లబుషేన్ (PC: CA/X)
సౌతాఫ్రికా, జింబాబ్వేతో వన్డే సిరీస్‌లకు క్రికెట్ ఆస్ట్రేలియా తమ జట్టును ప్రకటించింది. వన్డే ప్రపంచకప్-2027 ప్రణాళికల్లో భాగంగా ఆడబోయే ఈ సిరీస్ నుంచి మార్నస్ లబుషేన్‌ను తప్పించింది. తద్వారా మెగా ఈవెంట్లో అతడి సేవలు అవసరం లేదనే సంకేతాలు ఇచ్చింది.
కీలక పాత్ర
కాగా సౌతాఫ్రికాలో జన్మించిన లబుషేన్.. 2022 నుంచి ఆస్ట్రేలియా జాతీయ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు. భారత్‌లో 2023లో జరిగిన వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో ఆసీస్ టైటిల్ గెలవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే, గత కొంతకాలంగా లబుషేన్ ఫామ్‌లేమితో సతమతమవుతున్నాడు.
ఫామ్‌లేమితో సతమతం
గత రెండేళ్లుగా లబుషేన్ పేలవ ఆట తీరు కనబరుస్తున్నాడు. ఈ 32 ఏళ్ల కుడిచేతి వాటం బ్యాటర్ సగటు 2024 నుంచి 21.87గా ఉంది. అత్యుత్తమ స్కోరు 77 నాటౌట్. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా, జింబాబ్వేలతో వన్డేలు ఆడబోయే పదిహేడు మంది సభ్యులతో కూడిన జట్టు నుంచి లబుషేన్‌ను తప్పిస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు.
ఈ విషయం గురించి ఆసీస్ చీఫ్ సెలక్టర్ జార్జ్ బెయిలీ మాట్లాడుతూ.. ప్రస్తుతం వన్డే ఫార్మాట్ నుంచి మాత్రమే లబుషేన్‌ను తప్పించామని స్పష్టం చేశాడు. అతడు జట్టుకు ఎంతో సేవ చేశాడని.. కానీ ప్రపంచకప్ ప్రణాళికల్లో భాగంగా అతడిపై వేటు వేయక తప్పలేదని పేర్కొన్నాడు.
టెస్టుల్లోనూ స్థానం గల్లంతేనా?
అయితే, టెస్టుల్లోనూ లబుషేన్ స్థానం గల్లంతేనా అన్న ప్రశ్నకు మాత్రం బదులివ్వలేదు. కాగా ఇటీవల బంగ్లాదేశ్‌తో టెస్టుల్లోనూ లబుషేన్ నిరాశపరచగా.. తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. ఇదిలా ఉంటే.. ప్రపంచకప్-2027 వేదికలైన సౌతాఫ్రికా, జింబాబ్వేలతో వారి స్వదేశంలో ఆడటం తమకు సానుకూలాంశంగా మారుతుందని బెయిలీ ఈ సందర్భంగా పేర్కొన్నాడు.
కమిన్స్, స్టార్క్ ఆ సిరీస్‌లో మాత్రమే
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో వన్డేలకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ ఎంపికయ్యారు. అయితే, జింబాబ్వేతో సిరీస్‌కు మాత్రం వారు అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్ జోయెల్ డేవిస్‌తో పాటు ఒలివర్ పీక్, కూపర్ కన్నోలిలకు అవకాశం ఇచ్చారు.
కాగా ఆఫ్రికా పర్యటనలో భాగంగా ఆస్ట్రేలియా సెప్టెంబరు 15 నుంచి జింబాబ్వేతో మూడు... సెప్టెంబరు 24 నుంచి సౌతాఫ్రికాతో మూడు వన్డేలు ఆడుతుంది. ఐసీసీ వన్డే ప్రపంచకప్-2027 టోర్నీ సన్నాహకాల్లో భాగంగా ఈ టూర్‌ను ప్లాన్ చేశారు.
జింబాబ్వే, సౌతాఫ్రికాతో సిరీస్‌లకు ఆస్ట్రేలియా వన్డే జట్టు
మిచెల్ మార్ష్, ప్యాట్ కమిన్స్ (సౌతాఫ్రికా సిరీస్‌కు మాత్రమే), జేవియర్ బార్ట్‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కన్నోలి, జోయెల్ డేవిస్, నాథన్ ఎల్లిస్, కామెరాన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, స్పెన్సర్ జాన్సెన్, ఒలివిక్ పీక్, మాథ్యూ రెన్షా, బిల్లీ సాన్‌లేక్, మిచెల్ స్టార్క్ (సౌతాఫ్రికా సిరీస్‌కు మాత్రమే), ఆడం జంపా.
షెడ్యూల్
జింబాబ్వేతో వన్డే సిరీస్
👉హరారే వేదికగా- సెప్టెంబరు 15, 18, 20
సౌతాఫ్రికాతో వన్డే సిరీస్
👉డర్బన్‌లో తొలి వన్డే- సెప్టెంబరు 24
👉జొహన్నస్‌బర్గ్‌లో రెండో వన్డే- సెప్టెంబరు 27
👉పొచెఫ్‌స్ట్రూమ్‌లో మూడో వన్డే- సెప్టెంబరు 30.


