కేంద్రం, ఐటీ శాఖకు సుప్రీంకోర్టు నోటీసులు
చిన్నారుల రక్షణకు ఇంటర్నెట్‌లో ఫైర్‌వాల్స్ అత్యవసరం
ఆటోమేటెడ్ ఫిల్టరింగ్ వ్యవస్థల ఏర్పాటులో సంస్థల వైఫల్యం
కోర్టు దృష్టికి తీసుకొచ్చిన పిటిషనర్
సాక్షి, న్యూఢిల్లీ: ఆన్‌లైన్, సోషల్ మీడియా వేదికలపై చిన్నారులకు సంబంధించిన అసభ్యకర, అశ్లీల కంటెంట్‌ను అరికట్టేందుకు తీసుకుంటున్న చర్యలపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఆన్‌లైన్‌లో పిల్లలకు రక్షణ కల్పించేలా కచ్చితమైన మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ‘జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్’దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కేంద్రంతో పాటు ఎల్రక్టానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, న్యాయ మంత్రిత్వ శాఖలకు గురువారం నోటీసులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వి.మోహనల ధర్మాసనం ఈ కేసును గురువారం విచారించింది. ఇంటర్నెట్‌ను వినియోగించే పిల్లలను రక్షించేందుకు ఇంటర్నెట్‌లో ఫైర్‌వాల్స్ ఏర్పాటు చేయడం అత్యవసరమని ధర్మాసనం స్పష్టం చేసింది. అశ్లీల కంటెంట్ నిరోధానికి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ ఇంటర్నెట్ ప్లాట్‌ఫామ్‌లు ఆటోమేటెడ్ కంటెంట్–ఫిల్టరింగ్, వయో నిర్ధారణ యంత్రాంగాలను ఏర్పాటు చేయడంలో విఫలమయ్యాయని పిటిషనర్ కోర్టు దష్టికి తీసుకెళ్లారు.
అల్గారిథమిక్ రికమండేషన్ల కారణంగా చిన్నపిల్లలు పదేపదే అసభ్య కంటెంట్ బారిన పడుతున్నారని వివరించారు. పోక్సో చట్టం కింద అశ్లీల కంటెంట్‌ను రిపోర్ట్ చేయని ఇంటర్నెట్ సంస్థలు, ఐటీ చట్టం కింద లభించే చట్టపరమైన రక్షణ కోల్పోతాయని 2024 నాటి తీర్పును పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది హెచ్‌ఎస్ ఫూల్కా కోర్టుకు గుర్తుచేశారు. ఆన్‌లైన్ వేదికల్లో ఉన్న అల్గారిథమిక్ ఆడిట్‌లు, అమలులో ఉన్న కంటెంట్ ఫిల్టరింగ్ ప్రొటోకాల్స్‌పై పూర్తి నివేదిక సమర్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ సుప్రీంకోర్టు విచారణను వాయిదా వేసింది.


