యూపీఐ ఛార్జీలపై ఫోన్‌పే సీఈవో కీలక వ్యాఖ్యలు | UPI Charges PhonePe CEO Big Statement | Sakshi
Sakshi News home page

యూపీఐ ఛార్జీలపై ఫోన్‌పే సీఈవో చెప్పేశాడు!

Aug 8 2026 4:02 PM | Updated on Aug 8 2026 4:14 PM

UPI Charges PhonePe CEO Big Statement

యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) ఛార్జీలపై ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూపీఐ వినియోగంపై భారతీయ వినియోగదారులకు ఎలాంటి ఛార్జీలు విధించబోమని స్పష్టం చేశారు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే వినియోగదారులు ఎలాంటి లావాదేవీ రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

ఎక్స్‌లో చేసిన ఓ పోస్టులో సమీర్ నిగమ్ స్పందిస్తూ.. ‘‘యూపీఐ భారతీయ వినియోగదారులందరికీ ఉచితం. యూపీఐ చెల్లింపులు చేసినందుకు వినియోగదారుల నుంచి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయరు’’ అని పేర్కొన్నారు.

ఇదే విషయాన్ని పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PCI) కూడా స్పష్టం చేసింది. పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్, 2007ను సవరించే బిల్లును లోక్‌సభ ఆమోదించిన నేపథ్యంలో యూపీఐ ఛార్జీలపై చర్చ మొదలైంది. అయితే వినియోగదారులు, చిన్న వ్యాపారులకు యూపీఐ సేవలు ఉచితంగానే కొనసాగుతాయని పీసీఐ తెలిపింది.

యూపీఐ సహా నోటిఫై చేసిన ఎలక్ట్రానిక్ చెల్లింపు విధానాలపై ఛార్జీలు విధించే అవకాశాన్ని ప్రభుత్వానికి  కల్పించేలా చట్ట సవరణ బిల్లు రూపొందించారు. అయితే దీనర్థం వినియోగదారుల నుంచి నేరుగా యూపీఐ లావాదేవీ ఛార్జీలు వసూలు చేస్తారని కాదని పీసీఐ పేర్కొంది.

2016లో యూపీఐ ప్రారంభమైనప్పటి నుంచి వినియోగదారులకు ఈ సేవ ఉచితంగానే అందుతోందని అసోసియేషన్ తెలిపింది. భవిష్యత్తులోనూ ప్రతి భారతీయుడు ఎలాంటి లావాదేవీ రుసుము లేకుండా తక్షణ డిజిటల్ చెల్లింపులు చేసుకోవచ్చని పేర్కొంది.

చిన్న వ్యాపారులకూ ఛార్జీలు లేవు

కిరాణా దుకాణాలు సహా చిన్న వ్యాపారులు కూడా యూపీఐ చెల్లింపులను స్వీకరించేందుకు మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) చెల్లించాల్సిన అవసరం లేదని పీసీఐ స్పష్టం చేసింది. యూపీఐ ఛార్జీలపై జరుగుతున్న చర్చ ప్రధానంగా ఈ వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలకు దీర్ఘకాలిక, స్థిరమైన ఆర్థిక నమూనాను అభివృద్ధి చేయడంపైనే ఉందని తెలిపింది.

ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ పేమెంట్ వ్యవస్థగా యూపీఐ ఎదిగింది. కోట్లాది మంది వినియోగదారులు, వ్యాపారులు రోజువారీ చెల్లింపుల కోసం దీనిని వినియోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో యూపీఐ వినియోగదారులు, చిన్న వ్యాపారులకు ఉచిత సేవలు కొనసాగుతాయని ఫోన్‌పే సీఈవో, పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్పష్టత ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement