PC: X/PCB
పాకిస్తాన్ క్రికెట్‌లో తలెత్తిన తాజా సంక్షోభంపై ఆ జట్టు మాజీ హెడ్‌కోచ్ జేసన్ గిల్లెస్పి ఘాటుగా స్పందించాడు. ప్యాంట్లు మార్చినంత తేలికగా.. ఎప్పుటికప్పుడు పాక్ జట్టు యాజమాన్యం తమ ప్రణాళికలు, ఆలోచనలు మార్చుకుంటుందని ఘాటు విమర్శలు చేశాడు.
కోచ్, ఆటగాళ్లపై వేటు
కాగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, జట్టులో నిలకడ ఉండదన్న సంగతి తెలిసిందే. ఎప్పుటికప్పుడు అక్కడ కోచ్‌లు, కెప్టెన్లు మారిపోతూ ఉంటారు. తాజాగా ఇంగ్లండ్ పర్యటన సందర్భంగా ఈ విషయం మరోసారి నిరూపితమైంది. ఆతిథ్య జట్టుతో రెండు టెస్టుల్లో ఓడిపోగానే.. పాక్ బోర్డు అనూహ్య నిర్ణయం తీసుకుంది. టెస్టు జట్టు హెడ్‌కోచ్ సర్ఫరాజ్ అహ్మద్, బౌలింగ్ కోచ్ ఉమర్ గుల్‌పై వేటు వేసింది.
అదే విధంగా.. దాదాపు ఏడు మంది ఆటగాళ్లను జట్టు నుంచి విడుదల చేసి స్వదేశానికి పిలిపించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, 2024లో పాక్ జట్టుకు ఎనిమిది నెలల పాటు హెడ్‌కోచ్‌గా వ్యవహరించిన గిల్లెస్పి స్పందించాడు. ఆస్ట్రేలియాకు చెందిన వార్తా సంస్థతో మాట్లాడుతూ..
వాళ్లను చూస్తే జాలేస్తోంది
‘‘పాపం పాకిస్తాన్ ఆటగాళ్లను చూస్తే జాలేస్తోంది. వాళ్ల జీవనాధారం ఆట. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే భయంతోనే వాళ్లంతా ఆ జట్టులో ఉన్నారని ఎవరికైనా అర్థమైపోతుంది. సల్మాన్ అలీ ఆఘా తొలి టెస్టులో కెప్టెన్‌గా ఉన్నాడు. రెండో టెస్టు నుంచి అతడిని తొలగించారు.
మూడో టెస్టుకు ముందు స్వదేశానికి పిలిపించారు. అసలు ఇదేం తీరు? దీనిని బట్టి సెలక్షన్ కమిటీ ఎంత గందరగోళంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆకిబ్ జావేద్ వచ్చిన తర్వాత సెలక్షన్ కమిటీ చెత్తగా మారిపోయింది. ప్యాంట్లు మార్చినంత తేలికగా వాళ్లు నిర్ణయాలు మార్చేసుకుంటారు.
నీకసలు సెన్స్ ఉందా?
ఆకిబ్ జావేద్ ఇటీవల నాపై, గ్యారీ కిర్‌స్టెన్‌పై నిందలు వేశాడు. మా వల్ల జట్టు వెనుకబడిందన్నాడు. మరి గత రెండేళ్లుగా అతడే సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా ఉన్నాడు. అప్పుడు కూడా జట్టు పరిస్థితి ఇదే విధంగా ఉండేది. కానీ అతడు మమ్మల్ని నిందిస్తున్నాడు.
అసలు సెన్స్ ఉన్నవాళ్లు ఎవరూ ఆకిబ్‌లా మాట్లాడరు. ఆకిబ్ ముందు తనను తాను అద్దంలో చూసుకోవాలి. తన తప్పుల్ని తెలుసుకోవాలి. అసలు ఆకిబ్ జావేద్‌కు ఇతర సెలక్టర్లతో సత్సంబంధాలు ఉన్నాయో లేదో? ఈ విషయాన్ని పక్కనపెడితే వారితో అసలు మాట్లాడుతూ వారి ఆలోచనలు కూడా తెలుసుకుంటున్నాడా? లేదా అన్నదే ప్రశ్న.
ఆటగాళ్లు జట్టులో తాము స్థానం కోల్పోయిన విషయాన్ని మీడియా ద్వారానో.. కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారానో తెలుసుకోవడం కంటే చెత్త విషయం మరొకటి ఉండదు. ఇది వారిని అగౌరవపరచడమే’’ అని జేసన్ గిల్లెస్పి పాక్ బోర్డు, చీఫ్ సెలక్టర్ ఆకిబ్ జావేద్ తీరుపై నిప్పులు చెరిగాడు.
చదవండి: సౌతాఫ్రికా ఓపెనర్ ప్రపంచ రికార్డు.. వైభవ్ సూర్యవంశీకి ఛాలెంజ్!


