source: X
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్ జో రూట్ మరో ఘనత సాధించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో అత్యధిక టెస్ట్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో స్టీవ్ వా (168), రికీ పాంటింగ్ (168)ను వెనక్కు నెట్టి మూడో స్థానానికి చేరాడు. పాకిస్తాన్‌తో ఇవాళ మొదలైన మూడో టెస్ట్‌తో రూట్ (169) ఈ ఘనత సాధించాడు.
ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (200), జేమ్స్ ఆండర్సన్ (188) మాత్రమే రూట్ కంటే ముందున్నారు. పరుగుల విషయంలో సచిన్‌ను (15921) వెంటాడుతున్న రూట్ (14208).. ఇప్పుడు మ్యాచ్‌ల విషయంలోనూ అతడి రికార్డును చెరిపి వేసే దిశగా ముందుకు సాగుతున్నాడు.
కుప్పకూలిన పాక్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 133 పరుగులకే కుప్పకూలింది. పేసర్లు ఓల్లీ రాబిన్సన్ (3-15), జోఫ్రా ఆర్చర్ (3-25), జోష్ టంగ్ (4-42) ధాటికి పాక్ బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది.
పాక్ ఇన్నింగ్స్‌లో కేవలం ముగ్గురు (సౌద్ షకీల్ (43), మొహమ్మద్ అబ్బాస్ (21), రజావుల్లా (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఆ జట్టు స్టార్ బ్యాటర్‌గా చెప్పుకునే బాబర్ ఆజం 7 పరుగులు మాత్రమే చేసి జోష్ టంగ్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మిగతా ప్లేయర్లలో సైమ్ అయూబ్ 0, అజాన్ అవైస్ 9, అబ్దుల్లా షఫీక్ 3, షాన్ మసూద్ 5, ఘాజీ ఘోరి 4, మొహమ్మద్ ఇమ్రాన్ 5 పరుగులు మాత్రమే చేశారు.
కాగా, మూడు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి ఇంగ్లండ్ ఇదివరకే సిరీస్‌ను కైవసం చేసుకుంది.
చదవండి: నిప్పులు చెరిగిన ఇంగ్లండ్ పేసర్లు


