PC: BCCI/X
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సమీక్షా సమావేశం గురువారం ముంబైలో జరిగింది. టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్, వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ శుబ్‌మన్ గిల్, టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఈ సమావేశానికి హాజరయ్యారు.
అయితే, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ మాత్రం మీటింగ్‌కు రాలేదు. కాగా యూకే పర్యటనలో టీమిండియా ఘోర పరాభవాలు చవిచూసిన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌లలో ఐర్లాండ్ చేతిలో 2-0, ఇంగ్లండ్ చేతిలో 4-0తో వైట్‌వాష్ అయిన భారత జట్టు.. ఇంగ్లండ్‌తో వన్డేల్లోనూ 1-2తో ఓటమిపాలైంది.
రోహిత్ విషయంలో మరోసారి వదంతులు
ఈ నేపథ్యంలో జూలైలోనే సమీక్షా సమావేశం నిర్వహించాల్సి ఉండగా.. శ్రీలంక పర్యటన కారణంగా వాయిదా పడింది. అయితే, గురువారం జరిగిన ఈ రివ్యూ మీటింగ్‌లోనే టీమిండియా దిగ్గజం రోహిత్ శర్మ భవితవ్యంపై కూడా చర్చ జరుగనుందనే వార్తలు వచ్చాయి.
వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి సెలక్టర్లు అతడి పేరును పరిగణనలోకి తీసుకోవడం లేదనే ఊహాగానాలు వినిపించాయి. రిటై ర్మెంట్ తీసుకునేలా అతడిపై ఒత్తిడి పెరిగిందనే రూమర్లు వినిపించాయి.
ఆజ్యం పోయాలనుకోవడం లేదు
ఈ విషయంపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు. సమావేశం అనంతరం మాట్లాడుతూ.. ‘‘రోహిత్ శర్మ బాగా ఆడుతున్నాడు. వదంతులకు నేను ఆజ్యం పోయాలనుకోవడం లేదు. అతడు అన్ని మ్యాచ్‌లలోనూ మంచి ప్రదర్శనలు ఇస్తున్నాడు.
ఇంతకంటే ఇంకేం కావాలి? చివరగా లార్డ్స్‌లో ఆడిన వన్డేలో అతడు 130-140 పరుగులు సాధించాడు. అయినా ఇంకా ఎందుకీ ప్రచారం? వదంతులు వ్యాప్తి చేసే వారికి నేను ఊతం ఇవ్వాలని అనుకోవడం లేదు’’ అని సైకియా పేర్కొన్నారు.
అయితే, వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో రోహిత్‌ను కచ్చితంగా ఆడిస్తామని మాత్రం సైకియా చెప్పలేకపోయారు. దీంతో యాజమాన్యం తీరుపై అభిమానులలో మరోసారి సందేహాలు రేకెత్తాయి. ఇదిలా ఉంటే.. అజిత్ అగార్కర్ సమావేశానికి హాజరుకాకపోవడంపై కూడా సైకియా స్పందించారు. మీటింగ్ గురించి ముందుగా సమాచారం ఇవ్వలేకపోయామని.. అందుకే అగార్కర్ రాలేదని పేర్కొన్నారు.


