ఇదీ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి | Rajasthan hospital roof collapse injures woman | Sakshi
Sakshi News home page

ఇదీ ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి

Aug 6 2026 9:23 PM | Updated on Aug 6 2026 9:29 PM

Rajasthan hospital roof collapse injures woman

జైపూర్‌: ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పైకప్పు ఓ భాగం కూలి మహిళపై పడటంతో ఆమెకు గాయాలయ్యాయి. ఆమెకు 2 కుట్లు వేయాల్సి వచ్చింది. సాధారణంగా బయట గాయాలైతే కుట్లు వేయించుకోవడానికి ఆసుపత్రికి వస్తారు. కానీ, ఆసుపత్రుల్లోనే గాయాలు అవుతుండడం మన దౌర్భాగ్యం.

రాజస్థాన్‌లోని చూరు జిల్లా సుజన్‌గఢ్‌లోని దుర్గాదత్ ఫతేపురియా మాతా శిశు ప్రభుత్వ ఆసుపత్రి నుంచి కిరణ్ మేఘ్వాల్ (25) బయటకు వస్తుండగా, వరండాలోని పైకప్పు ఓ భాగం ఆమెపై పడింది. సుజన్‌గఢ్ ప్రధాన వైద్య అధికారి డాక్టర్ పురుషోత్తం కర్వా దీని గురించి మాట్లాడుతూ.. మేఘ్వాల్‌కు 2 కుట్లు వేయాల్సి వచ్చిందన్నారు. “ఆగస్టు 4న మరమ్మతుల కోసం ప్రజా నిర్మాణ శాఖకు లేఖ రాశాం. ఇప్పుడు మళ్లీ లేఖ పంపాం” అని చెప్పారు.

వరండాతో పాటు మరో గదిలో కూడా ప్లాస్టర్ కొంత ఊడిపోయిందని ఆయన తెలిపారు. అయితే ఆసుపత్రి అంతటా ఇదే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. “ఆ భాగాన్ని కూల్చాలా లేక మరమ్మతులు చేయాలా అన్న విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ఓ మేస్త్రీని కూడా పిలిచాం” అని చెప్పారు.

సిగ్గుచేటు అంటున్న కాంగ్రెస్‌ 
ఈ ఘటనను కాంగ్రెస్ సిగ్గుచేటుగా పేర్కొంది. “ప్రజలు చికిత్స కోసం ఆసుపత్రులకు వెళ్తారు. కానీ రాజస్థాన్‌లో ఆసుపత్రులే ప్రాణాంతకంగా మారుతున్నాయి” అని కాంగ్రెస్ ఎక్స్‌లో పోస్టు చేసింది. “ఓ మహిళ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చింది. వైద్యుడిని కలిసేలోపే పైకప్పు ప్లాస్టర్ ఆమెపై పడింది. బీజేపీ ప్రభుత్వ ఘోర అవినీతి కారణంగా ఎక్కడ చూసినా మౌలిక సదుపాయాలు కూలిపోతున్నాయి. ఈ ప్రభుత్వ దృష్టిలో ప్రజల ప్రాణాలకు విలువ లేదు. ప్రజలు బతికినా చనిపోయినా పట్టించుకోకుండా సంపద దోచుకోవడం, భారీ స్థాయిలో కమీషన్లు తీసుకోవడంపైనే ప్రభుత్వ దృష్టి ఉంది” అని విమర్శించింది.

రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతాస్రా దీన్ని ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనంగా అభివర్ణించారు. “పాఠశాల అయినా, ఆసుపత్రి అయినా బీజేపీ ప్రభుత్వ హయాంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. శిథిలావస్థకు చేరిన భవనాలు, కూలిపోతున్న వ్యవస్థలు, ప్రజల ప్రాణాల పట్ల నిర్లక్ష్య వైఖరి కనిపిస్తోంది” అని అన్నారు.

“రాజస్థాన్‌లో ఒకసారి పాఠశాల పైకప్పు కూలిపోతుంది, మరోసారి ఆసుపత్రిలో ప్లాస్టర్ రోగులపై పడుతోంది. ఆమె త్వరగా కోలుకోవాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. ఇది కేవలం ప్రమాదం కాదు. బీజేపీ ప్రభుత్వ హయాంలో పెరిగిపోయిన అవినీతి, నిర్లక్ష్యం, దెబ్బతిన్న వ్యవస్థలకు ఇది కఠిన వాస్తవం” అని ఆయన అన్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement