అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరం కానున్నాడా? అంటే 'అవును' అనే అంటున్నాయి బీసీసీఐ వర్గాలు. అఫ్గాన్‌తో టీ20 సిరీస్‌తో పాటు ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్లలో బుమ్రా పేరు ఉన్నప్పటికీ, అతడికి ఇంకా బీసీసీఐ వైద్య బృందం నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ రాలేదు.
బుమ్రా ప్రస్తుతం బెంగళూరులోని 'బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్'లో పునరావాసం పొందుతున్నాడు. అతడు తన మోకాలి గాయం నుంచి కోలుకునే క్రమంలో ఉన్నాడు. అయితే బుమ్రా పూర్తి ఫిట్‌నెస్ సాధించకుండా మైదానంలోకి దించి రిస్క్ తీసుకోకూడదని బీసీసీఐ భావిస్తోంది. ఈ సిరీస్ కోసం శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు సెప్టెంబర్ 10 నుంచి ఢిల్లీలో ప్రాక్టీస్ మొదలుపెట్టనుంది.
అంతకంటే ముందే బుమ్రాతో పాటు నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణాలకు ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో ఉత్తీర్ణత సాధిస్తేనే వారు జట్టుతో కలిసే అవకాశముంది. అయితే బుమ్రా ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత లేకపోవడంతో అతడికి ప్రత్యామ్నాయంగా ప్రిన్స్ యాదవ్‌ను జట్టులోకి తీసుకోవాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం.
ఇప్పటికే టీమిండియా తరఫున ఆరు టీ20లు ఆడిన ప్రిన్స్.. 9 వికెట్లు పడగొట్టి ఆకట్టుకున్నాడు. అయితే బుమ్రా, హర్షిత్ రాణా వంటి ప్లేయర్లు రీఎంట్రీ ఇవ్వడంతో ప్రిన్స్ టీ20 జట్టులో చోటు కోల్పోయాడు. ఇప్పుడు బుమ్రా ఇంకా కోలుకోకపోవడంతో ప్రిన్స్ మళ్లీ తిరిగి జట్టులోకి వచ్చే అవకాశముంది.
ప్రిన్స్‌కు అద్భుతమైన బౌలింగ్ స్కిల్స్ ఉన్నాయి. పవర్ ప్లేతో పాటు డెత్ ఓవర్లలోనూ పరుగులను కట్టడి చేసే సత్తా అతడికి ఉంది. అంతేకాకుండా పిన్ పాయింట్ యార్కర్లు వేయడంలో అతడు దిట్ట. ఇక అఫ్గాన్-భారత్ మధ్య మూడు మ్యాచ్‌ల సిరీస్ సెప్టెంబర్ 13 నుంచి ప్రారంభం కానుంది.
ఆసియా క్రీడల కోసం భారత పురుషుల జట్టు:
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, సంజు శాంసన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, రవి బిష్ణోయ్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా.


