సైనిక విన్యాసంలో పేలిపోయిన చైనా ట్యాంక్‌! | Bangladesh Army Tank Explosion During Live Fire Drill Viral China Link | Sakshi
Sakshi News home page

సైనిక విన్యాసంలో పేలిపోయిన చైనా ట్యాంక్‌!

Sep 10 2026 8:52 AM | Updated on Sep 10 2026 9:00 AM

Bangladesh Army Tank Explosion During Live Fire Drill Viral China Link

బంగ్లాదేశ్‌లో సైనిక విన్యాసం విషాదాంతంగా మారింది. ఫీల్డ్‌ ఫైరింగ్‌ ప్రాక్టీస్‌లో భాగంగా ట్యాంక్‌ నుంచి కాల్పులు జరుపుతుండగా అకస్మాత్తుగా అందులో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఓ సైనిక అధికారి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన ట్యాంక్‌.. చైనాకు చెందిందిగా తెలుస్తోంది. 

బుధవారం (సెప్టెంబర్‌ 9) చట్టోగ్రామ్‌లోని హాత్‌హజారీ ఫీల్డ్‌ ఫైరింగ్‌ రేంజ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఫైరింగ్‌ రేంజ్‌లో సైనిక విన్యాసం కొనసాగుతున్న సమయంలో ట్యాంక్‌ నుంచి గోలాలు(మందు గుండు బాల్స్‌) ప్రయోగిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.  ప్రమాదంలో ఇద్దరు సైనికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. గాయపడిన అధికారికి తొలుత అత్యవసర చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం హెలికాప్టర్‌లో ఢాకాలోని కంబైన్డ్‌ మిలిటరీ హాస్పిటల్‌ (సీఎంహెచ్‌)కు తరలించారు. బంగ్లాదేశ్‌ సైన్యం ఇంటర్‌-సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ డైరెక్టరేట్‌ (ఐఎస్‌పీఆర్‌) ఈ ప్రమాదంపై ప్రకటన చేసింది. 

అసలు ఏం జరిగింది?
ట్యాంక్‌ నుంచి కాల్పులు జరుపుతున్న సమయంలోనే ఒక్కసారిగా పేలుడు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణం మాత్రం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ట్యాంక్‌లోని మందుగుండు సామగ్రి కారణమా? లేదంటే ట్యాంక్‌లోని ఫైరింగ్‌ వ్యవస్థలో సాంకేతిక లోపం ఉందా? అనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

చైనా తయారీ ట్యాంక్..!
ప్రమాదానికి గురైన ట్యాంక్‌ చైనాకు చెందినదిగా తెలుస్తోంది. అది టైప్‌–59 అని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి. సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న వీడియోల్లోనూ ఇదే తరహా ట్యాంక్‌ కనిపిస్తోంది. అయితే బంగ్లాదేశ్‌ ఆర్మీ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ట్యాంక్‌ మోడల్‌ను వెల్లడించలేదు. టైప్‌–59ను బంగ్లాదేశ్‌ ఆర్మీ చాలాకాలంగా వినియోగిస్తోంది. పాత ట్యాంకులను చైనా సాయంతో ఆధునికీకరించి ‘డుర్జోయ్‌’గా కూడా అప్‌గ్రేడ్‌ చేసింది.

దశాబ్దాలుగా బంగ్లా ఆర్మీలో..
చైనాలో తయారైన టైప్‌–59.. సోవియట్‌ కాలం నాటి టీ–54 ట్యాంక్‌ ఆధారంగా అభివృద్ధి చేసిన ప్రధాన యుద్ధ ట్యాంక్‌. బంగ్లాదేశ్‌ ఆర్మీ చాలా కాలంగా ఈ తరహా చైనా తయారీ ఆర్మర్డ్‌ వాహనాలను వినియోగిస్తోంది. పాతబడుతున్నప్పటికీ వాటిని పూర్తిగా తొలగించకుండా.. ఆధునికీకరణ, అప్‌గ్రేడ్‌ల ద్వారా మరికొంతకాలం సేవల్లో కొనసాగిస్తోంది. అందులో భాగంగా 40 టైప్‌–59 ట్యాంకుల అప్‌గ్రేడ్‌, మరో 58 టైప్‌–69ఐఐజీ ట్యాంకుల ఆధునికీకరణకు సంబంధించిన కార్యక్రమాలు చేపట్టినట్లు అక్కడి రక్షణ రంగ నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే బంగ్లాదేశ్‌ ఆర్మీకి ఇవి కేవలం పాత ట్యాంకులు మాత్రమే కాకుండా.. ఇప్పటికీ దాని ఆర్మర్డ్‌ ఫ్లీట్‌లో భాగంగా ఉన్న కీలక ప్లాట్‌ఫారమ్‌లన్నమాట!.

దర్యాప్తు ప్రారంభం
ఈ ఘటనపై బంగ్లాదేశ్‌ ఆర్మీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. ఈ ప్రమాదంపై విచారణ ప్రారంభించినట్లు చెబుతోంది. అయితే పేలుడు ఎలా సంభవించింది? ఫైరింగ్‌ సమయంలో ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తిందా? మందుగుండు సామగ్రికి సంబంధించిన సమస్య ఏమైనా ఉందా? ట్యాంక్‌ పనితనం వంటి అంశాలను దర్యాప్తు అధికారులు పరిశీలించనున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా..  ఫీల్డ్‌ ఫైరింగ్‌ వంటి సైనిక శిక్షణ కార్యక్రమాల్లో అనుకోని ప్రమాదాలు ఎంతటి విషాదానికి దారితీస్తాయో ఈ ఘటన మరోసారి చూపించింది.

ఇదీ చదవండి: మిడిల్‌ఈస్ట్‌లో పాక్‌కు బిగ్‌ టెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement