అంతా బాగుంది! | Secretary Devajit Saikia on the BCCI review | Sakshi
Sakshi News home page

అంతా బాగుంది!

Sep 4 2026 1:14 AM | Updated on Sep 4 2026 1:14 AM

Secretary Devajit Saikia on the BCCI review

బోర్డు, సీఓఈ మధ్య ఎలాంటి సమస్యా లేదు 

బీసీసీఐ సమీక్షపై కార్యదర్శి సైకియా  

ముంబై: భారత క్రికెట్‌ జట్టు ఇటీవలి ప్రదర్శనకు సంబంధించి బీసీసీఐ గురువారం నిర్వహించిన సమీక్షా సమావేశం ఎలాంటి హడావిడి, కొత్త నిర్ణయాలేమీ లేకుండానే ముగిసింది. అజెండాలో చర్చించే పలు అంశాల గురించి ఈ సమావేశానికి ముందు బయట చర్చ జరిగినా... చివరకు సాధారణ సమీక్షగానే ఇది ముగిసింది. బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా నేతృత్వంలో జరిగిన ఈ మీటింగ్‌లో వన్డే, టి20 జట్ల కెప్టెన్లు శుబ్‌మన్‌ గిల్, శ్రేయస్‌ అయ్యర్, హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్, సీఓఈ డైరెక్టర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ పాల్గొన్నారు. వ్యక్తిగత కారణాలతో చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ దీనికి హాజరు కాలేదు. 

టీమ్‌ మేనేజ్‌మెంట్, సెలక్టర్లు, సీఓఈ మధ్య మంచి సమన్వయం ఉందని, సమాచారం విషయంలో ఎలాంటి సమస్యా లేదని దేవజిత్‌ సైకియా వెల్లడించారు. అయితే ఏడాదిలో ఎక్కువ మ్యాచ్‌లు ఆడటం కారణంగానే మన ఆటగాళ్లు తరచుగా గాయపడుతున్నారని, ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ షెడ్యూల్‌ రూపొందిస్తామని ఆయన వ్యాఖ్యానించారు. ‘బీసీసీఐలో అంతా కలిసి బాగా పని చేస్తున్నారు. అందరి ఆలోచననలు ఒకే తరహాలో ఉన్నాయి. కోచ్‌లు, సహాయక సిబ్బంది, మహిళల జట్టు కమిటీలు, సీఓఈ... ఇలా అన్నింటి మధ్య సమన్వయం బాగుంది. కాబట్టి అంతా సరైన దిశలోనే నడుస్తోంది. 

అయితే ఏడాదిలో చాలా ఎక్కువ మ్యాచ్‌లు ఉండటమే ప్రస్తుతం కొంత ఇబ్బందిగా మారింది. దీనిపై తగిన విధంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని షెడ్యూల్‌ తయారు చేసే ఎఫ్‌టీపీ బృందానికి చెప్పాం. మ్యాచ్‌ల మధ్య తగినంత విరామం ఉండేలా చూడమని వారికి సూచించాం. పైగా ప్రతీ విదేశీ సిరీస్‌కు ముందు అక్కడి వాతావరణానికి అలవాటు పడే విధంగా కొన్ని ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఉండేలా చూడామని కూడా వివరించాం’ అని సైకియా చెప్పారు. ఇటీవలి ఐర్లాండ్, ఇంగ్లండ్, శ్రీలంక పర్యటనల్లో భారత జట్టు ప్రదర్శన గురించి చర్చించామని, 2027 వరల్డ్‌ కప్‌ సహా వచ్చే ఏడాది మ్యాచ్‌లపై తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఆయన అన్నారు.  

రోహిత్‌ నుంచి ఇంకేం కావాలి! 
భారత జట్టు రోహిత్‌ శర్మ స్థానం, అతని భవిష్యత్తు గురించి కూడా సమావేశంలో చర్చి జరిగిందంటూ వచ్చిన వార్తలను సైకియా కొట్టిపారేశారు. ‘రోహిత్‌ శర్మ అన్ని మ్యాచ్‌లలో చాలా బాగా ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి వన్డేలో 138 పరుగులు చేశాడు. అతడి నుంచి ఇంకా ఏం ఆశిస్తున్నారు. అసలు ఈ సమయంలో అలాంటి ఊహాగానాలు ఎందుకు. వాటికి నేను మరింత ఊతం ఇవ్వను’ అని సైకియా స్పష్టం చేశారు. 

సెలక్టర్‌గా అజిత్‌ అగార్కర్‌ పదవీకాలం అక్టోబర్‌ 4న ముగియనుండగా... అతని కాంట్రాక్ట్‌ కొనసాగింపు విషయంపై అసలు చర్చించనే లేదని ఆయన పేర్కొన్నారు. మరోవైపు భారత క్రికెట్‌కు డైరెక్టర్‌ హోదాలో వీవీఎస్‌ లక్ష్మణ్‌ను ఎంపిక చేయవచ్చంటూ వినిపిస్తున్న మాటలు కూడా ఉత్త పుకార్లేనని సైకియా చెప్పారు. దీనిపై కూడా చర్చించలేదని, డైరెక్టర్‌ పదవి గురించే బోర్డు ఆలోచన లేదని ఆయన పునరుద్ఘాటించారు. సీఓఈలో కొత్తగా హెడ్‌ ఆఫ్‌ స్పోర్ట్స్‌ సైన్స్‌ అండ్‌ మెడిసిన్‌ను త్వరలోనే నియమిస్తామన్న కార్యదర్శి...ప్రస్తుతం ఆ పదవిలో ఎవరూ లేకపోయినా సీఓఈ సమర్థంగానే పని చేస్తోందని స్పష్టం చేశారు.  

గంభీర్‌దే తుది నిర్ణయం... 
ఆదివారం నుంచి చెన్నైలో జరిగే దులీప్‌ ట్రోఫీ ఫైనల్లో సౌత్‌జోన్‌ తరఫున కేఎల్‌ రాహుల్, దేవదత్‌ పడిక్కల్, మొహమ్మద్‌ సిరాజ్‌ బరిలోకి దిగుతారు. ఈ మ్యాచ్‌లో ఆడాల్సిందిగా ఇప్పటికే వారికి బోర్డు సూచించింది. అయితే 13 నుంచి అఫ్గానిస్తాన్‌తో టి20 సిరీస్‌ ప్రారంభం కానున్న నేపథ్యంలో తిలక్‌ వర్మ, వైభవ్‌ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్‌ ఈ మ్యాచ్‌ ఆడటంపై సందేహాలు ఉన్నాయి. వీరు ఆడాలా లేదా అనే అంశంపై హెడ్‌ కోచ్‌ గౌతమ్‌ గంభీర్‌ తుది నిర్ణయం తీసుకుంటారని సైకియా చెప్పారు. దులీప్‌ ట్రోఫీ ఫైనల్‌ను చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కూడా చూస్తారని ఆయన వెల్లడించారు.  

జపాన్‌కు నెట్‌ బౌలర్లు... 
జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత జట్టు ప్రాక్టీస్‌లో సహకరించేందుకు ముగ్గురు పేస్‌ బౌలర్లను బోర్డు ఎంపిక చేసింది. మయాంక్‌ యాదవ్, కార్తీక్‌ త్యాగి, మొహసిన్‌ ఖాన్‌లు టీమ్‌తో వెళ్లనున్నారు. వీరి వీసాల కోసం ప్రయత్నిస్తున్న బోర్డు... కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా తమ సొంత ఖర్చులతో ఈ ముగ్గురిని పంపనుంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement