Photo Credit: Twitter
ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ టెస్టుల్లో నెంబర్‌వన్ ర్యాంకును కైవసం చేసుకున్నాడు. ఇప్పటిదాకా నంబర్‌వన్‌గా ఉన్న టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రాను వెనక్కినెట్టిన స్టార్క్ టెస్టుల్లో నంబర్‌వన్ బౌలర్‌గా అవతరించాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా మాకే వేదికగా జరిగిన రెండో టెస్టులో 10 వికెట్ల హాల్ (తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు) నమోదు చేసిన స్టార్క్ తొలిసారి తన 16 ఏళ్ల కెరీర్‌లో టెస్టుల్లో నంబర్‌వన్ ర్యాంకును అందుకోవడం విశేషం.
అది కూడా 36 ఏళ్ల వయసులో స్టార్క్ ఈ ఫీట్ సాధించడం గమనార్హం. ప్రస్తుతం స్టార్క్ 872 రేటింగ్ పాయింట్లతో తొలి స్థానంలో కొనసాగుతుండగా, భారత బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా 862 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక కివీస్ బౌలర్ మాట్ హెన్రీ 861 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు.
ఇక టాప్-10లో ఆస్ట్రేలియా నుంచే స్టార్క్ సహా మొత్తం ఐదుగురు బౌలర్లు చోటు దక్కించుకోవడం విశేషం. కెప్టెన్ కమిన్స్ నాలుగో స్థానంలో ఉండగా, స్కాట్ బోలండ్ ఏడో స్థానంలో, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్‌లు 9, 10వ స్థానాల్లో కొనసాగుతున్నారు. దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో జాన్సెన్, రబాడలు వరుసగా ఐదు, ఆరు స్థానాల్లో కొనసాగుతుండగా, పాకిస్తాన్‌కు చెందిన నోమన్ అలీ 8వ స్తానంలో ఉన్నాడు.
ఇక టీమిండియా నుంచి బుమ్రా మినహా ఏ ఒక్క బౌలర్ కూడా టాప్-10లో చోటు దక్కించుకోవడంలో విఫలమయ్యారు. మహ్మద్ సిరాజ్ 4 స్థానాలు దిగజారి 18వ స్థానంలో, జడేజా మూడు స్థానాలు దిగజారి 19వ స్థానంలో కొనసాగుతున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్‌లో స్టార్క్ రెండు టెస్టులు కలిపి 12 వికెట్లు తీయగా.. ఇందులో 10 వికెట్లు ఒకే టెస్టులో పడగొట్టడం విశేషం.
2010లో ఆస్ట్రేలియా తరఫున 20 ఏళ్ల వయసులో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిస మిచెల్ స్టార్క్ స్టార్ బౌలర్‌గా ఎదిగాడు. ఇప్పటివరకు 107 టెస్టులాడి 445 వికెట్లు, 130 వన్డేల్లో 247 వికెట్లు, 65 టీ20ల్లో 79 వికెట్లు పడగొట్టాడు.
A change at the top of the rankings for Test bowlers as an Australian quick claims the No.1 spot for the very first time 😲https://t.co/fvecGLHkbT
— ICC (@ICC) August 26, 2026


