PC: BCCI/IPL
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో అత్యంత విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్ కింగ్స్ ఒకటి. ముంబై ఇండియన్స్ తర్వాత ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన జట్టు సీఎస్‌కే. టీమిండియా దిగ్గజం మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో సీఎస్‌కే ఈ ఘనత సాధించింది.
అయితే, ధోని కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకొన్న తర్వాత సీఎస్‌కే పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ధోని వారసుడిగా 2022లో రవీంద్ర జడేజాను ఎంపిక చేయగా.. వరుస ఓటములు నేపథ్యంలో మధ్యలోనే అతడు వైదొలిగాడు. దీంతో మరోసారి పగ్గాలు చేపట్టిన ధోని.. ఆ మరుసటి ఏడాది జట్టుకు ట్రోఫీ అందించాడు.
పేలవ ప్రదర్శన
ఆ తర్వాత రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోగా.. అతడి సారథ్యంలో సీఎస్‌కే అనుకున్న ఫలితాలు రాబట్టలేకపోయింది. గత మూడు సీజన్లలో ఒక్కసారి కూడా ప్లే ఆఫ్స్ చేరలేకపోయింది. అంతేకాదు.. ఈ ఏడాది మరీ దారుణంగా ఎనిమిదో స్థానంలో నిలిచింది. ఇక గాయం వల్ల రుతు కూడా జట్టుకు చాలాసార్లు దూరమయ్యాడు.
ఈ నేపథ్యంలో భారత మాజీ ఓపెనర్ సదగోపన్ రమేశ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. కెప్టెన్‌గా రుతురాజ్‌ను తొలగించి.. అతడి స్థానంలో సంజూ శాంసన్‌కు బాధ్యతలు అప్పగించాలని సీఎస్‌కే యాజమాన్యానికి సూచించాడు.
అత్యుత్తమ ఎంపిక అతడే
‘‘కెప్టెన్ విషయంలో మార్పు అనివార్యమని సీఎస్‌కే భావిస్తున్నట్లుగా ఉంది. ఒకవేళ అదే నిజమై.. కెప్టెన్‌ను మార్చాలనుకుంటే సంజూ శాంసన్ అత్యుత్తమ ఎంపిక అవుతాడు. అతడు అద్భుతమైన టీమ్ ప్లేయర్. నిజంగానే చెన్నై కెప్టెన్‌ను మార్చాల్సిన సమయం వచ్చింది. సంజూ పేరును పరిగణనలోకి తీసుకోండి. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా 66 మ్యాచ్‌లు ఆడి 33 గెలిచిన ఘనత అతడిది.
సంజూ సారథ్యంలో రాజస్తాన్ రాయల్స్ ఓసారి ఫైనల్ చేరింది. మరోసారి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. కెప్టెన్‌గా అతడి విజయాల శాతం ఎక్కువే. సీఎస్‌కేలో ఎన్నో మార్పులు చేయాల్సి ఉంది.
ముఖ్యంగా కెప్టెన్ మార్పు తథ్యం. సంజూకు బాధ్యతలు ఇచ్చిన వెంటనే ట్రోఫీ గెలవకపోవచ్చు. కానీ జట్టును ఆ దిశగా తీర్చిదిద్ది మున్ముందు మంచి ఫలితాలు సాధించగలడు’’ అని సదగోపన్ రమేశ్ పేర్కొన్నాడు.
కాగా ఐపీఎల్-2026 వేలానికి ముందు చెన్నై రవీంద్ర జడేజా, సామ్ కర్రాన్‌లను రాజస్తాన్‌కు ట్రేడ్ చేసి.. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్‌ను తీసుకుంది. ఈ ఏడాది సంజూ సీఎస్‌కే తరఫున 14 మ్యాచ్‌లలో కలిపి 477 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉన్నాయి.
చదవండి: నా అభిమాని.. పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూంటాడు


