సౌతాఫ్రికా వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్-2027కు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికి.. బీసీసీఐ ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా మెగా టోర్నీకి ముందు ఆటగాళ్లను అక్కడి పరిస్థితులను అలవాటు చేసేందుకు, ఆతిథ్య జట్టు దక్షిణాఫ్రికాతో 4 నుంచి 6 వన్డేల సిరీస్ ఆడేలా బీసీసీఐ ప్లాన్ చేస్తోంది.
ఇదే విషయంపై ఇప్పటికే బీసీసీఐ పెద్దలు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. కాగా భారత జట్టు చివరిసారిగా 2024లో టీ20 సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్ళింది. ప్రస్తుత ఎఫ్‌టీపీ (FTP) షెడ్యూల్‌లో భారత్-సౌతాఫ్రికాల మధ్య వన్డే సిరీస్ ఏదీ లేదు. అయితే భారత టీమ్ మేనేజ్‌మెంట్ అభ్యర్థన మేరకు ఈ ప్రత్యేక సిరీస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
"నూతన ఎఫ్‌టీపీ ఇంకా ఖరారు కాలేదు. కాబట్టి ప్రపంచకప్‌నకు ముందు ఈ వన్డే సిరీస్ నిర్వహించడానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు" అని సదరు అధికారి పేర్కొన్నారు. కాగా సవాలుతో కూడుకున్న దక్షిణాఫ్రికా కండిషన్స్‌లో ముందస్తుగా సిరీస్ ఆడటం వరల్డ్ కప్ నాటికి భారత్‌కు ఎంతో ప్రయోజనకరంగా మారనుంది.
ఇక గత ప్రపంచకప్‌లో తుది మెట్టుపై బోల్తా పడిన భారత జట్టు.. ఈసారి మాత్రం ఎలాగైనా టైటిల్ గెలిచి తమ 15 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని పట్టుదలతో ఉంది. దక్షిణాఫ్రికా వేదికగా వన్డే ప్రపంచకప్ జరగనుండడం 24 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిగా 2003లో పూర్తిస్థాయిలో వన్డే వరల్డ్ కప్‌కు సఫారీలు ఆతిథ్యమిచ్చారు.
చదవండి: CPL 2026: పెద్దోడి మెరుపులు.. వణికిపోయిన సీఎస్‌కే బౌలర్


