PC: BCCI/X
ఆసియా క్రీడలు-2026 టోర్నీలో పాల్గొనబోయే భారత పురుషుల క్రికెట్ జట్టుకు.. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ క్రికెట్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ మార్గదర్శనం చేయనున్నాడు. జపాన్‌లో టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో గౌతం గంభీర్‌కు బదులు లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనున్నాడు. కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
గత ఎడిషన్‌లోనూ..
కాగా చైనా వేదికగా ఆసియా క్రీడల గత ఎడిషన్‌లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి భారత జట్టు పాల్గొంది. అప్పుడు కూడా లక్ష్మణ్ మార్గదర్శనం చేయగా.. భారత్ స్వర్ణ పతకం సాధించింది. అయితే, ఈసారి మాత్రం శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ప్రధాన టీ20 జట్టును భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) జపాన్‌కు పంపేందుకు సిద్ధమైంది.

PC: BCCI/X
ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది. కాగా ఆసియా క్రీడల్లో వీవీఎస్ లక్ష్మణ్ భారత టీ20 జట్టుకు మార్గదర్శనం చేయనుండగా.. గంభీర్ స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగే వన్డే సిరీస్‌తో బిజీగా ఉండనున్నాడు.
అసిస్టెంట్ కోచ్‌లు వీరే
ఇక కేంద్ర యువజన, క్రీడా మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఆసియా క్రీడల్లో టీమిండియాకు లక్ష్మణ్ హెడ్‌కోచ్‌గా వ్యవహరించనుండగా.. సునిల్ జోషి, హృషికేశ్ కనితక్కర్, శుభదీప్ ఘోష్ అతడికి అసిస్టెంట్లుగా పనిచేయనున్నారు. కాగా జపాన్‌లోని ఐచి- నగోయా వేదికగా సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 4 మధ్య ఆసియా క్రీడల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
ఆసియా క్రీడల్లో పాల్గొనే భారత పురుషుల టీ20 క్రికెట్ జట్టు
శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శివం దూబే, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయి, జస్‌ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, వైభవ్ సూర్యవంశీ.
చదవండి: IND vs AFG: అతడిని ఎందుకు తప్పించారో సెలక్టర్లకే తెలియాలి


