source: X
పాకిస్తాన్‌తో ఇవాళ మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ పేసర్ ఓల్లీ రాబిన్సన్ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో సైమ్ అయూబ్‌ను ఔట్ చేయడంతో అతడు టెస్ట్‌ల్లో 100 వికెట్లు (24వ టెస్ట్‌లో) పూర్తి చేశాడు. తద్వారా గత 100 ఏళ్లలో అతి తక్కువ సగటుతో (19.34) 100 వికెట్లు పూర్తి చేసిన బౌలర్‌గా నిలిచాడు.
టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా 20 కంటే తక్కువ సగటుతో 100 వికెట్లు పూర్తి చేసినప్పటికీ.. అతడి సగటు రాబిన్సన్ సగటు కంటే కాస్త ఎక్కువగా (19.79) ఉంది. మొత్తంగా గడిచిన 100కు పైగా సంవత్సరాల్లో రాబిన్సన్, బుమ్రా మినహా 20 కంటే తక్కువ సగటులో 100 వికెట్లు తీసిన బౌలరే లేడు.
చివరిగా ఇంగ్లండ్‌కే చెందిన సిడ్నీ బార్న్స్ 1901-1914 మధ్యలో 20 కంటే తక్కువ సగటుతో (16.43) 100 వికెట్లు పూర్తి చేశాడు. ఓవరాల్‌గా టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఏడుగురు మాత్రమే 20 కంటే తక్కువ సగటుతో 100 వికెట్లు పూర్తి చేశారు. ఈ జాబితాలో సిడ్నీ బార్న్స్ టాప్‌లో ఉండగా.. రాబిన్సన్, బుమ్రా ఆరు, ఏడు స్థానాల్లో నిలిచారు.
అద్భుతమైన పునరాగమనం
2026లో టెస్టు జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత 32 ఏళ్ల రాబిన్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల న్యూజిలాండ్ సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతడు, పాకిస్తాన్‌తో తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 8 వికెట్లు తీసి మరోసారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ప్రస్తుతం పాక్‌తో జరుగుతున్న మూడో టెస్ట్‌లో రాబిన్సన్ మరోసారి చెలరేగడంతో పాక్ పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాబిన్సన్ (2-8)తో పాటు జోఫ్రా ఆర్చర్ (2-18), జోష్ టంగ్ (2-8) నిప్పులు చెరగడంతో పాక్ 64 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పతనం అంచుల్లో ఉంది. సౌద్ షకీల్ (29), మొహమ్మద్ ఇమ్రాన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. కాగా, మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఇంగ్లండ్ ఇదివరకే 2-0తో కైవసం చేసుకుంది.
చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్


