అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయులకు.. ప్రస్తుతం ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను అక్కడి ప్రభుత్వం పరిశీలిస్తోంది. సాధారణంగా.. కొన్ని నాన్ ఇమిగ్రెంట్ వీసాలపై ఉన్న ఉద్యోగి తన ఉద్యోగాన్ని కోల్పోతే, వెంటనే అమెరికా నుంచి వెళ్లాల్సిన అవసరం లేదు. కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి 60 రోజుల వరకు సమయం ఉంటుంది. కానీ.. కొత్త ప్రతిపాదన అమల్లోకి వస్తే ఉద్యోగం పోయిన వెంటనే యూఎస్ విడిచి వెళ్లాల్సి వస్తుంది.
60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తొలగించే ప్రతిపాదనను.. అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ తీసుకొచ్చింది. ప్రస్తుతం ఇది ఫెడరల్ ఆఫీస్ ఆఫ్ మేనేజ్‌మెంట్ అండ్ బడ్జెట్ పరిశీలనలో ఉంది. నిజానికి.. 2017లో ఈ 60 రోజుల గ్రేస్ పీరియడ్‌ను తీసుకొచ్చారు. ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి ఇది ఉపయోగపడుతోంది. ప్రస్తుతం H-1Bతో పాటు E-1, E-2, E-3, H-1B1, L-1, O-1, TN వంటి కొన్ని వీసా కేటగిరీలకు ఈ నిబంధన వర్తించే అవకాశం ఉంది.
ఒకవేళ గ్రేస్ పీరియడ్‌ను తొలగిస్తే.. ఉద్యోగం కోల్పోయిన విదేశీ ఉద్యోగులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు వెంటనే అమెరికా విడిచి వెళ్లాల్సి వస్తుంది. ఉద్యోగం పోతే.. అక్కడే ఉండి కొత్త ఉద్యోగం వెతుక్కోవడం అంత సులభం కాదు. అలాగే.. అమెరికాలోనే ఉండి కొత్త కంపెనీకి మారడం లేదా వీసా స్టేటస్ మార్చుకోవడం కూడా ఇబ్బందికరంగా మారవచ్చు. అయితే.. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో USCIS మినహాయింపు ఇచ్చే అవకాశం ఉంటుంది.
ఈ ప్రతిపాదన భారతీయులపై ప్రభావం చూపనుంది. ఎందుకంటే.. అమెరికాలో H-1B వీసాల ద్వారా పనిచేస్తున్న వారిలో భారతీయులు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో H-1B దరఖాస్తుల్లో భారతీయుల వాటా 71 శాతంగా ఉంది. కాబట్టి ఉద్యోగం కోల్పోయిన భారతీయులకు 60 రోజుల సమయం లేకపోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కోవడం మరింత కష్టమవుతుంది. అమెరికా విడిచి రావాల్సి ఉంటుంది.
ఇదీ చదవండి: UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!


