ఫేవరెట్‌గా భారత్‌ | Bangladesh vs India semi final match of Asia Cup T20 tournament today | Sakshi
Sakshi News home page

ఫేవరెట్‌గా భారత్‌

Sep 10 2026 1:01 AM | Updated on Sep 10 2026 1:01 AM

Bangladesh vs India semi final match of Asia Cup T20 tournament today

నేడు బంగ్లాదేశ్‌తో ఆసియా కప్‌ టి20 టోర్నీ సెమీఫైనల్‌

రాత్రి 8 గంటల నుంచి సోనీ స్పోర్ట్స్‌ చానెల్, సోనీ లివ్‌ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం  

దుబాయ్‌: మహిళల ఆసియా కప్‌ టి20 టోర్నీలో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు సెమీఫైనల్‌ పోరుకు సిద్ధమైంది. నేడు జరిగే మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ బృందం తలపడుతుంది. లీగ్‌ దశలో మూడు విజయాలతో భారత మహిళలు అజేయంగా నిలవగా... రెండు చిన్న జట్లపై విజయాలతో బంగ్లాదేశ్‌ సెమీస్‌కు చేరింది. ఓవరాల్‌గా బలాబలాలను బట్టి చూస్తే బంగ్లాదేశ్‌పై భారత బృందం ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. థాయ్‌లాండ్‌తో మ్యాచ్‌లో మిడిలార్డర్‌ కొంత తడబడినా... తర్వాతి రెండు మ్యాచ్‌లలో టీమ్‌ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. 

ఓపెనర్లుగా షఫాలీ, స్మృతి దూకుడైన ఆటతో ఇన్నింగ్స్‌కు సరైన పునాది వేస్తున్నారు. జెమీమా గాయంతో అనూహ్యంగా జట్టులోకి వచ్చిన ప్రతీక రావల్‌ మూడు మ్యాచ్‌లలోనూ విఫలం కావడం ఒక్కటే ఇప్పుడు జట్టుకు కాస్త ఆందోళన కలిగించే అంశం. హర్మన్‌ప్రీత్, దీప్తి శర్మ, భారతి ఫుల్మాలి, రిచా ఘోష్‌ మిడిలార్డర్‌లో రాణించి జట్టుకు మెరుగైన స్కోరు అందించగలరు. భారత బౌలింగ్‌ మరింత పదునుగా కనిపిస్తోంది. 

ముఖ్యంగా ముగ్గురు స్పిన్నర్లు శ్రీచరణి, దీప్తి, ప్రేమ రావత్‌ ప్రత్యర్థి బ్యాటర్లను కట్టిపడే యగలరు. పేసర్లు క్రాంతి, నందని శర్మ కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు కాబట్టి తుది జట్టులో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. మరోవైపు బంగ్లాదేశ్‌ బ్యాటింగ్‌ చాలా బలహీనంగా ఉంది. దియానా, జువేరియా, నిగార్, షర్మిన్‌ భారత్‌పై ఏమాత్రం ప్రభావం చూపించగలరనేది సందేహమే. అయితే బౌలింగ్‌ కొంత మెరుగ్గా ఉండటం జట్టుకు సానుకూలాంశం. 

ముఖ్యంగా పేసర్‌ మారుఫా తన స్వింగ్‌తో చెలరేగిపోగల సమర్థురాలు. సుల్తానా, నాహిదా ఆమెకు సహకరించాల్సి ఉంది. వేడి వాతావరణం కొనసాగుతుండగా, ఈ టోర్నీలో పిచ్‌లు స్పిన్‌కు బాగా అనుకూలిస్తున్నాయి. బంగ్లాదేశ్‌ చేతిలో చివరిసారిగా 2023లో ఓడిన భారత్‌... ఆ తర్వాత వరుసగా 8 మ్యాచ్‌లలో గెలిచింది. స్మృతి మరో 67 పరుగులు చేస్తే అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా కొత్త రికార్డు నెలకొల్పుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement