెరికాలో పిల్లల ప్రీస్కూల్ చదువుకు ఎంత ఖర్చవుతుందో.. తెలిపిన ఓ భారతీయ మహిళ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అమెరికాలోని కనెక్టికట్‌లో నివసిస్తున్న భారతీయ కంటెంట్ క్రియేటర్ సోనల్ చౌదరి.. తన రెండేళ్ల కుమార్తె బానీ కోసం ఓ ప్రైవేట్ ప్రీస్కూల్‌ను సందర్శించారు.

అక్కడ పిల్లలకు ఎలాంటి విద్య అందిస్తారు?, ఫీజు ఎంత ఉంటుంది? అనే విషయాలను ఆమె తెలుసుకున్నారు. ఈ ప్రీస్కూల్‌లో కేవలం ఎనిమిది మంది పిల్లలకు ఇద్దరు టీచర్లు ఉంటారని సిబ్బంది తెలిపారు. పిల్లలకు పాటలు, యోగా, క్రియేటివ్ యాక్టివిటీస్, ఆటలతో పాటు వయసుకు తగ్గట్టుగా నేర్చుకునే కార్యక్రమాలు నిర్వహిస్తారని వెల్లడించారు.

అయితే.. ఫీజు గురించి తెలుసుకున్నప్పుడు సోనల్‌కు అసలు షాక్ తగిలింది. వారానికి రెండు రోజులు ప్రీస్కూల్‌కు పంపిస్తే ఏడాదికి సుమారు రూ.4 లక్షలు ఖర్చవుతుందట. అదే వారానికి ఐదు రోజులు పంపిస్తే ఏడాదికి దాదాపు రూ.9 లక్షలు చెల్లించాలి. అంటే ప్రీస్కూల్ పీజుతో.. మన దేశంలో కొత్త మారుతి బ్రెజ్జా కారు కొనుగోలు చేయొచ్చన్నమాట.

ఇక్కడ తరగతులు సెప్టెంబర్ నుంచి జూన్ చివరి వరకు కొనసాగుతాయి. ఉదయం 8.45 గంటలకు ప్రారంభమై 11.45 గంటలకు ముగుస్తాయి. అంటే రోజుకు మూడు గంటల క్లాసులకే ఇంత భారీ మొత్తంలో ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. ఫీజు ఎక్కువగా ఉన్నప్పటికీ.. పిల్లలపై చూపించే వ్యక్తిగత శ్రద్ధ, తక్కువ మంది పిల్లలతో తరగతులు నిర్వహించడం, ప్రత్యేకమైన యాక్టివిటీస్ వంటి సౌకర్యాలను చూసిన తర్వాత ఆ ఫీజు ఎందుకు ఎక్కువగా ఉందో అర్థమైందని సోనల్ చెప్పారు.

అమెరికాలో కిండర్‌గార్టెన్ నుంచి 12వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్య సాధారణంగా ఉచితంగా ఉంటుందని సోనల్ పేర్కొన్నారు. దీంతో ప్రైవేట్ ప్రీస్కూల్ విద్య అమెరికా తల్లిదండ్రులకు పెద్ద ఖర్చుగా మారుతోందని తెలిపారు.

సోనల్ వీడియో వైరల్ కావడంతో భారత్, అమెరికాలో విద్యా ఖర్చులపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. పిల్లలకు చిన్న తరగతులు, ఎక్కువ శ్రద్ధ, ప్రత్యేకమైన కార్యక్రమాలు అందుతున్నప్పటికీ.. ఏడాదికి రూ.9 లక్షల వరకు ఫీజు చెల్లించడం మాత్రం చాలా కుటుంబాలకు పెద్ద భారమేనని పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఇదీ చదవండి: వచ్చేవారం బంగారం ధరలు ఇలా.. నిపుణుల అంచనా ఇదే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement