ఈ-స్కూటర్లతో జాగ్రత్త.. బైక్‌లు, సైకిళ్ల కంటే ప్రమాదకరం! | E-Scooters More Dangerous Than Motorbikes Study Brain Injuries | Sakshi
Sakshi News home page

ఈ-స్కూటర్లతో జాగ్రత్త.. బైక్‌లు, సైకిళ్ల కంటే ప్రమాదకరం!

Aug 8 2026 5:22 PM | Updated on Aug 8 2026 5:30 PM

E-Scooters More Dangerous Than Motorbikes Study Brain Injuries

ఎలక్ట్రిక్‌ స్కూటర్లు (ఈ-స్కూటర్లు) నడపడం మోటార్‌సైకిళ్లు లేదా సైకిళ్లు నడపడం కంటే ప్రమాదకరమని ఓ తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ-స్కూటర్‌ (చిన్న చక్రాలవి) ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలు, రక్తనాళాలు దెబ్బతినడం, అంతర్గత అవయవాలకు గాయాలు అయ్యే ముప్పు ఎక్కువగా ఉంటుందని పరిశోధకులు గుర్తించారు. ఈ విషయాలను ‘ది గార్డియన్‌’ నివేదించింది.

చెల్సియా అండ్‌ వెస్ట్‌మినిస్టర్‌ హాస్పిటల్‌కు చెందిన హ్యాండ్‌, ట్రామా, ఆర్థోపెడిక్‌ సర్జన్‌ డేవిడ్‌ బోడాన్స్కీ నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. 2020 నుంచి 2022 మధ్య ఇంగ్లాండ్‌, వేల్స్‌లోని 18 నగరాల్లో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాల సమాచారాన్ని జాతీయ ప్రధాన ట్రామా రిజిస్ట్రీ నుంచి పరిశోధకులు విశ్లేషించారు.

తలకు గాయాల ముప్పు మూడు రెట్లు

మోటార్‌సైకిల్‌ రైడర్లతో పోలిస్తే ఈ-స్కూటర్‌ రైడర్లకు మెదడు గాయం లేదా రక్తనాళాలు దెబ్బతినే అవకాశం మూడు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనంలో తేలింది. అలాగే అంతర్గత అవయవాలకు గాయాలయ్యే అవకాశం సుమారు 1.5 రెట్లు ఎక్కువగా ఉంది. అయితే ఎముకలు విరిగే ప్రమాదం మాత్రం సైక్లిస్టులు, మోటార్‌సైకిల్‌ రైడర్లతో పోలిస్తే తక్కువగా నమోదైంది.

చిన్న చక్రాలే ప్రధాన కారణమా?

ఈ-స్కూటర్ల డిజైన్‌ కూడా ప్రమాద తీవ్రతకు ఓ కారణమని బోడాన్స్కీ అభిప్రాయపడ్డారు. చిన్న పరిమాణంలో ఉండే చక్రాలు గుంతలు, రోడ్డు గుంతలు లేదా ఇతర అడ్డంకుల్లో సులభంగా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. దీంతో రైడర్లు అదుపు తప్పి హ్యాండిల్‌బార్లపై నుంచి ముందుకు ఎగిరి తలపై పడే ప్రమాదం ఉంటుందని ఆయన వివరించారు. మరోవైపు ప్రమాద సమయంలో ఈ-స్కూటర్‌ రైడర్లలో 6 శాతం కంటే తక్కువ మంది మాత్రమే హెల్మెట్‌ ధరించినట్లు అధ్యయనంలో వెల్లడైంది. దీంతో తలకు సంబంధించిన గాయాలు మరింత తీవ్రంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

మహిళలు, యువతకూ అధిక ముప్పు

ఈ-స్కూటర్‌ ప్రమాదాల్లో లింగపరమైన తేడాలు కూడా కనిపించాయి. పురుషులతో పోలిస్తే మహిళలు సుమారు మూడో వంతు ఎక్కువగా ప్రమాదాలకు గురైనట్లు, అలాగే తీవ్రమైన గాయాలు నమోదయ్యే అవకాశం రెండు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఈ-స్కూటర్ల హ్యాండిల్‌బార్లు సాధారణంగా పురుషుల శరీరాకృతికి అనుగుణమైన ఎత్తులో ఉండటం కూడా మహిళలకు ఎక్కువగా గాయాలు కావడానికి ఓ కారణం కావచ్చని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మొత్తం ఈ-స్కూటర్‌ గాయాల్లో 16 శాతం మంది పిల్లలే ఉన్నట్లు అధ్యయనం పేర్కొంది.

భద్రతా నిబంధనలు కఠినతరం చేయాలంటున్న నిపుణులు

యూకేలోని చాలా ప్రాంతాల్లో పబ్లిక్‌ రోడ్లు, ఫుట్‌పాత్‌లు, సైకిల్‌ లేన్లపై ప్రైవేట్‌ ఈ-స్కూటర్లను నడపడం చట్టబద్ధం కాదు. అయినప్పటికీ నిబంధనలను ఉల్లంఘిస్తూ నడుపుతున్న వారి నుంచి పోలీసులు వేలాది ఈ-స్కూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ-స్కూటర్‌ వినియోగదారుల భద్రత కోసం తప్పనిసరి భద్రతా శిక్షణ, హెల్మెట్‌ వినియోగం, మెరుగైన డిజైన్‌తో కూడిన స్కూటర్లను అందుబాటులోకి తీసుకురావాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, యువ రైడర్లకు భద్రత కల్పించేలా ఈ-స్కూటర్ల రూపకల్పన, వినియోగ నిబంధనలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement