గువాహటి: హాయిగా అందినకాడికి తినేసే గజరాజుకు మహా కష్టం వచ్చిపడింది. అస్సాంలోని గోలాఘాట్ జిల్లా అటవీ ప్రాంతంలో స్వేచ్ఛగా తిరిగే ఏనుగు అనూహ్యంగా ఒక ట్రాక్టర్ టైరును తొండంతో పైకి లాక్కుంది. అది కాస్తా మెడకు పట్టేయడంతో తెగ ఇబ్బందులు పడుతూ అడవిలో తిరగడం స్థానికుల కంటపడింది. విషయం ఖుంతాయ్ నియోజకవర్గ ఎమ్మెల్యే మృణాల్ సైకియా చెవిన పడటంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే రంగంలోకి దిగిన అటవీ సిబ్బంది ఏనుగు కోసం అన్వేషించి ఎట్టకేలకు మోరోంగీలోని బొకియాల్ అటవీప్రాంతంలో ఏనుగును గుర్తించారు. మత్తుమందు ఇంజెక్షన్ ఇచ్చి ఏనుగు కాస్తంత శాంతించేలా చేశారు. సిబ్బంది శ్రమకోర్చి ఎలాగోలా ఏనుగు తల నుంచి ట్రాక్టర్ టైరును తొలగించారు. గురువారం జరిగిన ఈ రెస్క్యూ ఆపరేషన్ తాలూకు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. అడవి ఏనుగుకు టైరు బాధ తప్పించిన అటవీ సిబ్బందిని అటవీ మంత్రి అభినందించారు.


