న్యూఢిల్లీ: దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రహదారి మౌలిక వసతులను మెరుగుపరిచేలా కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ (CBG) ఉత్పత్తిని ప్రోత్సహించేందుకు రూ.23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్‌ధన్ (GOBARdhan)’ జాతీయ సమగ్ర పథకానికి, అస్సాంలో గువాహటి–తేజ్‌పూర్ నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ కారిడార్ అభివృద్ధికి ₹8,970.20 కోట్ల పెట్టుబడితో కూడిన ప్రాజెక్టుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు ప్రాజెక్టుల విలువ కలిపి సుమారు రూ.32,701 కోట్లు.
సీబీజీ ఉత్పత్తికి భారీ ఊతం
‘గాల్వనైజింగ్ ఆర్గానిక్ బయో-అగ్రో రిసోర్సెస్ ధన్’ (GOBARdhan) పథకాన్ని జాతీయ స్థాయిలో సమగ్రంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ పథకానికి రూ.23,731 కోట్ల ఆర్థిక కేటాయింపు చేయనుంది. సేంద్రియ వ్యర్థాలు, పశువుల పేడ, వ్యవసాయ అవశేషాలు, వంటగది వ్యర్థాలు వంటి బయో వ్యర్థాలను వినియోగించి బయోగ్యాస్, తదుపరి దశలో కంప్రెస్డ్ బయోగ్యాస్ తయారు చేయడమే దీని ప్రధాన ఉద్దేశం.
దేశీయ సీబీజీ ఉత్పత్తిని ప్రస్తుత స్థాయితో పోలిస్తే దాదాపు పది రెట్లు పెంచడం ద్వారా దిగుమతి చేసుకునే సహజ వాయువుపై ఆధారపడటాన్ని తగ్గించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంతో వ్యర్థాల నిర్వహణతో పాటు ప్రత్యామ్నాయ ఇంధన ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, రైతుల ఆదాయం, ఉపాధి అవకాశాలకు ఊతం లభించే అవకాశం ఉంది.
గోబర్‌ధన్ పథకం 2018లో స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ)లో భాగంగా ప్రారంభమైంది. బయో వ్యర్థాలను బయోగ్యాస్, బయో-స్లర్రీగా మార్చడం ద్వారా గ్రామాల్లో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు వ్యర్థాలను విలువైన వనరుగా మార్చడం దీని ప్రాథమిక లక్ష్యం. 2026 జనవరి 27 నాటికి రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదించిన వివరాల ప్రకారం దేశంలో పలు సీబీజీ ప్రాజెక్టులు ఇప్పటికే పనిచేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా కంప్రెస్డ్ బయోగ్యాస్ (#CBG) అభివృద్ధికి ₹23,731 కోట్ల వ్యయంతో ‘గోబర్‌ధన్ (GOBARdhan)’ జాతీయ సమగ్ర పథకానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
➡️ ఈ పథకం ద్వారా దేశీయ #CBG ఉత్పత్తిని దాదాపు పది రెట్లు పెంచడంతో పాటు, భారత ఇంధన భద్రతను మరింత బలోపేతం చేయడం లక్ష్యం.… pic.twitter.com/zwf2Q3zzB5— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 6, 2026
గువాహతి–తేజ్‌పూర్ మధ్య 135.87 కి.మీ నాలుగు లేన్ల కారిడార్
అస్సాంలో జాతీయ రహదారి–15పై 135.871 కి.మీ పొడవైన గువాహతి–తేజ్‌పూర్ కారిడార్‌ను నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్ (BOT) టోల్ విధానంలో, నేషనల్ హైవేస్ (ఒరిజినల్) కింద రూ.8,970.20 కోట్ల మొత్తం మూలధన వ్యయంతో చేపట్టనున్నారు.
ఈ ప్రాజెక్టులో 58.7 కి.మీ పొడవున ఐదు ప్రధాన బైపాస్‌లు, 15 ప్రధాన వంతెనలు, 30 చిన్న వంతెనలు, 19 ఫ్లైఓవర్లు, 46 అండర్‌పాస్‌లు, సుమారు 210 కి.మీ సర్వీస్ రోడ్లు నిర్మించనున్నారు. తేజ్‌పూర్ బైపాస్‌లో 4.9 కి.మీ పొడవైన ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ (ELF)ని కూడా ఏర్పాటు చేయనున్నారు. ఈ సదుపాయం భారత వైమానిక దళంతో సమన్వయంతో ఖరారు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.
అస్సాంలోని జాతీయ రహదారి-15 పై 135.871 కి.మీ పొడవైన, నాలుగు లేన్ల యాక్సెస్ కంట్రోల్డ్ గువాహటి–తేజ్‌పూర్ కారిడార్ అభివృద్ధికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
➡️ ఈ ప్రాజెక్టును బిల్డ్–ఆపరేట్–ట్రాన్స్‌ఫర్ (BOT) టోల్ విధానంలో, NH(O) కింద ₹8,970.20 కోట్ల మొత్తం మూలధన వ్యయంతో… pic.twitter.com/pkKzkNBXFA— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) August 6, 2026


