గూగుల్ పే, ఫోన్ పే ఇకపై ఉచితం కావు
సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం
మళ్లీ నగదు లావాదేవీలు పెరుగుతాయని అంచనా
న్యూఢిల్లీ: యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్(యూపీఐ) లావాదేవీలతోపాటు ఇతర ఎల్రక్టానిక్ ఆధారిత చెల్లింపులపై బ్యాంకులు చార్జీలు విధించబోతున్నాయి. ఈ మేరకు బ్యాంకులకు అధికారం కల్పిస్తూ పేమెంట్, సెటిల్‌మెంట్స్ చట్టం–2007లో కేంద్ర ప్రభుత్వం సవరణ చేసింది. సవరణ బిల్లును గురువారం లోక్‌సభలో ఆమోదించారు. ఎలాంటి చర్చ లేకుండానే మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదం పొందింది.
ప్రస్తుతం యూపీఐ పేమెంట్లు ఉచితమే. గూగుల్ పే, ఫోన్ పే వంటి యాప్‌ల ద్వారా డబ్బులు పంపించినా లేక స్వీకరించినా ఎలాంటి రుసుములు వసూలు చేయడం లేదు. ఇకపై వీటికి రుసుములు కట్టాల్సిందే. బ్యాంకులు ఈ రుసుములు వసూలు చేస్తాయి. ఆర్టీజీఎస్, నెఫ్ట్ ద్వారా చేసే తక్షణ చెల్లింపులకు సేవా రుసుము చెల్లించాల్సి ఉంటుంది. నోటిఫైడ్ ఎల్రక్టానిక్ చెల్లింపు విధానాలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్(ఎండీఆర్) వసూలు చేయకుండా బ్యాంకులు లేదా చెల్లింపు సేవా సంస్థలను నిరోధించే ప్రస్తుత చట్టపరమైన నిబంధనను తొలగించాలని ఈ సవరణ బిల్లు సూచిస్తోంది.
వినియోగదారులపై అదనపు భారం
లోక్‌సభలో గురువారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ‘పన్నులు, ఇతర చట్టాలు (సవరణ) బిల్లు–2026’ను పరిశీలన నిమిత్తం ప్రవేశపెట్టారు. పేమెంట్, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం–2007, ఇన్‌కంట్యాక్స్ చట్టం–2025, ఫైనాన్స్ చట్టం–2026ను సవరించడం ఈ బిల్లు ఉద్దేశం. వినియోగదారులు, చిన్న వ్యాపారాల కోసం డిజిటల్ చెల్లింపు సేవలపై రుసుము విధించడంతోపాటు డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను నడిపించే బ్యాంకులు, చెల్లింపు సేవా ప్రదాతలు, చెల్లింపు మౌలిక సదుపాయాల సంస్థలకు స్థిరమైన ఆదాయం వచ్చేలా చేయడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది.
పేమెంట్, సెటిల్‌మెంట్ సిస్టమ్స్ చట్టం–2007లోని సెక్షన్ 10ఏలో, ఆదాయపు పన్ను చట్టం–1961లోని సెక్షన్ 269ఎస్‌యూ కింద నిర్దేశించిన ‘ఎల్రక్టానిక్ చెల్లింపు విధానాలు’అనే పదాలు, అంకెలు, అక్షరాలకు బదులుగా ‘కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా నిర్దేశించే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎల్రక్టానిక్ చెల్లింపు విధానాలు’అనే పదాలను చేర్చాలని తాజా బిల్లు పేర్కొంది.
సెక్షన్ 10ఏ బ్యాంకులు, సిస్టమ్ ప్రొవైడర్లు ఎల్రక్టానిక్ చెల్లింపులపై చార్జీలు విధించడాన్ని నిషేధిస్తోంది. సెక్షన్ 269ఎస్‌యూ రూ.50 కోట్లకు మించిన టర్నోవర్ ఉన్న పెద్ద వ్యాపారాలు, రూపే డెబిట్ కార్డులు, భీమ్–యూపీఐ క్యూర్ కోడ్‌లతో సహా నిర్దిష్ట ఎల్రక్టానిక్ పద్ధతుల ద్వారా చెల్లింపులను స్వీకరించాలని నిర్దేశిస్తోంది.
ప్రస్తుతానికి సెక్షన్ 269ఎస్‌యూ కింద నిర్దేశించిన ఎల్రక్టానిక్ చెల్లింపు విధానాలను ఉపయోగించినందుకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎటువంటి రుసుము విధించడం లేదు. బిల్లు చట్టంగా మారిన తర్వాత ఇలాంటి చెల్లింపులపై బ్యాంకులు చార్జీలు విధించబోతున్నాయి. వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది. దీనివల్ల మళ్లీ నగదు లావాదేవీలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. యూపీఐ చెల్లింపుల వంటి ప్రజా మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి అవసరమని, దానికి ఎవరో ఒకరు రుసుము చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టంచేశారు.


