మోకి (చైనా): డిఫెండింగ్ చాంపియన్ హోదాకు తగ్గట్టు ఆడుతోన్న భారత పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ జూనియర్ టోర్నీలో సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన పూల్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 15–0 గోల్స్ తేడాతో చైనీస్ తైపీపై ఘనవిజయం సాధించింది. భారత్ తరఫున కెపె్టన్ అన్‌మోల్ ఎక్కా ఆరు గోల్స్ (25వ, 29వ, 32వ, 33వ, 45వ, 51వ నిమిషాల్లో)... ఆర్యన్ మూడు గోల్స్ (17వ, 52వ, 53వ నిమిషాల్లో), హర్పాల్ రెండు గోల్స్ (48వ, 53వ నిమిషాల్లో) చేశారు.
గురుసేవక్ సింగ్ (22వ ని.లో), ప్రభ్‌దీప్ సింగ్ (18వ ని.లో), అజీత్ యాదవ్ (35వ ని.లో), అర్జున్ సంతోష్ హర్గుడె (28వ ని.లో) ఒక్కో గోల్ సాధించారు. ఐదు జట్లున్న పూల్ ‘ఎ’లో భారత్ మూడు మ్యాచ్‌ల్లో గెలిచి, ఒక మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని 10 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో... దక్షిణ కొరియా 9 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాయి. పూల్ ‘బి’ నుంచి పాకిస్తాన్, మలేసియా జట్లు సెమీఫైనల్ చేరుకున్నాయి.
శుక్రవారం జరిగే సెమీఫైనల్స్‌లో మలేసియాతో భారత్; పాకిస్తాన్‌తో దక్షిణ కొరియా తలపడతాయి. మరోవైపు భారత మహిళల జట్టు చైనాతో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్‌ను 0–0తో ‘డ్రా’ చేసుకుంది. నేడు జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో పాకిస్తాన్‌తో భారత్; హాంకాంగ్‌తో చైనీస్ తైపీ; బంగ్లాదేశ్‌తో జపాన్; మలేసియాతో దక్షిణ కొరియా పోటీపడతాయి.


