ఆబిద్‌ మ్యాజిక్‌.. రుతురాజ్‌ సేనకు అనూహ్య ఓటమి | North zone beat West zone by 52 runs in duleep trophy 2nd quarter final | Sakshi
Sakshi News home page

ఆబిద్‌ మ్యాజిక్‌.. రుతురాజ్‌ సేనకు అనూహ్య ఓటమి

Aug 26 2026 11:41 AM | Updated on Aug 26 2026 11:48 AM

North zone beat West zone by 52 runs in duleep trophy 2nd quarter final

source: BCCI X

దులీప్‌ ట్రోఫీ 2026లో సంచలనం నమోదైంది. పెద్దగా స్టార్లు లేని నార్త్‌ జోన్‌ జట్టు, స్టార్లతో నిండిన వెస్ట్‌ జోన్‌ జట్టుకు ఊహించని షాకిచ్చింది. ఇవాళ తొలి సెషన్‌లోనే ముగిసిన క్వార్టర్‌ ఫైనల్‌-2లో నార్త్ జోన్ 52 పరుగుల తేడాతో వెస్ట్ జోన్‌ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

చివరి రోజు మ్యాచ్ ఉత్కంఠగా ప్రారంభమైనప్పటికీ.. అబిద్ ముష్తాక్, నిశాంత్ సింధు కేవలం 6.3 ఓవర్లలోనే మ్యాచ్‌ను ముగించారు.

ఆబిద్‌ మాయాజాలం
జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఎడమచేతి స్పిన్ ఆల్‌రౌండర్ ఆబిద్ ముస్తాక్‌ ఈ మ్యాచ్‌లో మ్యాజిక్‌ చేశాడు. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 9 వికెట్లు పడగొట్టి నార్త్ జోన్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు.

వెస్ట్ జోన్ 234 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో చివరి రోజు 67 పరుగులు చేయాల్సి ఉండగా, నార్త్ జోన్‌కు మూడు వికెట్లు మాత్రమే కావాల్సి ఉండింది. క్రీజ్‌లో ఉర్విల్‌ పటేల్‌ లాంటి పేరొందిన బ్యాటర్‌ ఉన్నాడు. తనుశ్‌ కోటియన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, తుషార్‌ దేశ్‌పాండే బ్యాటింగ్‌కు రావాల్సి ఉండింది.

అయితే ఆట ప్రారంభమైన రెండో బంతికే ముస్తాక్ తనుశ్‌ కోటియన్‌ను క్లీన్‌ బౌల్డ్ చేసి నార్త్‌ జోన్‌ను విజయానికి చేరువ చేశాడు. ఆ తర్వాత ముస్తాక్‌ తుషార్ దేశ్‌పాండేను కూడా ఔట్‌ చేయగా.. మరో మూడు బంతుల వ్యవధిలో నిశాంత్ సింధు ఉర్విల్ పటేల్‌ను ఎల్బీడబ్ల్యూ చేయడంతో వెస్ట్‌ జోన్‌ ఓటమిపాలైంది.

మ్యాచ్‌ మొత్తంలో అద్భుతంగా బౌలింగ్‌ (9-99) చేసిన ఆబిద్‌కు ప్లేయర్‌గా అఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు లభించింది. నార్త్‌ జోన్‌ తరఫున ఆయుశ్‌ బదోని (51, 50), అర్ష్‌దీప్ సింగ్ (4 వికెట్లు), అన్షుల్ కాంబోజ్ (60, 22, 3 వికెట్లు) కీలక ప్రదర్శనలు చేశారు. నిన్ననే ముగిసన తొలి క్వార్టర్‌ ఫైనల్లో ఈస్ట్‌ జోన్‌ నార్త్‌ ఈస్ట్‌ జోన్‌పై ఇన్నింగ్స్‌ 210 పరుగుల తేడాతో గెలుపొంది సెమీస్‌కు దూసుకెళ్లింది.

సెమీఫైనల్లో ఎవరెవరు..?
ఆగస్ట్‌ 30న మొదలయ్యే తొలి సెమీస్‌లో ఈస్ట్‌ జోన్‌ జట్టు రజత్ పాటిదార్ నేతృత్వంలోని డిఫెండింగ్ ఛాంపియన్స్ సెంట్రల్‌ జోన్‌ను ఢీకొట్టనుంది. ఆగస్ట్‌ 30ననే మొదలయ్యే రెండో సెమీస్‌లో నార్త్‌ జోన్‌ జట్టు తిలక్ వర్మ నేతృత్వంలోని సౌత్‌ జోన్‌లో తలపడుతుంది.

చదవండి: ఇన్నింగ్స్‌ తేడాతో గెలిచిన ఇషాన్‌, వైభవ్‌ జట్టు

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement